సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ)కి ఊరట లభించింది. ఏ1 నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేసింది తెలంగాణ హైకోర్టు. ఈ మేరకు వచ్చే నెల 5వ తేదీలోగా హైదరాబాద్ సీబీఐ కోర్టులో లొంగిపోవాలని గంగిరెడ్డిని ఆదేశించింది. ఒకవేళ లొంగిపోకపోతే.. గంగిరెడ్డిని అరెస్ట్ చేయవచ్చని సీబీఐకి తెలిపింది న్యాయస్థానం.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో.. ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉన్నాడు ప్రధాన నిందితుడు (ఏ–1) ఎర్ర గంగిరెడ్డి. అయితే.. బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వివేకా కేసు విచారణ జరుపుతున్న తెలంగాణ హైకోర్టులో సీబీఐ ఓ పిటిషన్ దాఖలు చేసింది. వివేకా హత్యకు కుట్ర పన్నింది ఎర్ర గంగిరెడ్డేనని, దాన్ని అమలు చేయడంలోనూ అతనిది కీలక పాత్ర అని దర్యాప్తు సంస్థ వాదనలు వినిపించింది. అంతేకాదు.. సాక్ష్యాలు తారుమారు చేయడంలోనూ అతను కీలకంగా వ్యవహరించాడని పేర్కొంది. గంగిరెడ్డి గనుక బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారు కాబట్టి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ వాదించింది.
అయితే.. గంగిరెడ్డి డీఫాల్ట్ బెయిల్‌ను రద్దు చేయించాలని సీబీఐ పలుమార్లు ప్రయత్నించి విఫలమైందని అతని తరపున న్యాయవాది వాదించారు. సీబీఐ దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్లను.. కడప కోర్టు, ఏపీ హైకోర్టు కూడా కొట్టివేశాయని ప్రస్తావించారు. బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టు కూడా చెప్పలేదని తెలంగాణ హైకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ హత్యతో గంగిరెడ్డికి సంబంధం లేదని, బెయిల్‌ను రద్దు చేయాల్సిన అవసరం లేదని తెలంగాణ హైకోర్టు బెంచ్‌కు విజ్ఞప్తి చేశారు.
అయితే వాదనలు విన్న ఏకసభ్య బెంచ్.. సీబీఐ వాదనతోనే ఏకీభవించింది. దర్యాప్తు దశలో.. గంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. మే 5వ తేదీలోపు సీబీఐ కోర్టులో గంగిరెడ్డి లొంగిపోవాలని, లేకుంటే అరెస్ట్ చేసుకోవచ్చని దర్యాప్తు సంస్థకు సూచించింది హైకోర్టు. అలాగే.. రెండు నెలల్లోపు వివేకా కేసులో సీబీఐ దర్యాప్తు పూర్తి చేయాలని, జూన్ 30వ తేదీ వరకు మాత్రమే గంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేస్తున్నట్లు తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. జులై 1వ తేదీ తర్వాత గంగిరెడ్డికి తిరిగి బెయిల్ ఇవ్వొచ్చని ట్రయల్ కోర్టుకు తెలిపింది హైకోర్టు.
2019 అక్టోబర్‌లో వివేకా కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డికి డీఫాల్ట్ బెయిల్ ఇచ్చింది పులివెందుల కోర్టు. ఆపై 2021లో ఎర్ర గంగిరెడ్డిపై సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఏ1గా కేసును ప్రభావితం చేసే అవకాశం ఉన్నందునా.. బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోరుతూ వస్తోంది.
ఇదీ చదవండి: వివేకా రెండో భార్య సంచలన స్టేట్‌మెంట్
Comments
Please login to add a commentAdd a comment