సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి.. తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఉన్నత న్యాయస్థానం. ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌పై ఇవాళ తుది తీర్పు వెలువరించిన హైకోర్టు వెకేషన్ బెంచ్.. బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది.
అవినాష్‌రెడ్డి లాయర్ల వాదనలతో ఏకీభవించిన హైకోర్టు బెంచ్.. షరతులతో కూడిన బెయిల్ అవినాష్‌రెడ్డికి మంజూరు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. అదే సమయంలో వివేకా కేసులో అవినాష్ రెడ్డి కస్టడీ విచారణ అవసరం లేదని బెంచ్ సీబీఐ తరపు న్యాయవాదులతో స్పష్టం చేసింది.
హైకోర్టు ఆర్డర్‌కాపీలో ఏముందంటే..
30 పేజీల హైకోర్టు ఆదేశాల్లో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అవినాష్‌రెడ్డిపై ఆరోపణలు మాత్రమే కనిపిస్తున్నాయి. అవినాష్‌రెడ్డికి వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు. సీబీఐ ఎలాంటి ఆధారాలు సేకరించలేకపోయింది. సాక్ష్యాలను తారుమారు చేశారనడానికి కూడా ఎవిడెన్స్ లేవు. చెప్పుడు మాటల ఆధారంగా సీబీఐ దర్యాప్తు చేసింది. ఊహాజనితమైన విచారణ మాత్రమే సాగింది. ఈ తరుణంలో.. కస్టోడియల్ విచారణ అవసరం లేదని భావిస్తున్నాం. అవినాష్‌రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నాం.
హైకోర్టు షరతులివే
► అవినాష్‌రెడ్డిని గనుక అరెస్టు చేసినట్లయితే.. రూ. 5 లక్షల పూచీకత్తుతో బెయిల్ పై విడుదల చేయాలి
► సీబీఐ అనుమతి లేకుండా అవినాష్ రెడ్డి దేశం విడిచి వెళ్లరాదు.
► సాక్షులను అవినాష్ రెడ్డి ప్రభావితం చేయకూడదు.
► సీబీఐ దర్యాప్తునకు అవినాష్ రెడ్డి పూర్తిగా సహకరించాలి.
► ప్రతి శనివారం ఉ.10 నుంచి సా.5 వరకు అవినాష్ రెడ్డి సీబీఐ ఎదుట హాజరుకావాలి
► అవసరమని CBI భావించినప్పుడు విచారణకు అవినాష్ రెడ్డిని పిలవచ్చు
పైషరతులు ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోరవచ్చు.
ఆ ఛానెల్స్ డిబేట్‌పై అభ్యంతరం
ఇక ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, మహా టీవీ ఛానెల్స్‌లో తాజాగా వివేకా కేసు పరిణామాలపై జరిగిన డిబేట్‌లో న్యాయమూర్తికి డబ్బుల సంచులు వెళ్లాయంటూ ఓ సస్పెండెడ్ మెజిస్ట్రేట్ చేసిన వ్యాఖ్యలపైనా.. హైకోర్టు న్యాయమూర్తి సీరియస్ అయ్యారు. ఆ చర్చకు సంబంధించిన వీడియోలను కోర్టును సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. ‘‘నా వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే విధంగా కథనాలు ప్రచారం చేశాయి. మీడియా ఛానల్ డిబేట్ లో కొంత మంది వ్యక్తుల ద్వారా నాపై ఆరోపణలు చేయించారు’’ అంటూ ఆర్డర్ కాపీలో వ్యాఖ్యానించారు న్యాయమూర్తి.
‘‘‘మీడియా అంటే మాకు పూర్తి గౌరవం ఉంది. మీడియా స్వేచ్చకు మేం అడ్డంకి కాదు. కానీ, కొన్ని మీడియా సంస్థలు వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డాయి. మీడియా కథనాలు చూసి ఒక స్థాయిలో నేను ఈ కేసు విచారణ నుండి తప్పుకోవాలనుకున్నాను. సస్పెండ్ అయ్యి ఒక జడ్జ్ నాకు డబ్బు సంచులు వచ్చాయని అసత్య ప్రచారం చేయడం బాధాకరం. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి విచారణ జరిపి తీర్పు వెల్లడించాను. ఆయా డిబేట్‌ల వీడియోలను కోర్టుకు సమర్పించండి. చీఫ్ జస్టిస్ ఆ వీడియోలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తారు అని హైకోర్టు జడ్జి పేర్కొన్నారు.
హైకోర్టు ఉత్తర్వుల కాపీ కోసం క్లిక్ చేయండి
అనేక మలుపులు..
ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఏప్రిల్ 17వ తేదీన అవినాష్‌రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే అప్పటి నుంచి ఆ పిటిషన్‌పై విచారణ అనేక మలుపులు తిరిగింది. చివరికి.. సుప్రీం కోర్టు జోక్యంతో ఎట్టకేలకు ఆయన ఊరట లభించింది. అవినాష్‌రెడ్డికి బెయిల్ పిటిషన్ వేసే హక్కు ఉందని, పిటిషన్‌పై వాదనలు వినాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించిన నేపథ్యంలో.. అందుకు అనుగుణంగా వాదనలు వింది తెలంగాణ హైకోర్టు వేకేషన్ బెంచ్.
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణలో భాగంగా.. సీబీఐ ఎదుట అవినాష్ రెడ్డి ఇప్పటికే ఏడుసార్లు హాజరయ్యారు. అయితే తల్లి అనారోగ్యం కారణంగా ఈ నెల 22వ తేదీన విచారణకు మాత్రం హాజరు కాలేదు. సీబీఐ విచారణలో ఇప్పటిదాకా తాను సహకరిస్తూ వస్తున్న విషయాన్ని ప్రస్తావించిన ఆయన.. తల్లి బాగోగులు చూసుకోవడానికి గడువు కోరుతూ సీబీఐకి విజ్ఞప్తి లేఖ రాశారు.
సుప్రీంకోర్టు ఆదేశాలతో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. పలు కీలక వ్యాఖ్యలు చేసింది. సీబీఐకి పలు ప్రశ్నలను సంధించింది.
ఇదీ చదవండి: అవినాష్‌రెడ్డిని టార్గెట్ చేయడం సరికాదు!
Comments
Please login to add a commentAdd a comment