అవినాష్‌ కోసం వివేకా ప్రచారం చేశారు: తెలంగాణ హైకోర్టు | Telangana HC Key Comments On Avinash Reddy Bail Plea Interim Orders | Sakshi
Sakshi News home page

అవినాష్‌ కోసం వివేకా ప్రచారం చేశారు.. అలా అభియోగం మోపడం హియర్‌ సే

Published Wed, Apr 19 2023 7:44 PM | Last Updated on Wed, Apr 19 2023 7:53 PM

Telangana HC Key Comments On Avinash Reddy Bail Plea Interim Orders - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి వ్యతిరేకంగా 2021 దాకా జరిగిన సీబీఐ దర్యాప్తులో ఎలాంటి ఆధారాల్లేవన్న విషయాన్ని తెలంగాణ హైకోర్టు ప్రముఖంగా ప్రస్తావించింది. వివేకా కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ అవినాష్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేయగా.. మంగళవారం హైకోర్టు ఆయనకు ఊరట ఇచ్చిన సంగతి తెలిసిందే. విచారణకు హాజరు కావాలని అవినాష్‌కు చెబుతూనే.. ఏప్రిల్‌ 25వ తేదీ దాకా అవినాష్‌ను అరెస్ట్‌ చేయొద్దంటూ సీబీఐను ఆదేశించింది హైకోర్టు. అంతేకాదు ఈ పిటిషన్‌పై మధ్యంతర ఉత్వర్వుల్లో పలు కీలకాంశాలను ప్రస్తావించింది బెంచ్‌. 

వివేకా హత్యకు ఐదు కారణాలున్నాయని ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. రాజకీయంగా పోటీ, ఆస్తుల వివాదం, అక్రమ సంబంధాలు, కొందరితో విభేధాలు, సిబ్బందితో వివాదాలని పేర్కొన్నారు. కానీ, వివేకా మాత్రం అవినాష్‌రెడ్డి కోసం ఎన్నికల్లో ప్రచారం చేశారు. పైగా అవినాష్‌రెడ్డి అప్పటికే ఎంపీగా ఉండి.. రెండోసారి పోటీ చేస్తున్నారు. ఈ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న షేక్‌ దస్తగిరి వాంగ్మూలం మేరకే అవినాష్‌పై కేసు నమోదు చేశారు. మరో నిందితుడు దస్తగిరికి చెప్పిన విషయాన్ని పరిగణించారు. హత్య వెనుక ఎవరో పెద్దవాళ్లున్నారని ఏ1 అన్నాడన్నది దస్తగిరి కథనం. ఎవరో ఏదో అన్నారని.. దాని ఆధారంగా అభియోగం మోపడం హియర్‌ సే(సాధారణంగా న్యాయస్థానంలో సాక్ష్యంగా అనుమతించబడదు) అవుతుంది. 
 
పైగా 2021 వరకు జరిగిన సీబీఐ దర్యాప్తులో అవినాష్‌రెడ్డికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవు. సీబీఐ కూడా ఇప్పటి వరకు అవినాష్‌ను అరెస్ట్‌ చేయలేదు. కేవలం నోటీసులు ఇచ్చి మాత్రమే విచారించింది. ఒక వ్యక్తిని అరెస్ట్‌ చేయడమన్న ఆప్షన్‌ చిట్ట చివరిదై ఉండాలి. కేసుకు సంబంధించిన అన్ని రికార్డులను ఈ కోర్టు క్షుణ్ణంగా పరిశీలించాలి. ఎవరిమీద ఏ ఆరోపణలున్నాయి? దానికి ఆధారాలేమున్నాయి?. ఏప్రిల్‌ 25వరకు అవినాష్‌ను అరెస్ట్‌ చేయొద్దు.

అవినాష్‌రెడ్డి విచారణ సందర్భంగా ప్రశ్నలను ముందుగా ఇచ్చి.. లిఖితపూర్వకంగా జవాబులు తీసుకోవాలి. దర్యాప్తు ప్రక్రియను ఆడియో, వీడియో ద్వారా రికార్డు చేయాలి. ఈ కేసులో తుది ఉత్తర్వులు ఏప్రిల్‌ 25న ఇస్తాం అని తెలంగాణ హైకోర్టు ఇరు వర్గాలకు స్పష్టం చేసింది. అంతేకాదు.. కేసు దర్యాప్తుపై ఇప్పటికే సుప్రీంకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసిందని, దర్యాప్తును ఏప్రిల్‌ 30 లోపు పూర్తి చేయమని సుప్రీంకోర్టు సూచించిందని కోర్టు గుర్తు చేసింది. అలాగే.. మధ్యంతర ఉత్వర్వుల్లో సిద్దారాం vs మహారాష్ట్ర కేసును ఉదహరించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement