Viveka Case Update: Telangana High Court Relief Avinash Reddy Anticipatory Bail - Sakshi
Sakshi News home page

అవినాశ్‌ను అరెస్టు చేయొద్దు

Published Tue, Apr 18 2023 4:56 PM | Last Updated on Wed, Apr 19 2023 7:30 AM

Viveka Case: Telanagana HC Relief Avinash Reddy Anticipatory Bail - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఈ నెల 25వ తేదీ వరకు కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డిని అరెస్టు చేయవద్దని సీబీఐని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అప్పటి వరకు ఆయన రోజూ సీబీఐ కార్యాలయానికి వస్తారని,  ఏ విచారణ చేయాలన్నా చేపట్టవచ్చని సూచించింది. అయితే సీబీఐ అడిగే ప్రశ్నలు లిఖిత­పూర్వకంగా ఉండాలని... వీడియో, ఆడియో రికార్డు చేయాలని స్పష్టం చేసింది. స్పష్టమైన ఆధారాలు లేకుండా అరెస్టులు చేయడం సరికాదని, 25వతేదీలోగా సాక్ష్యాలు సేకరించాలని పేర్కొంటూ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

తదుపరి విచారణ నాటికి అన్ని అంశాలను పరిశీలించి తుది ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ నెల 30లోగా విచారణ పూర్తి చేయాలని సీబీఐకి నిర్దేశించింది. వివేకా హత్య కేసులో సీబీఐ అరెస్టు చేయ­కుండా ముందస్తు బెయిల్‌ కోరుతూ అవినాశ్‌­రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సురేందర్‌ ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఆ వివరాలు ఇవీ...

ఏది ప్రామాణికం..?
‘హత్య జరిగిన రోజు నిందితుల కదలికలకు సంబంధించి భాస్కర్‌రెడ్డి రిమాండ్‌ రిపోర్టులో ఒకలా.. ఏ–4 దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలో మరోలా.. సీబీఐ గూగుల్‌ టేకౌట్‌లో ఇంకోలా ఉంది. ఇందులో ఏది ప్రామాణికం? దేనిని పరిగణలోకి తీసుకోవాలి? కిరాయి హంతకుడు దస్తగిరి (ఏ–4) సోమవారం ప్రెస్‌మీట్‌ పెట్టి మాట్లాడితే ఈనాడు పత్రిక ప్రచురించింది. గతంలో ఈ కేసు దర్యాప్తు చేసిన సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌ను పలుకుబడితో మార్చేశారంటూ వ్యాఖ్యలు చేశాడు. దీన్ని సీబీఐ సమర్థిస్తుందా? విచారణాధికారిని మార్చింది సుప్రీంకోర్టు.

అంటే దస్తగిరి ఉద్దేశం సుప్రీంకోర్టు ద్వారా మార్పించారనా? అత్యున్నత న్యాయస్థానంపై ఇలాంటి వ్యాఖ్యలను స్వాగతిస్తామా? ఈ కేసులో ఇంప్లీడ్‌ అయిన సునీత న్యాయవాది దస్తగిరి వ్యాఖ్యలను సమర్థించడం సరికాదు. అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, మరో ఇద్దరు తమ వెనుక ఉన్నారని గంగిరెడ్డి పేర్కొన్నట్లు దస్తగిరి చెప్పాడు. అయితే గంగిరెడ్డి మాత్రం తాను ఎవరి పేర్లు చెప్పలేదని వాంగ్మూలంలో పేర్కొన్నాడు. కిరాయి హంతకుడు చెప్పిన ఓ మాటను పట్టుకుని అవినాశ్, భాస్కర్‌రెడ్డిని ఈ కేసులో ఇరికించేందుకు సీబీఐ శతవిధాలా ప్రయత్నిస్తోంది.

గూగుల్‌ కూడా సర్టిఫికెట్‌ ఇవ్వదు..
వైఎస్‌ వివేకా హత్య వెనుక ఉన్న ప్రధాన కారణాలపై సీబీఐ దర్యాప్తు సాగించడం లేదు. గంగిరెడ్డితో వివేకాకు భూమికి సంబంధించిన వివాదం ఉంది. తనకు రావాల్సిన వాటా ఇవ్వడం లేదని గంగిరెడ్డి ఆగ్రహంతో ఉండేవాడు. వివేకా రెండో భార్య, ఆమె కుమారుడి ఉదంతంలో మొదటి భార్య, కుమార్తె సునీత, అల్లుడితో తీవ్ర విభేదాలున్నాయి. సునీల్‌ యాదవ్‌(ఏ–2) తల్లిని వివేకా అసభ్యకరంగా వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలున్నాయి. వివేకాకు కొందరు రాజకీయ శత్రువులు కూడా ఉన్నారు.

ఈ నాలుగు అంశాలపై సీబీఐ విచారణ జరపలేదు. సీబీఐ దర్యాప్తు అంతా అవినాశ్, భాస్కర్‌రెడ్డిని ఇరికించేందుకే సాగుతూ ఇతర కారణాల జోలికి వెళ్లడం లేదు. గూగుల్‌ టేక్‌ అవుట్‌ ప్రామాణికం కాదు. ఇది సీబీఐకి కూడా తెలిసినా అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిని ఇరికించే ఉద్దేశంతో దాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. గూగుల్‌ టేక్‌ అవుట్‌ ప్రామాణికమని  గూగుల్‌ కూడా అధికారికంగా సర్టిఫికెట్‌ ఇవ్వదు.. ఇప్పటివరకు ఇవ్వలేదు కూడా. అలాంటిది సీబీఐ దాన్ని ఆధారంగా పేర్కొనడం తప్పుబట్టాల్సిన అంశం.

ఆధారాలు లేకుండా అరెస్టులు...
2017లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ ఓటమికి అవినాశ్, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి కారణమని వివేకా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు రిమాండ్‌ పిటిషన్‌లో సీబీఐ పేర్కొంది. దీనికి ఎలాంటి ఆధారం, సాక్ష్యం లేదు. ఎలాంటి ఆధారం లేకుండా ఓ యువ ఎంపీని అరెస్టు చేస్తే ఆయన భవిష్యత్, పరువు ప్రతిష్టలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కడప పార్లమెంట్‌ స్థానం నుంచి అవినాశ్‌ రెండుసార్లు ఎంపీగా పోటీ చేశారు. వివేకా జీవించి ఉండగా అవినాశ్‌ విజయం కోసం ప్రచారం నిర్వహించారు. గెలుపు బాధ్యతంతా ఆయనే తీసుకుని పనిచేశారు.

అత్యంత సన్నిహితులైన వివేకా, అవినాశ్‌ మధ్య సంబంధాలు ఒక్క ఎమ్మెల్సీ ఎన్నిక కారణంగా హత్యలు చేసుకునే స్థాయికి వెళ్లాయనడం సరికాదు. సీబీఐ కంటే ముందు సిట్‌ మెటీరియల్‌ అంతా సేకరించింది. దీన్ని సీబీఐకి అందజేసింది. దస్తగిరి బెయిల్‌ పిటిషన్‌ విచారణ సమయంలో గానీ, అప్రూవర్‌గా పేర్కొన్న సమయంలో గానీ ఈ మెటీరియల్‌ను మేజిస్ట్రేట్‌ ముందు ప్రవేశపెట్టలేదు. అసలు హత్యలో కీలక పాత్ర పోషించిన ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరిని వదిలేశారు.

ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ రద్దుకు ఎందుకు పిటిషన్‌ వేయలేదని న్యాయస్థానం ప్రశ్నించడంతో తర్వాత దాఖలు చేశారు. దీనిపై కూడా వాయిదాలు కోరుతూ జాప్యం చేస్తూ వస్తున్నారు. హత్య చేసిన తర్వాత తాను బీరువా పగుల కొట్టానని, గంగిరెడ్డి ఏవో డాక్యుమెంట్ల కోసం వెతికి తీసుకెళ్లాడని దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు. ఆ డాక్యుమెంట్లు ఏమిటి? ఎక్కడి తీసుకెళ్లాడో దర్యాప్తు అధికారులు ఇంతవరకు తెలుసుకోలేదు. అసలు మెటీరియల్‌ను దర్యాప్తు అధికారులు ఎందుకు పరిశీలించడం లేదో తెలియదు. వివేకా మృతి విషయాన్ని ఆయన అల్లుడికి చెప్పింది ఎవరు? వారికి ఈ విషయం ఎలా తెలిసింది? దీని గురించి కూడా విచారణ చేయడం లేదు. ఆధారాలు లేకుండానే భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేశారు. 

విచారణకు పూర్తిగా సహకరిస్తున్నారు..
తన వీడియో, ఆడియో రికార్డును చేస్తున్నారో లేదో చెప్పాలని అవినాశ్‌ పలుమార్లు సీబీఐని కోరారు. ఓ చిన్న నోట్‌ ఇచ్చేందుకు కూడా వారు నిరాకరించారు. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించి ఆ వివరాలు తెలుసుకోవాల్సి వచ్చింది. విలువైన కోర్టు సమయం వృథా అయింది.  దర్యాప్తు పారదర్శకంగా లేదు. విచారణ ముగిసిందని భాస్కర్‌రెడ్డి రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు.

అవినాశ్‌కు ఈ హత్యతో సంబంధం ఉన్నట్లు వారి వద్ద ఆధారాలు, సాక్ష్యాలు ఏమీ లేవు.. ఒక్క దస్తగిరి వాంగ్మూలం మినహా. సీబీఐ విచారణకు సహకరించేందుకు అవినాశ్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు, ఎక్కడికి పిలిచినా ఆయన వస్తారు. ఇప్పటికే పలుమార్లు 160 సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేశారు. దాదాపు 20 గంటలకుపైగా విచారించి 161 సీఆర్‌పీసీ కింద స్టేట్‌మెంట్‌ నమోదు చేసుకున్నారు. అవినాశ్‌ను అరెస్టు చేయాలని సీబీఐ అతృతతో ఉంది. ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకుని అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలి’

ఇంకా సాక్ష్యాలు సేకరిస్తున్నాం: సీబీఐ పీపీ
‘వివేకా హత్య వెనుక కుటుంబ తగాదాలు, వ్యాపార తగాదాలు లేవు. అవినాశ్‌రెడ్డి విచారణకు సహకరించడం లేదు. ఆయన సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నాలు చేశారు. ఇంకా కొందరిని విచారించాల్సి ఉంది. సమాచారం, డాక్యుమెంట్లు సేకరిస్తున్నాం. గంగిరెడ్డి తీసుకువెళ్లిన డాక్యుమెంట్లను సేకరించలేదు’ అని సీబీఐ పీపీ తెలిపారు. కిక్కిరిసిన కోర్టు హాల్‌లో సుదీర్ఘ వాదనల అనంతరం అవినాశ్‌రెడ్డిని అరెస్టు చేయవద్దని ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement