ఎర్రచందనం టెండర్లలో భారీ గోల్‌మాల్
⇒ సర్కార్ ఖజానాకు రూ.987 కోట్ల నష్టం
⇒ అడ్డదిడ్డంగా టెండర్లు.. కారు చౌకగా అమ్మకం
⇒ 2014లో టన్ను రూ.కోటి తొంభై లక్షలు కాగా ఇప్పుడు కేవలం 38 లక్షలకే విక్రయం
⇒ బిడ్ల ఆమోదంపై సర్వత్రా అనుమానాలు
⇒ గతేడాది డిసెంబర్ 29న వేలం జరగాల్సి ఉండగా 26నే బిడ్లకు ఆమోదం!!
⇒ ప్రభుత్వ పెద్దల అనధికారిక ఒప్పందాల వల్ల రాత్రికి రాత్రే ఖరారు?
⇒ కీలక నేతలకు భారీగా ‘ముట్టినట్లు’ సమాచారం
సాక్షి, అమరావతి: ఎర్రచందనం టెండర్లలో భారీ గోల్‌మాల్ జరిగింది. అత్యంత విలువైన ఎర్రచందనాన్ని లోపాయికారీ ఒప్పందాలతో రాష్ట్రప్రభుత్వం కారు చౌకగా అమ్మేస్తోంది. దీనివల్ల ఖజానాకు రూ.987 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. 2014 నవంబర్‌లో విక్రయించిన ధరతో పోలిస్తే ప్రస్తుత విక్రయ ధర అతి తక్కువగా ఉండటం, దీనికితోడు ప్రభుత్వం ఆగమేఘాలపై విక్రయ బిడ్లను ఆమోదించడం పలు సందేహాలకు తావిస్తోంది. డిమాండ్‌కు సరిపడా సరుకు రావడం లేదని, ఉత్పత్తి పడిపోయిందని పలు మాటలు చెప్పి వ్యాపారులు ధరలు పెంచి లాభాలు గడిస్తారు. బండ్ల మీద పండ్లు, షాపుల్లో కిరాణా సరుకులు అమ్మే చిరు వ్యాపారులు మొదలు వెండి, బంగారం విక్రయించే పెద్ద వ్యాపారుల వరకూ అంతా దీనిని పాటిస్తారు.
ఇది మార్కెటింగ్ సూత్రం. రాష్ట్ర ప్రభుత్వం ఈ పాటి మార్కెటింగ్ సూత్రాన్ని కూడా పాటించకుండా కారు చౌకగా ఎర్రచందనాన్ని విక్రయించడం వెనుక ప్రభుత్వ పెద్దల ప్రయోజనం ఉండి ఉంటుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సరైన ధర రాకపోతే టెండర్లను రద్దు చేయాల్సింది పోయి.. రాత్రికి రాత్రే విక్రయ బిడ్లను ఆమోదించడంపై అధికారులు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ‘ఖజానాకు సుమారు రూ.వెయ్యి కోట్లు గండి కొట్టారంటే ఆ మేరకు కీలక నేతలకు లబ్ధి చేకూరితేనే కదా...’ అని అధికారులు చర్చించుకుంటున్నారు.
ఆదాయానికి గండి ఇలా...
ఎర్రచందనం విక్రయ టెండర్లలో ప్రభుత్వం అనుసరించిన అడ్డగోలు విధానం వల్ల ఖజానాకు అక్షరాలా రూ.987 కోట్లకు పైగా గండి పడిందని ప్రభుత్వ గణాంకాలే తేటతెల్లం చేస్తున్నాయి. 2014 నవంబర్‌లో ఇదే చంద్రబాబు ప్రభుత్వం విక్రయించిన ధరలను ప్రామాణికంగా తీసుకుంటే జరిగిన నష్టమిదీ. అంతర్జాతీయ మార్కెట్లో ఎర్రచందనం ధరలేమీ పడిపోలేదని, కీలక నేతలు చేసుకున్న అనధికారిక ఒప్పందాల్లో భాగంగానే బయ్యర్లు తక్కువ ధరకు బిడ్లు వేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే వాటిని ప్రభుత్వం ఆమోదించిందన్న ఆరోపణలూ ఉన్నాయి. టన్ను ‘ఎ’ గ్రేడ్ ఎర్రచందనాన్ని 2014 నవంబర్‌లో జరిగిన టెండర్లలో కోటీ తొంభై అయిదు లక్షల రూపాయలకుపైగా రేటుతో విక్రయించిన ప్రభుత్వం.. ఇప్పుడు కేవలం రూ.38.56 లక్షలకే అమ్మేందుకు టెండర్లు ఆమోదించడం గమనార్హం. ‘ఎ’ గ్రేడ్ ఎర్రచందనాన్ని 2014లో ధర కంటే తక్కువకు విక్రయించడం వల్ల ప్రభుత్వ ఖజానాకు ఏకంగా రూ.719 కోట్లకు పైగా గండి పడింది.
అప్పట్లో నాలుగు టన్నులే.. ఇప్పుడు 372
ఇదిలాఉండగా, 2014 నవంబర్‌లో అత్యంత నాణ్యమైన ‘ఎ’ గ్రేడ్ ఎర్రచందనం దుంగలను 4.691 టన్నుల మేర మాత్రమే విక్రయించగా.. ఇప్పుడు ఏకంగా 372.721టన్నుల విక్రయ బిడ్లను సర్కార్ ఆమోదించింది. అలాగే నాణ్యతలో ద్వితీయ శ్రేణికి చెందిన ‘బి’ గ్రేడ్ దుంగలను అప్పట్లో 166.186 టన్నులు విక్రయించగా.. తాజాగా 622.347 టన్నులకు సంబంధించిన బిడ్లను ఓకే చేసింది. అంటే 2014లో అమ్మిన దాని కంటే 75 శాతానికి పైగా ఎక్కువ పరిమాణంలో ‘ఎ’ గ్రేడ్ దుంగలను, మూడున్నర రెట్లకు పైగా ‘బి’ గ్రేడ్ దుంగలను ఇప్పుడు విక్రయించనుండటం గమనార్హం.
బిడ్ల వివరాలు రాకముందే ఆమోదం!!
గతేడాది డిసెంబర్‌లో జరిగిన ఎర్రచందనం టెండర్ల బిడ్ల వివరాలు కూడా రాకముందే చంద్రబాబు ప్రభుత్వం వాటిని ఆమోదించేసింది. ఈ విషయం స్పష్టంగా జీవోలోనే ఉండటం గమనార్హం. గతేడాది డిసెంబర్ 19, 21, 23, 27, 29 తేదీల్లో ఎర్రచందన విక్రయానికి ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ(ఏపీఎఫ్‌డీసీ) విక్రయ ఏజెంటుగా ఈ– వేలం నిర్వహించింది. ఇందులో వివిధ సంస్థలు దాఖలు చేసిన హెచ్–1(అధిక రేట్ల) బిడ్లను గతేడాది డిసెంబర్ 26న ప్రభుత్వ ఆమోదం కోసం ఏపీఎఫ్‌డీసీ వైస్ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ పంపించారు. రాష్ట్ర అటవీ దళాల అధిపతి డిసెంబర్ 28న ప్రభుత్వానికి పంపించారు. దీనిని ఆమోదించిన ప్రభుత్వం బిడ్ల ధరలను అంగీకరిస్తున్నట్లు జనవరి 4న జీవో జారీ చేసింది.
అయితే డిసెంబర్ 29న జరిగిన ఈ–వేలంలో వచ్చిన బిడ్ల రేట్లను డిసెంబర్ 26నే ఏపీఎఫ్‌డీసీ మేనేజింగ్ డైరెక్టర్, అదే నెల 28న అటవీ దళాల అధిపతి ప్రభుత్వానికి ఎలా పంపుతారని అధికారులను ప్రశ్నించగా.. ‘‘అప్పటి అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అధిపతిగా నియమితులయ్యారు. ఆయన ఢిల్లీకి వెళ్లే హడావుడిలో ఉండగా ప్రభుత్వ పెద్దలు రాత్రికి రాత్రే ఆమోదింపజేసి జీవో జారీ చేయించినట్లున్నారు. దీనివల్లే సాంకేతిక తప్పిదం జరిగినట్లుంది..’’ అని వారు నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.