ఎర్రచందనం టెండర్ల షెడ్యూల్ ఖరారు
- సెప్టెంబర్ 19నుంచి 26వరకు వేలం
- ఈనెల 11 నుంచి 17వరకు బిడ్డర్లకు అనుమతి
- తిరుపతి వైల్డ్‌లైఫ్ డీఎఫ్‌వో శ్రీనివాసులు
తిరుపతి (మంగళం): ఎర్రచందనం టెండర్ల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం విధివిధానాలను రూపొందించింది. తొలి విడతగా ఎర్రచందనం వేలం నిర్వహించనున్న నాలుగు జిల్లాల పరిధిలోని 7 డివిజన్లలో నిర్వహించే టెండర్ షెడ్యూల్‌ను అటవీ శాఖ ప్రకటించింది. మొత్తం 8,460 మెట్రిక్ టన్నుల ఎర్రచందనంకు గాను మొదటి విడతగా 4,160 మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని మెటల్ స్క్రాప్ ట్రేడింగ్ కార్పొరేషన్(ఎంఎస్‌టిసి) ద్వారా ఈ-టెండర్లు, వేలం నిర్వహించనున్నారు.
ఆదివారం కపిలితీర్థం వద్ద ఉన్న అటవీశాఖ కార్యాలయంలో తిరుపతి వైల్డ్‌లైఫ్ డీఎఫ్‌వో జీ.శ్రీనివాసులు, చిత్తూరు ఈస్ట్ సబ్ డీఎఫ్‌వో యోగయ్య ఎర్రచందనం వేలం షెడ్యూల్‌ను ప్రకటించారు. ఎర్రచందనం ఈ-టెండర్లు, వేలంలో పాల్గొనదలచిన వారు ముందుగా www. mstcecommerce.comఆన్‌లైన్‌లో ఎంఎస్‌టీసీలో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంది.
ఆ తర్వాత అధికారులు ఇచ్చే గుర్తింపు కార్డు తీసుకువస్తేనే గోడౌన్లలోని ఎర్రచందనాన్ని చూడడానికి అనుమతినిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలకు సంబంధించిన 7 డివిజన్లు తిరుపతి, భాకరాపేట, వెంకటగిరి, ఉదయగిరి, కనిగిరి, ఆదూరపల్లి, కడప ప్రాంతాల్లోని 4,160 మెట్రిక్ టన్నుల ఎర్రచందనానికి ఈ-టెండర్ల ద్వారా వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఎర్రచందనానికి వేలం
రాష్ట్రంలోని 7 డివిజన్లలోని ఎర్రచందనాన్ని సెప్టెంబర్ 19 నుంచి 26వ తేదీ వరకు వేలం నిర్వహించనున్నట్లు డీఎఫ్‌వో తెలిపారు. సెప్టెంబర్ 19, 22 తేదీల్లో తిరుపతి డిపోలోని 1,447టన్నులు, 22వ తేదీన నెల్లూరు జిల్లాలోని ఆదూరుపల్లెలో కూడా 161.98టన్నులు, 23న నెల్లూరు జిల్లాలోని ఉదయగిరిలో 164.9టన్నులు, వెంకటగిరిలో 507.669 టన్నులు, ప్రకాశం జిల్లా కనిగిరిలో 157.679 టన్నులు, 24, 25 తేదీల్లో వైఎస్‌ఆర్ జిల్లా కడపలో 1,166.041 టన్నులు, 26న చిత్తూరు జిల్లాలోని భాకరాపేటలోని 554.269 టన్నులకు వేలం నిర్వహిస్తామని తెలిపారు. ఆయా రోజుల్లో మధ్యాహ్నం 12 నుంచి 3గంటల వరకు మాత్రమే వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు.
11 నుంచి బిడ్డర్లకు అనుమతి
ఎంఎస్‌టీసీ ఈ-టెండర్లు ద్వారా ఎర్రచందనం వేలంలో పాల్గొనే వారు ఈనెల 11 నుంచి 17వ తేదీ వరకు 7 డివిజన్లలోని ఎర్రచందనాన్ని చూసేందుకు అనుమతి ఉంటుందని డీఎఫ్‌వో శ్రీనివాసులు తెలి పారు. ఎర్రచందనం వేలంలో పాల్గొనదలచిన వారు ముందుగా ఆ డివిజన్ పరిధిలోని డీఎఫ్‌వోకు ఎంఎస్‌టీసీ ద్వారా పొందిన గుర్తింపు కార్డును చూపించి ఎర్రచందనం దుంగలను చూడాలన్నారు. ఎర్రచందనాన్ని వేలం దారులు ఫొటో తీసుకోవడానికి అనుమతి ఉందన్నారు.
స్టాఫ్ ఓల్డర్లు(ఇన్‌చార్జిలు)గా డీఎఫ్‌వోలు
రాష్ట్రంలోని 7 డివిజన్లలోని ఎర్రచందన గోదాములకు స్టాఫ్ ఓల్డర్లు (ఇన్‌చార్జిలు)గా జీ.శ్రీనివాసులు (డీ ఎఫ్‌వో, తిరుపతి), జీ.రాంబాబు (డీఎఫ్‌వో, నెల్లూరు), డీ.చంద్రశేఖర్‌రావు (డీఎఫ్‌వో, గిద్దలూరు), బీ.నాగరాజు (డీఎఫ్‌వో, కడప)ను నియమించారు.