
సంగీత చటర్జీ అరెస్టుకు ప్రత్యేక బృందం
చిత్తూరు (అర్బన్): ఎర్రచందనం స్మగ్లింగ్ కేసు లో అరెస్టయిన కోల్‌కత్తా మోడల్, మాజీ ఎయిర్ హోస్టెస్ సంగీత చటర్జీని చిత్తూరుకు తీసుకురావడంపై జిల్లా పోలీసులు దృష్టి సారించారు. ఎర్రచందనం స్మగ్లర్ లక్ష్మన్ రెండో భార్య సంగీతను గత శనివారం ట్రాన్సిట్ వారెంట్‌పై చిత్తూరుకు తీసుకురావడానికి ప్రయత్నించినా కుదర్లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో కోల్‌కతాలోని కోర్టులో హాజరుపరిచారు. ఆమెకు కోర్టు ఇంటీరియల్ బెయిల్ మంజూరు చేసింది. చిత్తూరు జిల్లాలో ఈమెపై మూడు కేసులు ఉండడంతో కోర్టు జారీ చేసిన అరెస్టు వారెంటు పెండింగ్‌లోనే ఉంది. కోల్‌కతా కోర్టు సంగీత కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినప్పటికీ ఈ నెల 18వ తేదీలోపు ఆమె చిత్తూరు కోర్టులో హాజరుకావాల్సి ఉంది.
లేనిపక్షంలో పోలీసులు సంగీతను అరెస్టు చేసి చిత్తూరుకు తీసుకురానున్నారు. దేశ సంపదను సరిహద్దు దాటించి రూ.కోట్లు కొల్లగొట్టిన సంగీతను చిత్తూరు కోర్టులో హాజరుపరచాల్సిందేనని అధికారులను ఎస్పీ శ్రీనివాస్ ఆదేశించారు. అలాగే లక్ష్మన్ నుంచి కొనుగోలు చేసిన పిస్టల్, తప్పుడు గన్‌లెసైన్సు వ్యవహారాల్లో దర్యాప్తు ప్రారంభించేందుకు డీఎస్పీ స్థాయి అధికారిని, ఓ సీఐ, ఇద్దరు ఎస్‌ఐల బృందాన్ని ఏర్పాటు చేస్తూ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. హాట్ టాపిక్‌గా మారిన సంగీత చటర్జీ కేసులో పలువురు ఎర్రచందనం మాజీ స్మగ్లర్లు అరెస్టు కావడం ఖాయంగా కనిపిస్తోంది.