హంగామా చేస్తున్న అధికారులు
నారావారి పల్లె చుట్టూ ఉన్నతాధికారుల చక్కర్లు
అడవిబాట పేరుతో అడవిలో నిద్రిస్తున్న అధికారులు
పచ్చనేతలే స్మగర్ల అవతారం ఎత్తడంతో సతమతమవుతున్న పోలీసు సిబ్బంది
తిరుపతి:‘మా బంధువులు, మా పొలాల్లో ఎర్రచందనం డంపులు పెండుతుంటే మీరు ఏమి చేస్తున్నారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల విజయవాడలో చేసిన వ్యాఖ్యలతో అటవీశాఖ అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు విస్తృత చర్యలు చేపట్టినట్టు కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా సీఎం మెప్పుకోసం అధికారులు పడరానిపాట్లు పడుతున్నారు. నారావారిపల్లె పరిసర గ్రామాల్లో హంగామా చేస్తున్నారు. ఇప్పటికే పీసీసీఎఫ్ (ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ పారెస్టు) ఎస్‌బీఎల్ మిశ్రా సీఎం సొంత గ్రామంలో పర్యటించారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు లఘుచిత్ర ప్రదర్శనలు ఇచ్చారు. అలాగే అడవిబాట వంటి కార్యక్రమాలు చేసి సీఎం దృష్టిని మరల్చేందుకు ప్రయత్నిస్తున్నారు. నిత్యం రంగం పేట పరిసర ప్రాంతాల్లో దుంగలు దొరుకుతున్నా, డంపులు ఉన్నట్లు తెలిసినా అధికారులు చర్యలు తీసుకొలేకపోయారు. ఇటీవల చంద్రగిరి మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేత మల్లెల చంద్ర పోలీసులకు చిక్కారు. ఎర్రచందనం అక్రమ రవాణాలో దేశం నేతలే కీలకపాత్ర పోషిస్తుండడంతో పోలీసులు గట్టి చర్యలు తీసుకొలేకపోతున్నారు...
విచ్చలవిడి కావడంతో..
సీఎం సొంత మండలంలో ఎర్రచందనం అక్రమ రవాణా విచ్చల విడికావడంతో తాను ఇరుకున పడాల్సి వస్తుందేమోనని భావించి ముందు జాగ్రత్తగానే ‘మా బంధువుల పొలాల్లో దుంగల డంపులు ఉంటే మీరేం చేస్తున్నారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ప్రశ్నించి ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధానికి కఠిన చర్యలు తీసుకొంటున్నారనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లేలా చేశారనే చర్చ జరుగుతోంది. నిజంగా ముఖ్యమంత్రి ఎర్రచందనం అక్రమ రవాణాపై దృష్టి సారించి ఉంటే ఆయన పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈ విషయం తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు జిల్లాలో కొంతమేర అడ్డుకట్ట వేసినా, సీఎం సొంత మండలం చంద్రగిరి, అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాళహస్తి నియోజక వర్గం నుంచే ఎక్కువగా రవాణా అవుతున్నట్టు అటవీ శాఖ అధికారులే పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని సంబంధింత మంత్రి దృష్టికి ఉన్నతాధికారులు తీసుకెళితే ఆయన దాటవేసినట్లు చర్చ సాగుతోంది.