
శేషాచలంలో లూటీ
తుంబురు తీర్థం మార్గంలో యథేచ్ఛగా చెట్ల నరికివేత
మోడులుగా మారిన ఎర్రచందనం వృక్షాలు
తిరుమల: శేషాచలంలోని విలువైన ఎర్రచందనం లూటీ అయ్యింది. స్మగ్లర్ల ధన దాహానికి ఎర్రచందనం వృక్షాలు నేలకొరిగాయి. అటవీ సంపద ఎల్లలు దాటగా వృక్షాలు మోడులుగా మిగిలాయి. చిత్తూరు, వైఎస్‌ఆర్ జిల్లాల పరిధిలో 5.5 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలోని శేషాచల అడవుల్లో శ్రీవేంకటేశ్వర అభయారణ్యం ఉంది. తూర్పున రాజంపేట, పడమర తలకోన వరకు విస్తరించిన దట్టమైన అటవీ మార్గాల్లో విలువైన ఎర్రచందనం వృక్షాలు ఉన్నాయి. తుంబరు తీర్థం మార్గంలో ఎర్రచందనం వృక్షాలు భారీగా విస్తరించి ఉన్నాయి. ఒకప్పుడు చెట్లతో కళకళలాడే ఈ ప్రాంతమంతా నేడు మోడులు కనిపిస్తున్నాయి. భారీ వృక్షాలను దుండగులు నరికేశారు. గుట్టుచప్పుడు కాకుండా ఎల్లలు దాటించేశారు. ఏటేటా ఈ ప్రాంతంలో ఎర్రచందనం చెట్లు తరిగిపోతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. అయినా రక్షణ చర్యలు మాత్రం అంతంతమాత్రంగానే కనిపిస్తున్నాయి. దుండగులు యథేచ్ఛగా అడవిలోకి చొరవడి విలువైన కలపను సరిహద్దులు దాటిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
అడవిలోనే దండగులు తిష్ట?
తుంబురు తీర్థం మార్గంలోని ఎర్రచందనం చెట్లను నరికి తరలించిన తాజా గుర్తులు ఉన్నాయి. ఈ మార్గంలో దుండగులు తాపీగా కూర్చుని చెట్లను నరికి, దుంగలుగా మార్చి వదిలిని చెక్కలు ఉన్నాయి. అంటే అడవిలో దుండగులు పెద్ద ఎత్తున తిష్టవేసినట్టు తెలుస్తోంది. మామండూరు, రాజంపేట మార్గం నుంచి దుండగులు అడవిలోకి చొరబడుతున్నట్టు తెలుస్తోంది. అక్రమ రవాణాను అడ్డుకోకపోతే ఎర్రచందనం కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.