నిందితుల వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ బాబూజీ
సాక్షి, కడప అర్బన్: మోస్ట్ వాంటెడ్ అంతర్రాష్ట్ర స్మగ్లర్ ఆర్కాట్ భాయ్‌తోపాటు, మరో 10 మంది స్మగ్లర్లను జిల్లాలోని మూడు పోలీస్‌స్టేషన్ల పరిధిలో పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 85 ఎర్రచందనం దుంగలు, కంటైనర్, రెండు లారీలు, మూడు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటన్నింటి విలువ దాదాపు రూ.3 కోట్లు ఉంటుందన్నారు. మంగళవారం వైఎస్సార్ జిల్లా కడపలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ బాబూజీ అట్టాడ వివరాలు వెల్లడించారు.
రైల్వేకోడూరు, ఓబులవారిపల్లె, చిట్వేలి పోలీస్‌స్టేషన్ల పరిధిలో తమిళనాడుకు చెందిన ఆర్కాట్ భాయ్, వెడి శక్తివేలు, మురగరి రామన్‌లు, చిన్నకన్ నాగరాజు, విశ్వనాథన్, గోవిందరాజు సందీప్‌కుమార్; ఓబులవారిపల్లెకు చెందిన ఆదిశేఖర్‌రెడ్డి అలియాస్ మందారపు బాబు, వై.కోటకు చెందిన పాకాల చంద్రమౌళి, చెన్నంరాజుపోడుకు చెందిన గంగరాజు వెంకటరామరాజు, గుంటుమడుగు దశరథరాజు, తలారి సుబ్బారాయుడులను పట్టుకున్నామన్నారు. వీరంతా ఎర్రచందనం దుంగలను వాహనాల ద్వారా అక్రమ రవాణా చేస్తున్నారని తెలిపారు.
ఆర్కాట్ భాయ్.. దుబాయ్‌కి చెందిన ఎర్రచందనం స్మగ్లర్ సాజికి ప్రధాన అనుచరుడని, దాదాపు 500 టన్నుల ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణా చేసినట్టు తెలిసిందన్నారు. పట్టుకున్న 11 మందిలో ఏడుగురు అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లు అని పేర్కొన్నారు. వీరిని అరెస్ట్ చేయడంలో కీలకపాత్ర పోషించిన రాజంపేట డీఎస్పీ లక్ష్మీనారాయణ, ఫ్యాక్షన్ జోన్ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐలు కనుమారి సాయినాథ్, ఎస్‌డీ శివశంకర్ నాయక్, ఎస్‌ఐలు భక్త వత్సలం, బి.హేమకుమార్, కొండారెడ్డి, వెంకటేశ్వర్లు, హాజివల్లి, డాక్టర్ నాయక్, బి.నాగమురళి, కానిస్టేబుళ్లను ఎస్పీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment