
కూలీల కాల్చివేతపై నివేదిక ఇవ్వండి
చిత్తూరు జిల్లా, శేషాచల అడవుల్లో మంగళవారం జరిగిన ఎర్ర చందనం కూలీల ఎన్‌కౌంటర్ పై పూర్తిస్థాయి నివేదిక
హైదరాబాద్: చిత్తూరు జిల్లా, శేషాచల అడవుల్లో మంగళవారం జరిగిన ఎర్ర చందనం కూలీల ఎన్‌కౌంటర్ పై పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని ఉమ్మడి హైకోర్టు ఆంధ్రప్రదేశ్ డీజీపీ జె.వి. రాముడిని ఆదేశిస్తూ తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. మృతదేహాలకు చట్ట ప్రకారం పోస్టుమార్టం నిర్వహించాలని, అనంతరం వాటిని భద్రపరచాలని ధర్మాసనం స్పష్టం చేసింది. మృతదేహాలను వారి సంబంధీకులకు అప్పగించే విషయంలో ఏం చర్యలు తీసుకున్నారో నివేదికలో వివరించాలని కోరింది. తమిళ కూలీల ఎన్‌కౌంటర్‌పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ పౌర హక్కుల సంఘం నేత చిల్కా చంద్రశేఖర్ హైకోర్టులో బుధవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరఫున వి.రఘునాథ్ వాదనలు వినిపిస్తూ, తమిళనాడు రాష్ట్రానికి చెందిన 20 మంది అమాయక కూలీలను పోలీసులు సమీపం నుంచి కాల్చి చంపారని, దీనిని సమర్ధించుకునేందుకు కూలీలను స్మగ్లర్లుగా చిత్రీకరిస్తున్నారని తెలిపారు. తరువాత ఏపీ ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ఎన్‌కౌంటర్ జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించిందని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోస్టుమార్టం నిర్వహించేందుకే మృతదేహాలను ఆసుపత్రికి తరలించామని వివరించారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ మృతదేహాలను సైతం మానవతాదృక్పథంతో గౌరవించాల్సి ఉందన్నారు.