పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి
- శేషాచలం ఎన్‌కౌంటర్‌పై పిటిషనర్‌కు హైకోర్టు సూచన
- ఇది మంచి కేసు.. చెడగొట్టకండి అంటూ వ్యాఖ్య
- తదుపరి విచారణ13వ తేదీకి వాయిదా
సాక్షి, హైదరాబాద్: శేషాచలం అడవుల్లో ఇటీవల చోటు చేసుకున్న ఎర్రచందనం కూలీల ఎన్‌కౌంటర్ వ్యవహారంలో సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలని హైకోర్టు శుక్రవారం పిటిషనర్‌కు స్పష్టం చేసింది. ఇది మంచి కేసని, ఫిర్యా దు ఇవ్వకుండా దానిని చెడగొట్టవద్దని సూచించింది. ఎన్‌కౌంటర్‌పై పోలీసులు ఇప్పటివరకు కేసు నమోదు చేయని నేపథ్యంలో మీరే(పిటిషనర్) స్వయంగా అక్కడకు వెళ్లి జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని తెలిపింది.
పోలీసులు తమ పరిధి దాటి వ్యవహరించారని తాము ప్రాథమిక నిర్ధారణకు వస్తే అప్పుడు జోక్యం చేసుకుంటామని పేర్కొంది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. శేషాచలం ఎన్‌కౌం ట ర్‌పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ పౌర హక్కుల సంఘం నేత చిల్కా చంద్రశేఖర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని బుధవారం విచారించిన ప్రధాన న్యాయమూర్తి కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం, ఈ మొత్తం వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీని ఆదేశిస్తూ విచారణను శుక్రవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో శుక్రవారం డీజీపీ ఓ సీల్డ్ కవర్‌లో తన నివేదికను కోర్టుకు పంపారు. దీనిని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ధర్మాసనం ముందుంచారు. కూలీల అసహజ మరణాలపై ఎఫ్‌ఐఆర్ నమోదు గురించి ఎటువంటి ప్రస్తావన లేదేమిటి? పోస్టుమార్టం చేశారా? అంటూ న్యాయమూర్తులు ప్రశ్నలు సంధించారు. ఆయన అధికారులతో మాట్లాడి చెబుతాననడంతో ఎన్‌హెచ్‌ఆర్‌సీ విచారణ ప్రారంభించిందా? లేదా..? భోజన విరామ సమయానికి ఈ వివరాలను మాకు చెప్పండంటూ ధర్మాసనం ఆదేశించింది. మధ్యాహ్నం 12.40 గంటలకు మళ్లీ విచారించింది.
బాధ్యతల నుంచి తప్పించుకోలేరు
ఏప్రిల్ 7న ఎన్‌హెచ్‌ఆర్‌సీ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మొత్తం వ్యవహారంపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించిందని శ్రీనివాస్ ధర్మాసనానికి నివేదించారు. దీనికి ధర్మాస నం స్పందిస్తూ, ఎన్‌హెచ్‌ఆర్‌సీ విచారణ ప్రారంభించింది కాబట్టి, ప్రస్తుతానికి ఈ కేసులో తాము చేయగలిగిందేమీ లేదని వ్యాఖ్యానించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వి.రఘునాథ్ జోక్యం చేసుకుంటూ, మృతులపై పోలీ సులు రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారని తెలిపారు. అసహజ మరణాలపై ఎటువంటి కేసూ నమోదు చేయలేదన్నారు. ‘పోలీసులు తమ బాధ్యతల నుంచి తప్పిం చుకోలేరు. మీరే స్వయంగా అక్కడకు వెళ్లి సంబంధిత పోలీసులకు ఫిర్యాదు చేయం డి. వారు స్పందించకుంటే స్థానిక కోర్టును ఆశ్రయించండి..’ అని సూచించింది. ‘అప్పటికీ ప్రయోజనం లేకపోతే అప్పుడు మా వద్దకు రండి. పోలీసులు వారి పరిధి దాటి వ్యవహరించారని భావిస్తే అప్పుడు మేం తగిన ఆదేశాలిస్తాం.’ అని హైకోర్టు వ్యాఖ్యానింది.