సాక్షి, హైదరాబాద్: కొత్తగూడెం జిల్లా, టేకుపల్లి మండలం, మేళ్లమడుగు గ్రామ పరిధిలో ఈనెల 14న జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన 9 మంది సీపీఐ (ఎంఎల్) చండ్రపుల్లారెడ్డి బాట దళ సభ్యుల మృతదేహాలకు జరిపిన పోస్టుమార్టం నివేదిక, అందుకు సంబంధించిన వీడియోగ్రఫీ వివరాలను తమ ముందుంచాలని ఉమ్మడి హైకోర్టు సోమవారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 22కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఎన్‌కౌంటర్ ఘటనపై సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చేత దర్యాప్తు చేయించి, ఆ దర్యాప్తును పర్యవేక్షించాలని కోరుతూ పౌర హక్కుల కమిటీ అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సోమవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వి.రఘునాథ్ వాదనలు వినిపిస్తూ, ఇది బూటకపు ఎన్‌కౌంటరని, దళసభ్యులను పట్టుకొచ్చి అతి సమీపం నుంచి కాల్చి చంపారన్నారు.
మృతదేహాలపై తీవ్ర గాయాలున్నాయని తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై హత్యానేరంకింద కేసు నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలన్నారు. మృతదేహాలకు హడావుడిగా అర్ధరాత్రి పోస్టుమార్టం నిర్వహించి, వాటిని మృతుల కుటుంబ సభ్యులకు అప్పగించి, అంతిమ సంస్కారాలు చేయించారని తెలిపారు. తరువాత ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ, పోస్టుమార్టం నిర్వహణ మొత్తాన్ని వీడియోగ్రఫీ చేయించామన్నారు.
ఈ విషయంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం వ్యవహరించామని తెలిపారు. ఈ ఘటనపై డీఎస్‌పీ స్థాయి అధికారి దర్యాప్తు చేస్తున్నారని వివరించారు. ఈ సమయంలో రఘునాథ్ స్పందిస్తూ, ఈ ఎన్‌కౌంటర్ వెనుక భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ హస్తం ఉందన్నారు. కాబట్టి డీఎస్‌పీ స్థాయి అధికారికి దర్యాప్తు బాధ్యతలు అప్పగించడం సరికాదని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, పోస్టుమార్టం నివేదికను, వీడియోగ్రఫీ వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment