- ఆర్కే తదితరుల ఆచూకీపై కొనసాగుతున్న అనిశ్చితి
- రిజర్వాయరులో పడి చనిపోయి ఉంటారని పోలీసుల కొత్త వాదన
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏవోబీ) మల్కన్‌గిరి అడవుల్లో గత నెల 24న జరిగిన ఎన్‌కౌంటర్ తర్వాత జాడలేకుండా పోయిన మావోయిస్టు అగ్రనేతల ఆచూకీపై అనిశ్చితి కొనసాగుతోంది. ఎన్‌కౌంటర్ జరిగి వారం రోజులు దాటినా మావోయిస్టు పార్టీ అగ్రనేతలు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే, గాజర్ల రవి అలియాస్ గణేష్, రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి, అరుణ అలియాస్ చైతన్య తదితరులు ఏమయ్యారన్న దానిపై స్పష్టత లేదు. వీరంతా పోలీసుల చెరలో ఉన్నారని మావోయిస్టు పార్టీ నాయకులు, విరసం, పౌరహక్కుల సంఘాల నేతలు అనుమానిస్తున్నారు. వీరిని పోలీసులు హతమార్చి ఉంటారని మావోయిస్టు పార్టీలోనే మరికొందరు నాయకులు చెబుతున్నారు. దీంతో మావోయిస్టు పార్టీలోనూ అస్పష్టత ఉందని స్పష్టమవుతోంది.
అయితే తమ వద్ద మావోయిస్టు నేతలెవరూ లేరని విశాఖ జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మతోపాటు డీజీపీ సాంబశివరావు కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. తన భర్తను కోర్టులో హాజరు పరచాలంటూ ఆర్కే సతీమణి శిరీష సోమవారం హైకోర్టును ఆశ్రయించారు. ఒకవేళ ఆర్కే పోలీసు కస్టడీలో ఉంటే హాజరు పరచాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆర్కేపై పోలీసు వర్గాలు సరికొత్త ప్రచారానికి తెరతీశాయి. ఎన్‌కౌంటర్ జరిగిన తర్వాత ఆర్కే తదితరులు అక్కడ నుంచి తప్పించుకుని పోతూ ఆ ప్రాంతానికి సమీపంలో ఉన్న బలిమెల రిజర్వాయరులో పడి చనిపోయి ఉంటారన్నది వారి వాదన. ఆర్కేను కోర్టులో హాజరు పరచాలని హైకోర్టు ఆదేశించడంతో పోలీసులు వ్యూహాత్మకంగా ఈ తరహా ప్రచారానికి తెరతీశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్కే ఆచూకీపై స్పష్టత వస్తే జాడలేకుండా పోయిన మిగతా వారి సమాచారం కూడా వెల్లడయ్యే అవకాశం ఉంది.
అగ్ర నేతలేమయ్యారు?
Published Tue, Nov 1 2016 3:00 AM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM
Advertisement
Advertisement