DGP Samba Siva Rao
-
‘పోలీస్‌బాస్’పై కేంద్రానికి మళ్లీ పాత జాబితా
సాక్షి, అమరావతి: శాశ్వత డీజీపీ ఎంపికపై రాష్ట్ర ప్రభుత్వం గతంలో పంపిన జాబితానే మళ్లీ కేంద్రానికి పంపింది. గత నెలలో పంపిన ఏడుగురు పేర్లతో ఉన్న జాబితా సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉందని ఈ నెల 2న కేంద్రం తిప్పిపంపింది. అయితే ఆ అభ్యంతరాలకు రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇస్తూ మళ్లీ అదే జాబితాను ఈ నెల 7న కేంద్రానికి పంపినట్లు విశ్వసనీయ సమాచారం. రాజకీయ, సామాజిక కోణంలో ఇన్చార్జి డీజీపీ సాంబశివరావువైపే సీఎం చంద్రబాబు మొగ్గు చూపడంతో పాత జాబితానే మళ్లీ కేంద్రానికి పంపారని తెలిసింది. -
జియో ఫెన్సింగ్‌తో కళ్లెం: డీజీపీ
గుంటూరు ఈస్ట్: రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు హైవేలపై జియో ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర డీజీపీ నండూరి సాంబశివరావు చెప్పారు. గుంటూరులో నిర్మిస్తున్న పాతగుంటూరు, నగరంపాలెం మోడల్ పోలీస్టేషన్లను బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నిర్ణీత మార్గంలో జియో ఫెన్సింగ్ సిగ్నల్స్ ఏర్పాటుతో ఎదురుగా వచ్చే వాహనాల వివరాలను ముందుగానే తెలుసుకొని ప్రమాదాన్ని నివారించవచ్చన్నారు. దీని ఉచిత యాప్‌ను మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. ఎన్‌హెచ్ 16పై విజయవాడ, విశాఖ మధ్య ప్రయోగాత్మకంగా జియో ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మోడల్ పోలీస్స్టేషన్లలో లాకప్‌లలో ఉండే నిందితులకు సౌకర్యవంతమైన బెడ్లు , ఏసీ తదితర సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని డీజీపీ చెప్పారు. మన రాష్ట్రంలో గతంలో వేలల్లో ఉన్న మావోయిస్టుల సంఖ్య ప్రస్తుతం 109కి చేరిందన్నారు. -
అగ్ర నేతలేమయ్యారు?
- ఆర్కే తదితరుల ఆచూకీపై కొనసాగుతున్న అనిశ్చితి - రిజర్వాయరులో పడి చనిపోయి ఉంటారని పోలీసుల కొత్త వాదన సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏవోబీ) మల్కన్‌గిరి అడవుల్లో గత నెల 24న జరిగిన ఎన్కౌంటర్ తర్వాత జాడలేకుండా పోయిన మావోయిస్టు అగ్రనేతల ఆచూకీపై అనిశ్చితి కొనసాగుతోంది. ఎన్కౌంటర్ జరిగి వారం రోజులు దాటినా మావోయిస్టు పార్టీ అగ్రనేతలు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే, గాజర్ల రవి అలియాస్ గణేష్, రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి, అరుణ అలియాస్ చైతన్య తదితరులు ఏమయ్యారన్న దానిపై స్పష్టత లేదు. వీరంతా పోలీసుల చెరలో ఉన్నారని మావోయిస్టు పార్టీ నాయకులు, విరసం, పౌరహక్కుల సంఘాల నేతలు అనుమానిస్తున్నారు. వీరిని పోలీసులు హతమార్చి ఉంటారని మావోయిస్టు పార్టీలోనే మరికొందరు నాయకులు చెబుతున్నారు. దీంతో మావోయిస్టు పార్టీలోనూ అస్పష్టత ఉందని స్పష్టమవుతోంది. అయితే తమ వద్ద మావోయిస్టు నేతలెవరూ లేరని విశాఖ జిల్లా ఎస్పీ రాహుల్దేవ్శర్మతోపాటు డీజీపీ సాంబశివరావు కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. తన భర్తను కోర్టులో హాజరు పరచాలంటూ ఆర్కే సతీమణి శిరీష సోమవారం హైకోర్టును ఆశ్రయించారు. ఒకవేళ ఆర్కే పోలీసు కస్టడీలో ఉంటే హాజరు పరచాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆర్కేపై పోలీసు వర్గాలు సరికొత్త ప్రచారానికి తెరతీశాయి. ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఆర్కే తదితరులు అక్కడ నుంచి తప్పించుకుని పోతూ ఆ ప్రాంతానికి సమీపంలో ఉన్న బలిమెల రిజర్వాయరులో పడి చనిపోయి ఉంటారన్నది వారి వాదన. ఆర్కేను కోర్టులో హాజరు పరచాలని హైకోర్టు ఆదేశించడంతో పోలీసులు వ్యూహాత్మకంగా ఈ తరహా ప్రచారానికి తెరతీశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్కే ఆచూకీపై స్పష్టత వస్తే జాడలేకుండా పోయిన మిగతా వారి సమాచారం కూడా వెల్లడయ్యే అవకాశం ఉంది. -
మోడల్ పోలీస్స్టేషన్లు నిర్మిస్తాం
డీజీపీ నండూరి సాంబశివరావు గుంటూరు ఈస్ట్: రాష్ట్ర వ్యాప్తంగా 800 పోలీస్ స్టేషన్లను మోడల్ పోలీస్ స్టేషన్లుగా తీర్చిదిద్దనున్నట్టు డీజీపీ నండూరి సాంబశివరావు చెప్పారు. నగరంపాలెం, పాతగుంటూరు పోలీస్ స్టేషన్లకు భూమిపూజ చేసిన అనంతరం డీజీపీ ఆ ప్రాంతాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోలీస్ స్టేషన్లను ఆధునిక హంగులతో రెండు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. వీటిలో ప్రాథమిక సౌకర్యాలన్నీ ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. సిబ్బంది సాంకేతిక నైపుణ్యం పొంది మెరుగైన సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. తొలుత పాతగుంటూరు పోలీస్ స్టేషన్ నిర్మాణ పూజకు హెడ్ కానిస్టేబుల్ కె.పుత్తంరాజు, నగరంపాలెం పోలీస్ స్టేషన్‌ను హడ్ కానిస్టేబుల్ ఎ.శ్రీనివాసరావులతో భూమి పూజచేయించారు.