మృతదేహాలను 27 వరకు భద్రపరచండి
ఏపీ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్-ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను ఉభయ రాష్ట్రాల పరిధిలోకి తీసుకొస్తే, వాటిని 27 వరకు భద్రపరచాలని హైకోర్టు సోమవారం ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏవోబీలో మావోయిస్టులను కాల్చిచంపిన పోలీసులపై హత్యానేరం కింద కేసు నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేయడంతో పాటు మృతదేహాలను భద్రపరిచేలా కూడా ఆదేశాలివ్వాలంటూ ఏపీ పౌర హక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్ సోమవారం హైకోర్టులో అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఏపీ అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ... ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం ఒడిశా రాష్ట్ర పరిధిలో ఉందని తెలిపారు. తనకున్న సమాచారం ప్రకారం ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని వివరించారు. అయితే మృతదేహాలను ఎక్కడకు తీసుకొస్తారన్న విషయంలో స్పష్టత లేదన్నారు. తరువాత పిటిషనర్ తరఫు న్యాయవాది వి.రఘునాథ్ వాదనలు వినిపిస్తూ... మొదట తమకున్న సమాచారం ప్రకారం ఎన్‌కౌంటర్‌లో 19 మంది మావోయిస్టులు చనిపోయారని, ఇప్పుడు ఆ సంఖ్య 26కు చేరిందని తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో అగ్రనేతలు మృతి చెందారని వివరించారు. ప్రస్తుతం తమ అభ్యర్థనను మృతదేహాలను భద్రపరిచే అంశానికే పరిమితం చేస్తున్నామన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, మృతదేహాలను ఉభయ రాష్ట్రాల పరిధిలోకి తీసుకొస్తే వాటిని ఈ నెల 27వ తేదీ వరకు భద్రపరచాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది.