ఎర్ర చందనం తరలిస్తున్న ముఠా అరెస్ట్
బుక్కరాయసముద్రం : ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న ఏడుగురి ముఠాను గురువారం బుక్కరాయసముద్రం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 21 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఇటుకలపల్లి సీఐ క్రిష్ణమోహన్, ఎస్‌ఐ విశ్వనాథ్‌చౌదరి తెలిపిన వివరాల మేరకు.... కడప జిల్లా మైదుకూరుకు చెందిన సాయిబోయిన నారాయణ, కడపజిల్లా ఎర్రగుంట్లకు చెందిన కుడుబు వెంకటేశ్వరరెడ్డి, కడప జిల్లా తిమ్మరాజుపల్లికి చెందిన బోయన వెంకటరమణ, కడపజిల్లా చుక్కాయపల్లికి చెందిన ఆవుల రవి, నార్పల మండలం వెంకటాంపల్లికి చెందిన శ్రీరాం తిరుపాల్‌రెడ్డి, శింగనమల మండలం పెరవళికి చెందిన తలారి రామక్రిష్ణ, బికేయస్ మండలం వెంకటాపురానికి చెందిన రామేశ్వరరెడ్డిలు ముఠాగా ఏర్పడి కడప జిల్లాలోని నందలూరు ఫారెస్ట్‌లో ఎర్ర చందనం చెట్లను కొట్టి దుంగలను నెల రోజుల క్రితం దాచి ఉంచారు.
వాటిని కర్ణాటకకు తరలించి ఎలాగైనా సొమ్ము చేసుకోవాలనుకుని ప్లాన్ వేసిన వీరు గురువారం బొలేరో వాహనంలో 10, ట్రాక్టర్‌లో 11 ఎర్ర చందనం దుంగలను వేసుకుని కడప జిల్లా సరిహద్దును దాటి అనంతపురం జిల్లాలోకి ప్రవేశించారు. అరుుతే ఆ సమయంలో బికేయస్ మండల కేంద్రంలోని నార్పల క్రాసింగ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న ఎస్‌ఐ విశ్వనాథ్ చౌదరి బొలేరో, ట్రాక్టర్‌లు నిలిపి తనిఖీ చేయగా, ఎర్రచందనం దుంగలు బయటపడ్డారుు. దీంతో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 21 ఎర్ర చందనం దుంగలు, ఒక బొలోరో, ఒక ట్రాక్టర్, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.