చిత్తూరు (అర్బన్): ఆపరేషన్‌రెడ్‌లో జిల్లా పోలీసులు తొలిసారిగా భారీ ఎత్తున ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఆపరేషన్‌రెడ్‌లోని పోలీసు బృందాలు సాహసం చేసి మరీ రూ.30 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు. చైనాకు తరలించడానికి సిద్ధంగా ఉన్న దుంగలను పట్టుకుని సాహసం ప్రదర్శించారు.
తీగ ఇలా లాగారు..
ఎర్రచందనం స్మగ్లింగ్‌లో చెన్నైకు చెందిన ఓ వ్యక్తిని మూడు రోజుల క్రితం చిత్తూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతన్ని విచారించగా పశ్చిమబెంగాల్‌లోని జయగామ్ వద్ద సౌందరాజన్ అనే వ్యక్తికి తాను ఎర్రచందనం దుంగలను సరఫరా చేస్తున్నట్లు చెప్పాడు. సౌందర్‌రాజన్ ఎత్తు, పోలికలు, ఇతర గుర్తులను చెప్పాడు. ఈ చిన్నపాటి ఆనవాళ్లతో పదిమందితో కూడిన పోలీసు బృం దాన్ని ఎస్పీ శ్రీనివాస్ పశ్చిమ బెంగాల్‌కు పంపారు.
ఆదివారం రాత్రి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని జయగామ్ వద్దకు జిల్లా పోలీసు లు చేరుకున్నారు. ఇక్కడి నుంచి భూటాన్‌కు కేవలం రెండు కిలోమీటర్ల దూరమే. ఇక్కడ సౌందర్‌రాజన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఎర్రచందనం డంప్ ఉన్న ప్రాంతంలోకి పదిమంది పోలీసుల బృందం చేరుకుంది. ఇక్కడ ఓ గోడౌన్‌లో ఉంచిన 149 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే సౌందర్‌రాజన్‌ను పట్టుకునే క్రమంలో పోలీసులు అడవుల్లోంచి వెళ్లాల్సి వచ్చింది.
ఆదివారం రాత్రి 10 గంటలకు అడవుల్లో వెళుతున్న చిత్తూరుకు చెందిన మహిళా స్టేషన్ డీఎస్పీ గిరిధర్‌రావు, సీఐ షాదిక్‌అలీ బృందాన్ని రెండు ఏనుగులు తరుముకున్నాయి. ఏనుగుల చూపు మరల్చి మన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. సౌందర్‌రాజన్‌ది చెన్నై. ఇతను ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ఆరితేరి పశ్చిమబెంగాల్‌లో స్థిరపడ్డాడు.
ఇతన్ని విచారించగా చెన్నైలో మరో డంప్ ఉన్న విషయాన్ని పోలీసులకు చెప్పాడు. అనంతరం 28 మంది ఉన్న మరో బృందాన్ని ఎస్పీ శ్రీనివాస్ చెన్నైకు పంపారు. ఇక్కడ శరవణన్ అనే స్మగ్లర్‌ను అదుపులోకి తీసుకున్నారు. చెన్నై సమీపంలోని ఆవడి వద్ద ఉన్న సిప్‌కాట్ ఇండస్ట్రీస్ వద్ద 167 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శరవణన్‌కు సైతం అరెస్టు చేశారు.
ఆలస్యమయితే అంతే..
పశ్చిమ బెంగాల్‌కు జిల్లా పోలీసులు కాస్త ఆలస్యంగా వెళ్లి ఉంటే ఎర్రచందనం దుంగలను స్మగ్లర్లు దేశ సరిహద్దు దాటించేసుంటారు. లారీల్లో ఈ సరుకును భూటాన్‌కు, అటు నుంచి చైనాకు తరలించడానికి స్మగ్లర్లు రంగం సిద్ధం చేసుకున్నారు. అంతలోపు జిల్లా పోలీసులు స్మగ్లర్‌తో సహా దుంగలను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం సాయంత్రం సౌందర్‌రాజన్‌ను పశ్చిమ బెంగాల్‌లోని జయగామ్ న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. దుంగలను సైతం జిల్లాకు తీసుకురావడానికి న్యాయస్థానం నుంచి అనుమతి తీసుకున్నారు. గురువారం తీసుకొచ్చే అవకాశం ఉంది.
తీగలాగితే ‘డంప్’ కదిలింది
Published Tue, Apr 21 2015 4:12 AM | Last Updated on Sun, Sep 3 2017 12:35 AM
Advertisement