ఆపరేషన్ రెడ్‌లో మరిన్ని గ్యాంగ్‌లు | More gang operation in the red | Sakshi
Sakshi News home page

ఆపరేషన్ రెడ్‌లో మరిన్ని గ్యాంగ్‌లు

Published Thu, Jul 2 2015 2:18 AM | Last Updated on Sun, Sep 3 2017 4:41 AM

ఆపరేషన్ రెడ్‌లో  మరిన్ని గ్యాంగ్‌లు

ఆపరేషన్ రెడ్‌లో మరిన్ని గ్యాంగ్‌లు

పాండిచ్చేరి శేఖర్ అరెస్ట్
పోలీసుల అదుపులో 8 మంది స్మగ్లర్లు?
50 మంది సహాయకుల కోసం వేట
ఇద్దరిపై పీడీ యాక్ట్ నమోదుకు సిఫారసు

 
చిత్తూరు(అర్బన్): ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే రెండు గ్యాంగ్‌లను చిత్తూ రు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆపరేషన్ రెడ్‌లో భాగంగా ఓఎస్డీ రత్న ఆధ్వర్యంలో పనిచేస్తున్న బృందం పలువురు స్మగ్లర్లను, వారికి సహాయకులుగా పనిచేసే ముఠాను అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరు మీదుగా పాండిచ్చేరికి అటు నుంచి సముద్రమార్గం ద్వారా బర్మాకు ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్ చేసే బడా స్మగ్లర్ శేఖర్‌ను గురువారం పూతలపట్టు పోలీసు స్టేషన్‌లో అరెస్టు చూపించారు. ఇతను ఇచ్చిన సమాచారంతో బెంగళూరు, చెన్నైకు చెందిన రెండు ఎర్రచందనం స్మగ్లింగ్  గ్యాంగ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ముఠాలో మొత్తం ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు. వీరి నుంచి పలు వాహనాలతో పాటు రూ.20 లక్షలు విలువ చేసే ఎర్రచందనం దుంగలను సైతం స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. నిందితులను మరో రెండు రోజుల్లో అరెస్టు చూపించే అవకాశం ఉంది.

 ఇప్పటివరకు ఎర్రచందనం అక్రమ రవాణాపై వేట సాగిస్తున్న పోలీసు యంత్రాంగం, ప్రస్తుతం సక్రమ రవాణాపై దృష్టి పెట్టింది. చెన్నై, బెంగళూరు ప్రాంతాల్లోని పలు గోడౌన్లను పరిశీలించిన చిత్తూరు పోలీసులు ఎర్రచందనం నిల్వలు ఉన్న చోట అధికారిక ఉత్తర్వులను చూశారు. చిత్తూరుకు చెందిన తూర్పు అటవీ శాఖ నుంచి వేలం పాటలో కొన్ని దుంగలను కొనుగోలు చేసినట్లు కొందరి వద్ద ధ్రువీకరణ పత్రాలు ఉన్నాయి. అయితే వేలం పాటలో తీసుకున్న ఎర్రచందనం దుంగలు బీ, సీ గ్రేడ్‌కు చెందినవి. వీటి ముసుగులో ఏ గ్రేడ్ దుంగలు ఏవైనా విదేశాలకు వెళుతున్నాయా అనే దిశగా ఓ సీఐ ఆధ్వర్యంలోని బృందం దర్యాప్తు చేస్తోంది.

 ఆపరేషన్‌రెడ్‌లో ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసిన బాడాశీను, గౌస్‌బాషా, మణి, రామకృష్ణ, ఉదయ భాస్కర్, గుట్ట బాబు, నిమ్మ మహేష్, ముక్కల నారాయణ, ఫియాన్, సౌందరరాజన్ గ్యాంగ్‌లకు సంబంధించి పలువురిని అరెస్టు చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఒక్కో గ్యాంగ్‌లో కనీసం నలుగురు స్మగ్లర్లను అరెస్టు చేయనున్నారు. బడా స్మగ్లర్లపై బయోడైవర్సీ యాక్టు 55 (1) కింద కేసులు నమోదు చేయాలని ఈడీ నుంచి ఆదేశాలు అందడంతో పోలీసు శాఖ ఈ దిశగా కూడా చిన్నపాటి మార్పులు చేస్తోంది.
 ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ఇప్పటికే పీడీపై అరెస్టయి బెయిల్ తీసుకున్న కొందరు వ్యక్తులు బయట ప్రాంతాల నుంచి మళ్లీ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వారిపై నిఘా ఉంచిన పోలీసులు ఈ మేరకు నిర్ధారణకు వచ్చారు. వీరిపై మళ్లీ పీడీ యాక్టు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వీరితో పాటు మరో ఇద్దరు స్మగ్లర్లపై ప్రివెంటివ్ డిటెక్టివ్ యాక్టు (పీడీ) నమోదు చేయడానికి కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపారు. రెండు రోజుల్లో కలెక్టర్ నుంచి ఉత్తర్వులు రానున్నాయి.
 

Related News By Category

Related News By Tags

Advertisement