Operation Red
-
కర్ణాటకలో ముగిసిన ఆపరేషన్ రెడ్
ఐదుగురు స్మగ్లర్ల అరెస్టు రూ.3 కోట్ల విలువైన దుంగలు, వాహనాలు స్వాధీనం తప్పించుకున్న మరో ముఠా ఎస్పీ శ్రీనివాస్ వెల్లడి చిత్తూరు (అర్బన్): ఎర్ర చందనం స్మగ్లర్లను పట్టుకోవడానికి గత వారం రోజులుగా చిత్తూరు పోలీసులు కర్ణాటకలో నిర్వహించిన ‘ఆపరేషన్రెడ్’ ముగిసింది. ఈ ఆపరేషన్‌లో ఐదుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. చిత్తూరులోని పోలీసు మైదానంలో ఎస్పీ ఘట్టంనేని శ్రీనివాస్ బుధవారం ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ ఆపరేషన్‌లో స్మగర్ల నుంచి రూ.3 కోట్ల విలువైన 7 టన్నుల ఎర్రచందనం దుంగలు, నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. బయట పడింది ఇలా.. పది రోజుల క్రితం కల్లూరులో పోలీసు లు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ ఇన్నోవా వాహనం విధుల్లో ఉన్న కానిస్టేబుల్ గౌస్‌బాషాను ఢీకొని వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ కాలు కూడా విరిగింది. వాహనాన్ని వెంబడించిన పోలీసులు బెంగళూరుకు చెందిన ఇర్ఫాన్, సయ్యద్ ముబారక్ అనే ఇద్దరిని అరెస్టు చేశారు. వీరిచ్చిన సమాచారంతో బెంగళూరు సమీపంలోని కటికనహళ్లి, గిడ్డప్పనహళ్లి ప్రాంతాల్లో చిత్తూరు ఓఎస్డీ రత్న ఆధ్వర్యంలో కర్ణాటక పోలీసుల సాయంతో దాడులు చేశారు. ఈ దాడుల్లో పేరుమోసిన అంతరాష్ట్ర స్మగ్లర్ ఫసీ ఉద్దీన్‌కు చెందిన డంప్ స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇతను పరారయ్యాడు. కాగా కర్ణాటకకు చెందిన పలువురు పెద్ద మనుషులతో కలిసి ఫసీ గతంలో చిత్తూరు పోలీసులను ఆశ్రయించి తన ప్రాంతంలో ఎర్రచందనంపై కళాజాత, అవగాహన సదస్సులు నిర్వహించాలని కోరడం విశేషం! పైకి పెద్దమనుషులుగా లోపల స్మగ్లర్లుగా చెలామణి అవుతున్న వైనాన్ని సైతం పోలీసులు కనిపెట్టారు. ఇక అదే ప్రాంతంలో జమీర్‌ఖాన్ గ్యాంగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు పట్టుబడ్డ వారిలో జమీర్‌ఖాన్ (26) కటిహనహళ్లికి చెందిన వ్యక్తి. చూడటానికి బాలీవుడ్ సినిమాల్లో విలన్లా కనిపించే ఇతను అంతర్ రాష్ట్ర స్మగ్లర్. పదో తరగతి వరకు చదివి, మెడికల్ షాపులో పని చేస్తుండేవాడు. అయితే 2014 నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ తమిళనాడుకు చెందిన శశి అనే వ్యక్తి ద్వారా కూలీలను రప్పించేవాడు. ఇతనిపై 12 కేసులు ఉన్నాయి. అలాగే ఇదే ప్రాంతానికి చెందిన అదిల్ షరీఫ్ (27), షేక్ ముబారక్ (26), తౌసీఉల్లా ఖాన్ (30), మహ్మద్ యూసఫ్ (27లను సైతం పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు ఒక్కొక్కరిపై 5 నుంచి 12 కేసులు జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో నమోదయ్యాయి. ఈ ఆపరేషన్‌లో ఫసీ గ్యాంగ్ కోసం, కూలీలు, మేస్త్రీలను సరఫరా చేసే తమిళనాడుకు చెందిన శని అనే వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అభినందన ఆపరేషన్‌లో పాల్గొన్న పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. అందరికీ ప్రశంసా పత్రాలను అందచేశారు. సమావేశంలో ఓఎస్డీ రత్న, డీఎస్పీలు గిరిధర్, రామ్‌కుమార్, లక్ష్మీనాయుడు, శ్రీకాంత్, దేవదాసు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
కర్నాటకలో ‘ఆపరేషన్రెడ్’..!
ఎర్రచందనం నిల్వలపై ముప్పేట దాడి చిత్తూరు (అర్బన్): ఆపరేషన్‌రెడ్‌లో భాగంగా చిత్తూరు పోలీసులు కర్నాటకలోని ఎర్ర చందనం నిల్వలపై దాడులు చేశారు. ఈ ఆపరేషన్‌లో కటిగనహళ్లికు చెందిన ఇర్ఫాన్‌ఖాన్ (22), సయ్యద్ ముబారక్ (22) అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేసి ఆరు టన్నుల ఎర్రచందనం దుంగలను బుధవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు ఎస్పీ శ్రీనివాస్ ఆదేశాల మేరకు సోమవారం రాత్రి నుంచి పోలీసులు కర్నాటకలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. బెంగళూరు సమీపంలోని గిడ్డప్పన్హళ్లిలోని ఫాసీ అనే వ్యక్తికి చెందిన గోదాములో 6 టన్నుల దుంగలు స్వాధీనం చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నారు. కాగా ప్రధాన స్మగర్లకు సహాయకులుగా ఉన్న 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
పోలీసులకు చిక్కిన ఎర్ర స్మగ్లర్లు
కమల్‌కిషోర్, మీర్జా, షరీఫ్, స్వామి అరెస్టు ముగ్గురిపై జిల్లాలో 75 కేసులు చిత్తూరు (అర్బన్) :చిత్తూరు పోలీసులు చేపట్టిన ఆపరేషన్ రెడ్‌లో ముగ్గురు ప్రధాన అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్టు చేశారు. జిల్లాలోని బంగారుపాళ్యం, పీలేరు, చిత్తూరు వన్‌టౌన్ పోలీసు స్టేషన్ ప్రాంతాల్లో ఆదివారం ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో చిత్తూరు నగరానికి చెందిన కమల్‌కిషోర్, బెంగళూరుకు చెందిన మీర్జా, సఫ్దర్ షరీఫ్, అలాగే బంగారుపాళ్యానికి చెంది న మేస్త్రీ స్వామి పట్టుబడ్డారు. ఈ ముగ్గురిపై జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో 75 కేసులు నమోదయ్యాయి. నిందితుల నుంచి మూడు కార్లు, 28 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ రూ.28 లక్షలు ఉంటుందని ఓఎస్డీ రత్న తెలిపారు. నగరంలోని పోలీసు పెరెడ్ గ్రౌండ్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆమె ఈ వివరాలను వెల్లడించారు. సమావేశంలో డీఎస్పీలు గిరిధర్, లక్ష్మీనాయుడు, దేవదాసు, సీఐలు మహేశ్వర్, నిరంజన్‌కుమార్ పాల్గొన్నారు. ఆరుగురు ఎర్ర స్మగ్లర్లపై ‘పీడీ’ నమోదుకు ప్రతిపాదనలు ఎర్రచందనం అక్రమ రవాణాలో అరెస్టయిన ఆరుగురు స్మగ్లర్లపై ప్రివెంటివ్ డిటెక్టివ్ (పీడీ) యాక్టు కింద కేసులు నమోదు చేయడానికి జిల్లా పోలీసు శాఖ ప్రతిపాదనలు పంపింది. సోమవారం చిత్తూరు ఓఎస్డీ రత్న దీనిపై మాట్లాడుతూ ఆరుగురు స్మగ్లర్లపై పీడీ నమోదు చేయడానికి కలెక్టర్‌కు నివేదిక పంపామన్నారు. ఈనెలాఖరులోపు అనుమతి వస్తుందని, అనంతరం స్మగ్లర్లను పీడీ యాక్టు కింద కడప, రాజమండ్రి జైలుకు తరలిస్తామన్నారు. ఇప్పటికే జిల్లాలో పీడీ యాక్టు కింద 44 మందిని అరెస్టు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. కమల్‌కిషోర్: ఇతన్ని కమల్ (32) అని కూడా పిలుస్తుంటారు. చిత్తూరు లోని రామ్‌నగర్ కాలనీకి చెందిన రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి టీఏ.పద్మనాభం కుమారుడు. ఎంబీఏ వరకు చదువుకున్న ఇతను పలు సాఫ్ట్వేర్ కంపెనీ ల్లో పనిచేశాడు. 2011 నుంచి ఎర్రచందనం రవాణా చేస్తున్నాడు. చిత్తూరుకు చెందిన టీడీపీ నాయకుడు వసంత్‌కుమార్, తుమ్మింద పాళ్యం గౌస్‌తో సంబంధాలున్నాయి. ఇప్పటి వరకు వంద టన్నుల వరకు ఎర్రచందనం దుంగల్ని ఎగుమతి చేసి రూ.10 కోట్ల వరకు సంపాదించాడు. బెంగళూరులో ఇతను, స్మగ్లర్ మీర్జా కలిసి ఓ పబ్‌ను నడుపుతున్నారు. మీర్జా: మీర్జాబేగ్, ఖాస్ (39) అనే పేర్లతో కూడా ఇతన్ని పిలుస్తారు. ఎర్రచందనం వ్యాపారంలో మోస్ట్‌వాంటెడ్ కింగ్ పిన్ మీర్జా. మూడో తరగతి వరకు చదువుకున్న మీర్జా గతంలో ద్విచక్ర వాహనాల వ్యాపారం చేసేవాడు. 2013 నుంచి ఎర్రచందనం అక్రమ రవాణాలో ఉన్నాడు. ఇతనిపై జిల్లాలో 30 కేసులు ఉన్నాయి. జిల్లా నుంచి 30 టన్నుల వరకు ఎర్రచందనం రవాణా చేసి రూ.3 కోట్ల వరకు సంపాదించాడు. స్వామి: బంగారుపాళ్యంకు చెందిన పేరు స్వామి (32) 2009 నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నాడు. ఇతను మేస్త్రీగా వ్యవహరిస్తున్నా డు. కమల్‌కిషోర్, మీర్జాను పట్టుకోవడానికి ఆపరేషన్ రెడ్‌లో ఉన్న సీఐలు బెంగళూరులోని ఓ ప్రాంతంలో భిక్షగాళ్లుగా గెటెప్ వేసుకున్నారు. మరో అధికారి పబ్‌లో సరదాగా అమ్మాయిలతో గడపడానికన్నట్లు పిల్ల జమిందార్ వేషం కట్టారు. ఇంకొకరు క్యాబ్ డ్రైవర్‌గా వ్యవహరించారు. ప్రాణాలకు తెగించి ఈ ముగ్గు రు స్మగ్లర్లను పట్టుకున్నారు. వీరికి త్వరలోనే ఎస్పీ చేతు లు మీదుగా రివార్డులు అందజేయనున్నట్టు ఓఎస్డీ రత్న తెలిపారు. షరీఫ్: బెంగళూరులోని భనశంకరి ప్రాంతానికి చెందిన సఫ్దర్ షరీఫ్ (29) రెండో తరగతి వరకు చదువుకున్నాడు. గతంలో స్పిరిట్ వ్యాపారం చేసేవాడు. 2013 నుంచి ఎర్రచంద నం అక్రమ రవాణా చేస్తున్నాడు. ఇతనికి ఆంధ్రాతో పాటు కర్ణాటక, ముం బయి, ఢిల్లీకి చెందిన స్మగ్లర్లతో సంబంధాలున్నాయి. ఇతను ఇప్పటి వరకు వంద టన్నుల ఎర్రచందనం దుంగలను మన జిల్లా నుంచి తెప్పిం చుకుని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేశాడు. ఇతనిపై జిల్లాలోని పలు పోలీసుస్టేషన్లలో 15 కేసులు న్నాయి. ఈ రెండేళ్ల కాలంలో స్మగ్లింగ్ ద్వారా రూ.10 కోట్లు సంపాదించాడు. -
ఆపరేషన్ రెడ్‌లో మరిన్ని గ్యాంగ్‌లు
పాండిచ్చేరి శేఖర్ అరెస్ట్ పోలీసుల అదుపులో 8 మంది స్మగ్లర్లు? 50 మంది సహాయకుల కోసం వేట ఇద్దరిపై పీడీ యాక్ట్ నమోదుకు సిఫారసు చిత్తూరు(అర్బన్): ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే రెండు గ్యాంగ్‌లను చిత్తూ రు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆపరేషన్ రెడ్‌లో భాగంగా ఓఎస్డీ రత్న ఆధ్వర్యంలో పనిచేస్తున్న బృందం పలువురు స్మగ్లర్లను, వారికి సహాయకులుగా పనిచేసే ముఠాను అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరు మీదుగా పాండిచ్చేరికి అటు నుంచి సముద్రమార్గం ద్వారా బర్మాకు ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్ చేసే బడా స్మగ్లర్ శేఖర్‌ను గురువారం పూతలపట్టు పోలీసు స్టేషన్లో అరెస్టు చూపించారు. ఇతను ఇచ్చిన సమాచారంతో బెంగళూరు, చెన్నైకు చెందిన రెండు ఎర్రచందనం స్మగ్లింగ్ గ్యాంగ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ముఠాలో మొత్తం ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు. వీరి నుంచి పలు వాహనాలతో పాటు రూ.20 లక్షలు విలువ చేసే ఎర్రచందనం దుంగలను సైతం స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. నిందితులను మరో రెండు రోజుల్లో అరెస్టు చూపించే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఎర్రచందనం అక్రమ రవాణాపై వేట సాగిస్తున్న పోలీసు యంత్రాంగం, ప్రస్తుతం సక్రమ రవాణాపై దృష్టి పెట్టింది. చెన్నై, బెంగళూరు ప్రాంతాల్లోని పలు గోడౌన్లను పరిశీలించిన చిత్తూరు పోలీసులు ఎర్రచందనం నిల్వలు ఉన్న చోట అధికారిక ఉత్తర్వులను చూశారు. చిత్తూరుకు చెందిన తూర్పు అటవీ శాఖ నుంచి వేలం పాటలో కొన్ని దుంగలను కొనుగోలు చేసినట్లు కొందరి వద్ద ధ్రువీకరణ పత్రాలు ఉన్నాయి. అయితే వేలం పాటలో తీసుకున్న ఎర్రచందనం దుంగలు బీ, సీ గ్రేడ్‌కు చెందినవి. వీటి ముసుగులో ఏ గ్రేడ్ దుంగలు ఏవైనా విదేశాలకు వెళుతున్నాయా అనే దిశగా ఓ సీఐ ఆధ్వర్యంలోని బృందం దర్యాప్తు చేస్తోంది. ఆపరేషన్‌రెడ్‌లో ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసిన బాడాశీను, గౌస్‌బాషా, మణి, రామకృష్ణ, ఉదయ భాస్కర్, గుట్ట బాబు, నిమ్మ మహేష్, ముక్కల నారాయణ, ఫియాన్, సౌందరరాజన్ గ్యాంగ్‌లకు సంబంధించి పలువురిని అరెస్టు చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఒక్కో గ్యాంగ్‌లో కనీసం నలుగురు స్మగ్లర్లను అరెస్టు చేయనున్నారు. బడా స్మగ్లర్లపై బయోడైవర్సీ యాక్టు 55 (1) కింద కేసులు నమోదు చేయాలని ఈడీ నుంచి ఆదేశాలు అందడంతో పోలీసు శాఖ ఈ దిశగా కూడా చిన్నపాటి మార్పులు చేస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ఇప్పటికే పీడీపై అరెస్టయి బెయిల్ తీసుకున్న కొందరు వ్యక్తులు బయట ప్రాంతాల నుంచి మళ్లీ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వారిపై నిఘా ఉంచిన పోలీసులు ఈ మేరకు నిర్ధారణకు వచ్చారు. వీరిపై మళ్లీ పీడీ యాక్టు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వీరితో పాటు మరో ఇద్దరు స్మగ్లర్లపై ప్రివెంటివ్ డిటెక్టివ్ యాక్టు (పీడీ) నమోదు చేయడానికి కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపారు. రెండు రోజుల్లో కలెక్టర్ నుంచి ఉత్తర్వులు రానున్నాయి. -
మరో ‘ఎర్ర’ తిమింగలం
ఢిల్లీలో చిత్తూరు పోలీసులకు చిక్కిన చైనీయుడు 5 టన్నుల వరకు ఎర్రచందనం స్వాధీనం బుద్ధుడి విగ్రహాలు, ఇతర వస్తువుల రూపంలో ఎగుమతి విదేశీ కరెన్సీ సైతం పట్టివేత చిత్తూరు (అర్బన్) : ఆపరేషన్ రెడ్‌లో చిత్తూరు పోలీసులు మరో పెద్ద అడుగు ముందుకేశారు. ఇప్పటికే చైనాకు చెందిన యంగ్‌పెంగ్ అనే స్మగ్లర్‌ను అరెస్టు చేసిన చిత్తూరు పోలీసులు తాజాగా మరో చైనీయుడిని అరెస్టు చేశారు. శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఢిల్లీలోని ఫరీదాబాద్ వద్ద ఉన్న ఓ గోడౌన్లో ఎర్రచందనం చూడటానికి వెళ్లిన ఛెన్యై ఫియాన్ (42) అనే చైనా దేశీయుడిని పట్టుకున్నారు. అతని నుంచి 2521 యాన్ (చైనా కరెన్సీ), 170 యూఎస్ డాలర్లను, గోడౌన్లో ఉన్న దాదాపు 5 టన్నుల ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన విధమిదీ మదనపల్లె టూటౌన్ పోలీసు స్టేషన్లో ఇటీవల ఓ నిందితుడిని ఎర్రచందనం స్మగ్లింగ్‌లో పట్టుకున్నారు. ఇతనిపై స్థానిక పోలీసు స్టేషన్లో (క్రైమ్‌నెం. 103-2015) కేసు కూడా నమోదయింది. ఇతను ఇచ్చిన సమాచారంతో మొత్తం 21 మందిపై మదనపల్లె పోలీసులు కేసు నమోదు చేశారు. ఫియాన్ ఈ కేసులో 21వ నిందితుడు. తొలుత పట్టుబడ్డ నిందితుడిని విచారించగా ఎర్రచందనం ఢిల్లీకి తరలించి అక్కడ నుంచి విదేశాలకు వీటిని పంపుతున్నట్లు అంగీకరించాడు. ఈ సమాచారంతో చిత్తూరు ఎస్పీ శ్రీనివాస్ ఓ బృందాన్ని నెల 27న ఢిల్లీకి పంపారు. ఇక్కడున్న ఫరీదాబాద్‌లో చైనా దేశానికి చెందిన ఓ వ్యక్తి ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నట్లు గుర్తించారు. దీంతో శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఫరీదాబాద్‌లో ఫియాన్‌ను అరెస్టు చేశారు. ఇతడిని అక్కడి కోర్టులో హాజరుపరచి ట్రాన్సిస్ట్ వారెంట్‌తో చిత్తూరుకు తీసుకెళ్లడానికి పోలీసులు అనుమతి తీసుకున్నారు. ఇతనితో పాటు అక్కడున్న గోడౌన్‌లోని ఎర్రచందనం దుంగ లను సైతం పోలీసులు సీజ్ చేసి చిత్తూరుకు తీసుకొస్తున్నారు. గడువు ముగిసిన వీసా... ఛెన్యై ఫియాన్ చైనా దేశంలోని క్సిమెన్ టౌన్, ఫుజియాన్ రాష్ట్ర వాసిగా పోలీసులు గుర్తించారు. ఇతను భారత్‌కు రావడానికి జారీ చేసిన వీసాకు కాలం చెల్లినట్లు నిర్ధారించారు. ఇతనికి చైనా దేశం జారీచేసిన పాస్‌పోర్టు (నెం-జీ24311513)ను సైతం పోలీసులు సీజ్ చేశారు. ఇతనికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. పలు ‘ఎర్ర’ వస్తువుల స్వాధీనం ఎర్రచందనంతో తయారుచేసిన పలు రకాల వస్తువులను ఫియాన్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫియాన్ తరచూ భారత్‌కు వచ్చి ఎర్రచందనం దుంగల ద్వారా బుద్ధుడి విగ్రహాలు, చైనా దేవుని విగ్రహాలు, సిగరెట్ లైటర్లు, పొగాకు పీల్చే లైటర్లు, దువ్వెనలు, లక్కీమన్ విగ్రహాలను తయారు చేసి చైనాకు ఎగుమతి చేస్తున్నట్లు నిర్ధారించారు. పోలీసుల అదుపులో మరికొంత మంది ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో రెండు రోజుల క్రితం మదనపల్లెలో బంగారుపాళ్యంకు చెందిన డాబా శీను అనే ప్రధాన స్మగ్లర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇతడిని విచారించగా పలువురు అంతర్జాతీయ స్మగ్లర్ల పేర్లను చెప్పాడు. వీరిలో చైనా, దుబాయ్, బర్మా దేశాలకు చెందినవారు ఉండగా, ఫియాన్ ఈ కేసులో 21వ నిందితుడు. డాబా శీను ఇందులో ప్రధాన నిందితుడు. ఇతనితో పాటు హరిబాబు (బంగారుపాళెం), చెన్నైకు చెందిన సింగారవేలు, భాస్కరన్, చిట్టిరాజన్, మధు, ఇస్మాయిల్, కుమార్, వెంకటేశన్, శేఖర్ మౌళి(బర్మా), అరీదుద్దీన్ (చెన్నై), సెల్వరాజ్ (చెన్నై), సాహుల్‌భాయ్ (దుబాయ్), షణ్ముగం (చెన్నై), హషరఫ్ (ఢిల్లీ), ముస్తాఫా (ముంబాయ్), ప్రవీణ్ (పూనే), హాసీఫ్ (పూనే), రాజా (ఢిల్లీ) ఉన్నారు. వీరిలో ముగ్గురు స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరిపై ఇప్పటికే మదనపల్లె టూటౌన్ పోలీసు స్టేషన్లో (క్రైం.నెం-103/2015) కేసు నమోదయింది. -
జిల్లాలో మరో ‘ఎర్ర’ డంప్
- చైనా దేశీయుడి అరెస్టుతో కీలక విషయాలు - పోలీసుల నుంచి తప్పించుకున్న ఐదుగురు - దుంగల కోసం వెతుకుతున్న పోలీసులు చిత్తూరు (అర్బన్): ఆపరేషన్ రెడ్‌లో భాగంగా జిల్లా పోలీసులు చైనా దేశానికి చెందిన యంగ్‌పెంగ్ (36)ను అరెస్టు చేయడం సంచలనంగా మారింది. ఇతనితో పాటు వైఎస్సార్ జిల్లా రాయచోటికి చెందిన కే.శ్రీనివాసరాజును అరెస్టు చేశారు. వారిచ్చిన సమాచారంతో జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఎర్రచందనం డంప్ ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు దాన్ని గుర్తించే పనిలో ఉన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఆపరేషన్‌లో ఇద్దరు నిందితులు మాత్రమే పట్టుబడ్డారు. మరో ఐదుగురు పారిపోయారు. వీరి కోసం ప్రత్యేక బృందం గాలిస్తోంది. ఇలా పట్టుకున్నారు.. ఈనెల 5న పూతలపట్టు సమీపంలో ఇద్దరు అనుమానితులు రెండు ఎర్రచందనం దుంగలను ద్విచక్ర వాహనంలో తీసుకెళుతుండగా పోలీసులు అరెస్టు చేశారు. ఎర్రావారిపాళెం మండలం పులిబోనుపల్లెకు చెందిన కే.చంద్రశేఖర్‌రెడ్డి(30), చింతగుంటకు చెందిన కే. చంద్ర(35)ను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. హైదరాబాదులో ఓ ముఠా చైనాకు చెందిన వ్యక్తికి ఎర్రచందనం అమ్మడానికి ప్రయత్నిస్తోందని పోలీసులకు వీరు సమాచారం ఇచ్చారు. చిత్తూరు మహిళా డీఎస్పీ గిరిధర్‌రావు, సీఐ మహేష్‌తో ఉన్న ఓ బృందం హైదరాబాదుకు వెళ్లింది. గురువారం రాత్రి 1.30 గంట ప్రాంతంలో హైదరాబాదు-వరంగల్ జాతీయ రహదారిపై స్మగ్లర్ల ముఠా మాట్లాడుకుంటుండగా పట్టుకోవడానికి ప్రయత్నించారు. వీరిలో చైనాకు చెందిన యంగ్‌పెంగ్, రాయచోటికి చెందిన శ్రీనివాసరాజు దొరికారు. శ్రీనివాసరాజుపై ఇప్పటికే బీ.కొత్తకోట పోలీసుస్టేషన్లో కేసు కూడా నమోదయ్యింది. చైనా దేశీయుడి వద్ద ఉన్న ఆపిల్ ఫోన్లో ఉన్న ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌లో మన దేశ స్మగ్లర్లు ఇంగ్లిషులో టైపు చేస్తే చైనీయుడికి చైనీస్ భాషలో అనుకరణ చేస్తుంది. తమ వద్ద ఉన్న పెద్ద మొత్తంలోని ఎర్రచందనం దుంగలను విక్రయిస్తామని చైనీయుడితో ఒప్పందం కుదుర్చుకుంటుండగా పోలీసులు దాడులు చేశారు. మరికొందరి కోసం వేట.. హైదరాబాదులో పోలీసుల నుంచి తప్పించుకున్న వారిలో కడపకు చెందిన కిషోర్‌కుమార్‌రెడ్డి అలియాస్ బుజ్జిరెడ్డి అలియాస్ సుదర్శన్‌రెడ్డి, కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన దాసరి సూరిబాబు, కడపకు చెందిన అల్లూరి వెంటకరమణ, నెల్లూరు జిల్లా వింజమూరుకు చెందిన శ్రీనివాసులు, మైసూర్‌కు చెందిన మహ్మద్ ముంజామిల్ అనే స్మగ్లర్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. చైనా దేశీయుడికి తమ వద్ద ఉన్న ఎర్రచందనం దుంగల ఫొటోలు, వీడియోలను వాట్సప్, మెయిల్ ద్వారా చూపించి అతన్ని భారత్‌కు రప్పించడంలో వీళ్లంతా ప్రధాన పాత్ర పోషించారు. నిందితులతో పాటు జిల్లాలో రహస్య ప్రాంతంలో ఉన్న ఎర్రచందనం దుంగల డంప్ కోసం సైతం పోలీసులు అన్వేషిస్తున్నారు. -
‘ఇంటి’ దొంగల మాటేంటి..?
ప్రభుత్వ నిర్వాకంతో ‘ఆపరేషన్ రెడ్’ నీరుగారిపోతోన్న వైనం స్మగ్లర్లకు దన్నుగా నిలుస్తోన్న అధికారులపై చర్యలకు వెనుకంజ..! అక్రమాధికారులను కీలకస్థానాల్లో నియమించడంలో ఆంతర్యమేంటో? హైదరాబాద్: ప్రభుత్వం ‘ఇంటి’దొంగల ఆట కట్టించాల్సింది పోయి.. అందలమెక్కిస్తుండటంతో ‘ఆపరేషన్ రెడ్’ నీరుగారిపోతోంది. తమిళ కూలీలు 20 మందిని ఎన్కౌంటర్ చేసినా.. 1100 మందికిపైగా అరెస్టు చేసినా.. 40 మంది స్మగర్లను పీడీ చట్టం కింద అరెస్టు చేసినట్టు ప్రకటించినా.. స్మగ్లర్లకు దన్నుగా నిలుస్తున్న అటు పోలీసు.. ఇటు అటవీ శాఖల్లోని ఇంటిదొంగలను ప్రభుత్వం విస్మరిస్తోంది. అంతర్జాతీయ స్మగ్లర్ సౌందర్యరాజన్ పోలీసు విచారణలో ఇంటిదొంగల విషయాన్ని వెల్లడించినట్టు తెలిసింది. నల్లమల అటవీ ప్రాంతంలో చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో విస్తరించిన శేషాచలం, వెలిగొండ, పాలకొండ అడవుల్లో 5.50 లక్షల హెక్టార్లలో ఎర్రచందనం వృక్ష సంపద విస్తరించి ఉంది. కేంద్ర ప్రభుత్వం 1995లో ఎర్రచందనం ఎగుమతిపై నిషేధం విధించడంతో.. ఎర్రచందనానికి అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఆ డిమాండ్‌ను సొమ్ము చేసుకోవడానికి అటవీ, పోలీసు శాఖల్లోని కొందరు అక్రమాధికారులు స్మగ్లర్లతో చేతులు కలిపారు. ఫలితంగా ఎర్రచందనం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగింది. గత రెండు దశాబ్దాల్లో 40 వేల టన్నులకుపైగా సరిహద్దులు దాటినట్లు ఇటీవల ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఒక్కరిపై వేటుతో సరి.. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం ‘ఆపరేషన్ రెడ్’ను చేపట్టిన విషయం విదితమే. ఇందులో భాగంగా అంతర్జాతీయ స్మగ్లర్లను అరెస్టు చేసి, విచారించారు. అందులో వెల్లడైన అంశాల ఆధారంగా ‘ఎర్ర’ స్మగ్లర్లకు దన్నుగా నిలుస్తోన్న ఎనిమిది మంది డీఎస్పీలు, 17 మంది సీఐలు, 24 మంది ఎసై్సలపై కఠినచర్యలు తీసుకోవాలని జూలై, 2014లో అప్పటి చిత్తూరు ఎస్పీ రామకృష్ణ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఆరుగురు డీఎఫ్‌వోలు సహా 54 మంది అటవీ శాఖ అధికారులు స్మగ్లర్లకు సహకరిస్తున్నట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు. పోలీసు, అటవీ శాఖ అధికారులకు స్మగ్లర్లు కట్టించిన భవనాలు, ఇచ్చిన నజరానాల వివరాలనూ ఆ నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం. ఆ నివేదికను పరిశీలించిన ప్రభుత్వం.. డీఎస్పీ ఉదయ్‌కుమార్‌పై వేటు వేసి చేతులు దులుపుకుంది. స్మగ్లర్లకు సహకరిస్తోన్న అధికారులపై చర్యలు తీసుకోకుండా ఉన్నతాధికారులపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. కీలక స్థానాల్లో అక్రమార్కులు.. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి ఎర్రఇం‘ధనం’ సమకూర్చడం.. నెలసరి మామూళ్లు ముట్టజెపుతుండటం వల్లే అధికార పార్టీ నేతలు స్మగ్లర్లకు దన్నుగా నిలుస్తున్నారు. స్మగ్లర్లకు సహకరిస్తోన్న పోలీసు, అటవీ శాఖ అధికారులను కీలక స్థానాల్లో నియమించేలా టీడీపీ ప్రజాప్రతినిధులు చక్రం తిప్పారు. ఇది ఎర్రచందనం స్మగ్లింగ్ యథేచ్ఛగా సాగడానికి దారితీస్తోంది. ఎర్రచందనం వృక్ష సంపద విస్తరించిన ప్రాంతాల్లో స్మగ్లర్లకు వెన్నుదన్నుగా నిలుస్తోన్న అధికారులను నియమించేలా అటవీ ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఇక ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే మార్గాల్లోనూ స్మగర్లకు సహకరించే పోలీసు అధికారులను నియమింపజేసుకోవడంలో టీడీపీ ప్రజాప్రతినిధులు సఫలీకృతులయ్యారు. అంతర్జాతీయ స్మగ్లర్ సౌందర్యరాజన్ విచారణలో ఇదే అంశాన్ని అంగీకరించినట్లు ఆ ఆపరేషన్‌లో పాల్గొన్న ఓ కీలకాధికారి ‘సాక్షి’కి వెల్లడించారు. తాము ఎర్రచందనం దుంగలను అక్రమంగా రవాణా చేసే వాహనాలకు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఓ డీఎస్పీ పైలట్‌గా తన వాహనాన్ని పంపేవారని సౌందర్యరాజన్ విచారణలో అంగీకరించినట్లు పోలీసు వర్గాలు చెప్పాయి. -
‘ఎర్ర’ ప్రకంపనలు
చెన్నై ముఠా నుంచి కీలక సమాచారం పోలీసుల కస్టడీలో వివరాలిచ్చిన స్మగ్లర్లు ఫోన్‌కాల్స్ జాబితా పరిశీలిస్తున్న పోలీసులు నగదు లావాదేవీలపై డీఆర్ఐతో దర్యాప్తు జిల్లాలో పలువురు అరెస్టుకు రంగం సిద్ధం చిత్తూరు(అర్బన్): ఆపరేషన్ రెడ్ లో భాగంగా చెన్నై-పశ్చిమ బెంగాల్లో పట్టుబడ్డ ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి చిత్తూరు పోలీసు యం త్రాంగం పలు కీలక సమాచారాలు సేకరించింది. గత వారంలో జిల్లా పోలీసులునిర్వహించిన చెన్నై-పశ్చిమ బెంగాల్ ఆపరేషన్‌లో కింగ్‌పిన్ షణ్ముగంతోపాటు సౌందరరాజన్, శరవణన్‌లతో పాటు మొత్తం ఏడుగురు స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరిని న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండుకు తరలించారు. అయితే ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్న శరవణన్, సౌందరరాజన్‌లను గత రెండు రోజులుగా పోలీసులు న్యాయస్థానం నుంచి అనుమతి తీసుకుని, నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ విచారణలో స్మగ్లర్లు పలు కీలక విషయాలు చెప్పినట్లు తెలిసింది. ఎర్రచందనం స్మగ్లింగ్‌లో చెన్నై, బెంగాల్ ఇతర ఏ ప్రాంతంలోని స్మగ్లర్లు అయినా జిల్లాలోని కొందరు వ్యక్తులతో సంబంధాలు పెట్టుకుంటునే ఆయా ప్రాంతాలకు ఎర్రచందనం దుంగలు ఎగుమతి చేయడం సాధ్యమవుతుంది. ఈ దిశగా విచారణ చేపట్టన పోలీసులు తాము అరెస్టు చేసిన నిందితుల ఫోన్‌కాల్స్ జాబితాను పరిశీలించారు. ఇందులో జిల్లాకు చెందిన పలువురు ఎర్ర స్మగ్లర్లకు సంబంధం ఉన్నట్లు నిర్ధారించారు. మరోవైపు ఈ ఆపరేషన్‌లో పట్టుబడ్డ షణ్ముగం, రవిలను సైతం కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం నుంచి సానుకూలంగా ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది. వీరిద్దర్నీ విచారిస్తే ఇందులో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి, ఎర్రచందనం రవాణాకు వాహనాలు సమకూర్చింది ఎవరు, నగదు పంపిణీ ఎలా జరిగిందనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందని పోలీసులు అంటున్నారు. మరోవైపు గడిచిన నాలుగేళ్ల కాలంలో ఈ ఏడుగురు నిందితులు జిల్లా నుంచి తరలించిన 700 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం దుంగలకు సంబంధించి నగదు లావాదేవీలు ఎలా జరిగాయని కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఇందు కోసం డెరైక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ)తో సంప్రదించి వారు ఇచ్చే సమాచారంతో సంయుక్త దర్యాప్తు చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే చెన్నైలోని డీఆర్ఐ అధికారులతో చిత్తూరు పోలీసులు సంప్రదింపులు కూడా జరిపారు. పలువురి అరెస్టులకు సిద్ధం నిందితులు ఇచ్చిన సమాచారంతో జిల్లాకు చెందిన పలువురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేయడానికి పోలీసు శాఖ సమాయత్తమవుతోంది. ఇప్పటికే ఎర్రచందనం స్మగ్లింగ్‌లో అరెస్ట అయి బయట ఉన్న కొందరు స్మగ్లర్లకు ఈ వ్యవహారంలో సంబంధాలు ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దీనిపై పలు ఆధారాలు చేతిలో ఉంచుకుని నిందితులను పకడ్బందీగా అరెస్టు చేయడానికి పోలీసులు వ్యూహ రచన చేస్తున్నారు. మరి ఇందులో రాజకీయ ఒత్తిళ్లు ఏమైనా పనిచేస్తాయా... పోలీసుల వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయనే విషయాలు వేచి చూడాల్సి ఉంది. -
తీగలాగితే ‘డంప్’ కదిలింది
చిత్తూరు (అర్బన్): ఆపరేషన్‌రెడ్‌లో జిల్లా పోలీసులు తొలిసారిగా భారీ ఎత్తున ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఆపరేషన్రెడ్లోని పోలీసు బృందాలు సాహసం చేసి మరీ రూ.30 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు. చైనాకు తరలించడానికి సిద్ధంగా ఉన్న దుంగలను పట్టుకుని సాహసం ప్రదర్శించారు. తీగ ఇలా లాగారు.. ఎర్రచందనం స్మగ్లింగ్‌లో చెన్నైకు చెందిన ఓ వ్యక్తిని మూడు రోజుల క్రితం చిత్తూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతన్ని విచారించగా పశ్చిమబెంగాల్లోని జయగామ్ వద్ద సౌందరాజన్ అనే వ్యక్తికి తాను ఎర్రచందనం దుంగలను సరఫరా చేస్తున్నట్లు చెప్పాడు. సౌందర్‌రాజన్ ఎత్తు, పోలికలు, ఇతర గుర్తులను చెప్పాడు. ఈ చిన్నపాటి ఆనవాళ్లతో పదిమందితో కూడిన పోలీసు బృం దాన్ని ఎస్పీ శ్రీనివాస్ పశ్చిమ బెంగాల్‌కు పంపారు. ఆదివారం రాత్రి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని జయగామ్ వద్దకు జిల్లా పోలీసు లు చేరుకున్నారు. ఇక్కడి నుంచి భూటాన్‌కు కేవలం రెండు కిలోమీటర్ల దూరమే. ఇక్కడ సౌందర్‌రాజన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఎర్రచందనం డంప్ ఉన్న ప్రాంతంలోకి పదిమంది పోలీసుల బృందం చేరుకుంది. ఇక్కడ ఓ గోడౌన్లో ఉంచిన 149 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే సౌందర్‌రాజన్‌ను పట్టుకునే క్రమంలో పోలీసులు అడవుల్లోంచి వెళ్లాల్సి వచ్చింది. ఆదివారం రాత్రి 10 గంటలకు అడవుల్లో వెళుతున్న చిత్తూరుకు చెందిన మహిళా స్టేషన్ డీఎస్పీ గిరిధర్‌రావు, సీఐ షాదిక్అలీ బృందాన్ని రెండు ఏనుగులు తరుముకున్నాయి. ఏనుగుల చూపు మరల్చి మన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. సౌందర్రాజన్ది చెన్నై. ఇతను ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ఆరితేరి పశ్చిమబెంగాల్లో స్థిరపడ్డాడు. ఇతన్ని విచారించగా చెన్నైలో మరో డంప్ ఉన్న విషయాన్ని పోలీసులకు చెప్పాడు. అనంతరం 28 మంది ఉన్న మరో బృందాన్ని ఎస్పీ శ్రీనివాస్ చెన్నైకు పంపారు. ఇక్కడ శరవణన్ అనే స్మగ్లర్‌ను అదుపులోకి తీసుకున్నారు. చెన్నై సమీపంలోని ఆవడి వద్ద ఉన్న సిప్కాట్ ఇండస్ట్రీస్ వద్ద 167 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శరవణన్‌కు సైతం అరెస్టు చేశారు. ఆలస్యమయితే అంతే.. పశ్చిమ బెంగాల్‌కు జిల్లా పోలీసులు కాస్త ఆలస్యంగా వెళ్లి ఉంటే ఎర్రచందనం దుంగలను స్మగ్లర్లు దేశ సరిహద్దు దాటించేసుంటారు. లారీల్లో ఈ సరుకును భూటాన్‌కు, అటు నుంచి చైనాకు తరలించడానికి స్మగ్లర్లు రంగం సిద్ధం చేసుకున్నారు. అంతలోపు జిల్లా పోలీసులు స్మగ్లర్‌తో సహా దుంగలను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం సాయంత్రం సౌందర్‌రాజన్‌ను పశ్చిమ బెంగాల్‌లోని జయగామ్ న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. దుంగలను సైతం జిల్లాకు తీసుకురావడానికి న్యాయస్థానం నుంచి అనుమతి తీసుకున్నారు. గురువారం తీసుకొచ్చే అవకాశం ఉంది. -
ఆపరేషన్ ‘రెడ్’లో పెద్ద చేపలు!
చిత్తూరు (అర్బన్): టాస్క్‌ఫోర్స్ పోలీ సులు నిర్వహించిన ఆపరేషన్‌రెడ్‌లో ఇద్దరు బడా ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ లో ఏటా రూ.కోటికిపైగా సంపాదించే జిల్లాకు చెందిన నిమ్మ మహేష్ (39), శ్రీ పొటిశ్రీరాములు నెల్లూరుకు చెందిన ఉదయ భాస్కర్ అనే రవికుమార్ (50)లు ఉన్నారు. వీరితోపాటు టీ.వెం కటరెడ్డి (26), సూరిబాబు (36), రమేష్‌రెడ్డి (26), నరసింహారెడ్డి (25), విష్ణువర్దర్‌రెడ్డి (35), రామకృష్ణారెడ్డి (44), శ్రీధర్‌రెడ్డి (40), దామోదర్ నా యుడు (35)ను అరెస్టు చేశారు. వీరిలో ఓ టీవీ చానల్ అసిస్టెంట్ డెరైక్టర్, మరో ఎడిటర్ కూడా ఉండటం గమనా ర్హం. సోమవారం చిత్తూరులోని జిల్లా పోలీసు అతిథిగృహంలో ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో ఎస్పీ శ్రీని వాస్, చిత్తూరు డీఎస్పీ లక్ష్మీనాయుడు ఈ వివరాలను వెల్లడించారు. నిందితు లనుంచి అంబాసిడర్ కారు, మినీ లారీ, టాటా-407, ఓ ల్యాప్‌టాప్, రూ.12,373, 23 ఎర్ర చందనం దుంగలను పుంగనూరు, పూతలపట్టు ప్రాం తాల్లో స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.50లక్షల వరకు ఉంటుం దని ఎస్పీ తెలిపారు. ఆపరేషన్ రెడ్‌లో పాల్గొన్న బృందానికి రివార్డులు సైతం ఇవ్వనున్నట్లు ఎస్పీ తెలిపారు. పట్టుబడ్డ నిందితుల వివరాలు పరిశీలిస్తే... వెంకటరెడ్డి: ఇతను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తి. హైదరాబాదులోని అమీర్‌పేటలో నివాసం ఉంటున్నాడు. పదో తరగతి వరకు చదువుకున్న ఇతను ప్రముఖ టీవీ చానల్లో ప్రసారమయ్యే ఓ సీరియల్‌కు అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేశాడు. విష్ణువర్దన్‌రెడ్డి ద్వారా ఎర్రచందనం వ్యాపారంలోకి వచ్చాడు. ఇప్పటివరకు ఇతనిపై ఐదు కేసులు ఉన్నాయి. రమేష్‌రెడ్డి : వైఎస్సార్ జిల్లా లింగాలదిన్నెకు చెందిన ఇతను ఐదో తరగతి చదువుకున్నాడు. వృత్తిరీత్యా రైతు. తొందరగా డబ్బు సంపాదించాలని గతేడాదిగా ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తున్నాడు. ఇతనిపై జిల్లాలో ఐదు కేసులు ఉన్నాయి. నరసింహారెడ్డి: ఇతనిది వైఎస్సార్ జిల్లా లింగాలదిన్నె. ఏడో తరగతి వరకు చదువుకుని పొలం పనులు చూసుకుంటున్నాడు. అదే గ్రామానికి చెందిన విష్ణువర్ధన్‌రెడ్డి ద్వారా స్మగ్లింగ్‌లోకి వచ్చాడు. ఇతనిపై నాలుగు కేసులు ఉన్నాయి. ఇతని తమ్ముడు బంగారురెడ్డి పెద్ద ఎర్రచందనం స్మగ్లర్ కావడం గమనార్హం. సూరిబాబు: మచిలీపట్నానికి చెందిన ఇతడు హై దరాబాదులో నివాసం ఉంటున్నాడు. పదో తరగతి తరువాత ఐటీఐ చేసిన ఇతను ఓ తెలుగు టీవీ ఛానల్ లో ఎడిటర్‌గా పనిచేస్తున్నాడు. హైదరాబాద్‌కు చెందిన కృష్ణారెడ్డి, అశోక్‌రెడ్డి ద్వారా ఎర్రచందనం వ్యాపారంలోకి వచ్చాడు. ఇతనిపై నాలుగు కేసులు ఉన్నాయి. విష్ణువర్థన్‌రెడ్డి: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వింజమూరుకు చెందిన ఇతను హైదరాబాద్‌లోని చైతన్యనగర్‌లో కాపురం ఉంటున్నాడు. డిగ్రీ చదివి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ తొమ్మిది నెలలుగా ఎర్రచందనం స్మగ్లింగ్‌లోకి దిగాడు. ఇతనిపై ఐదు కేసులు ఉన్నాయి. రామకృష్ణారెడ్డి: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వింజమూరు స్వగ్రామం. ఇంటర్ వరకు చదువుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయగా లాభాలు రాలేదు. 2008 నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్‌లో మధ్యవర్తిగా వ్యవహరిస్తూ ఏటా రూ.50 లక్షలు సంపాదిస్తున్నాడు. ఇతడిపై ఐదు కేసులు ఉన్నాయి. శ్రీధర్‌రెడ్డి: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వింజమూరుకు చెందిన ఇతను పదో తరగతి వరకు చదివి ఓ ప్రైవేటు కంపెనీలో సూపర్వైజర్గా పనిచేసేవాడు. ఐదు నెలలుగా ఎర్రచందనం తరలింపులో మధ్యవర్తిగా పనిచేస్తున్నాడు. బయటి ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం చేయడం కూడా వృత్తిగా కొనసాగించేవాడని పోలీసుల విచారణలో తేలింది. సంవత్సరాదాయం రూ.50 లక్షలు. ఇతనిపై ఐదు కేసులు ఉన్నాయి. దామోదర్‌నాయుడు: తిరుపతి న్యూ ఇందిరానగర్‌లో కాపురం ఉంటున్న ఇతను ఇంటర్ చదువుకున్నాడు. వెడ్డింగ్ ప్లానర్‌గా పనిచేసేవాడు. ఏడాదిన్నర గా ఎర్రచందనం అక్రమ రవాణాలో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నాడు. ఇతనిపై నాలుగు కేసులు ఉన్నాయి. నిమ్మ మహేష్: జిల్లాలోని పెద్దమండ్యం పాపయ్యపల్లెకు చెందిన వ్యక్తి. ఎలాంటి చదువు లేకపోయినప్పటికీ డ్రైవర్‌గా పనిచేసేవాడు. అయితే 2007 నుంచి ఎర్ర చందనం స్మగ్లింగ్‌లోకి దిగాడు. ఆర్నెల్ల క్రితం కూడా హార్సిలీహిల్స్‌లో పోలీసులు పట్టుకోవడానికి ప్రయత్నించగా పారిపోయాడు. ఇప్పటి వరకు జిల్లా నుంచి 300 టన్నుల ఎర్రచందనం దుంగల్ని అక్రమ రవాణా చేశాడు. ఒక ఏడాదికి రూ.కోటి వరకు సంపాదించేవాడు. మహేష్‌పై జిల్లాలో 22 కేసులు ఉన్నాయి. ఉదయ భాస్కర్: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా హరినాథ్పురానికి చెందిన ఇతను ఇటీవల విజయవాడలో పట్టుపడ్డ ఎర్రచందనం డంప్‌నకు యజమాని. డిగ్రీ చదువుకున్న ఉదయ భాస్కర్ తన పేరును రవికుమార్‌గా కూడా చెప్పుకునేవాడు. 2006లో ప్రకాశం జిల్లా నుంచి ఎర్రచందనం స్మగ్లర్ భాషాతో సంబంధాలు పెట్టుకుని వ్యాపారం ప్రారంభించాడు. ఇప్పటి వరకు 20 టన్నుల ఎర్రచందనం స్మగ్లింగ్ చేశాడు. ఇతనికి ఏటా రూ.కోటి ఆదాయం వచ్చేది. ఇతనిపై 6 కేసులు ఉన్నాయి.