ఢిల్లీలో చిత్తూరు పోలీసులకు చిక్కిన చైనీయుడు
5 టన్నుల వరకు ఎర్రచందనం స్వాధీనం
బుద్ధుడి విగ్రహాలు, ఇతర వస్తువుల రూపంలో ఎగుమతి
విదేశీ కరెన్సీ సైతం పట్టివేత
చిత్తూరు (అర్బన్) : ఆపరేషన్ రెడ్‌లో చిత్తూరు పోలీసులు మరో పెద్ద అడుగు ముందుకేశారు. ఇప్పటికే చైనాకు చెందిన యంగ్‌పెంగ్ అనే స్మగ్లర్‌ను అరెస్టు చేసిన చిత్తూరు పోలీసులు తాజాగా మరో చైనీయుడిని అరెస్టు చేశారు. శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఢిల్లీలోని ఫరీదాబాద్ వద్ద ఉన్న ఓ గోడౌన్‌లో ఎర్రచందనం చూడటానికి వెళ్లిన ఛెన్‌యై ఫియాన్ (42) అనే చైనా దేశీయుడిని పట్టుకున్నారు. అతని నుంచి 2521 యాన్ (చైనా కరెన్సీ), 170 యూఎస్ డాలర్లను, గోడౌన్‌లో ఉన్న దాదాపు 5 టన్నుల ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన విధమిదీ
మదనపల్లె టూటౌన్ పోలీసు స్టేషన్‌లో ఇటీవల ఓ నిందితుడిని ఎర్రచందనం స్మగ్లింగ్‌లో పట్టుకున్నారు. ఇతనిపై స్థానిక పోలీసు స్టేషన్‌లో (క్రైమ్‌నెం. 103-2015) కేసు కూడా నమోదయింది. ఇతను ఇచ్చిన సమాచారంతో మొత్తం 21 మందిపై మదనపల్లె పోలీసులు కేసు నమోదు చేశారు. ఫియాన్ ఈ కేసులో 21వ నిందితుడు. తొలుత పట్టుబడ్డ నిందితుడిని విచారించగా ఎర్రచందనం ఢిల్లీకి తరలించి అక్కడ నుంచి విదేశాలకు వీటిని పంపుతున్నట్లు అంగీకరించాడు.
ఈ సమాచారంతో చిత్తూరు ఎస్పీ శ్రీనివాస్ ఓ బృందాన్ని నెల 27న ఢిల్లీకి పంపారు. ఇక్కడున్న ఫరీదాబాద్‌లో చైనా దేశానికి చెందిన ఓ వ్యక్తి ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నట్లు గుర్తించారు. దీంతో శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఫరీదాబాద్‌లో ఫియాన్‌ను అరెస్టు చేశారు. ఇతడిని అక్కడి కోర్టులో హాజరుపరచి ట్రాన్సిస్ట్ వారెంట్‌తో చిత్తూరుకు తీసుకెళ్లడానికి పోలీసులు అనుమతి తీసుకున్నారు. ఇతనితో పాటు అక్కడున్న గోడౌన్‌లోని ఎర్రచందనం దుంగ లను సైతం పోలీసులు సీజ్ చేసి చిత్తూరుకు తీసుకొస్తున్నారు.
గడువు ముగిసిన వీసా...
ఛెన్‌యై ఫియాన్ చైనా దేశంలోని క్సిమెన్ టౌన్, ఫుజియాన్ రాష్ట్ర వాసిగా పోలీసులు గుర్తించారు. ఇతను భారత్‌కు రావడానికి జారీ చేసిన వీసాకు కాలం చెల్లినట్లు నిర్ధారించారు. ఇతనికి చైనా దేశం జారీచేసిన పాస్‌పోర్టు (నెం-జీ24311513)ను సైతం పోలీసులు సీజ్ చేశారు. ఇతనికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది.
పలు ‘ఎర్ర’ వస్తువుల స్వాధీనం
ఎర్రచందనంతో తయారుచేసిన పలు రకాల వస్తువులను ఫియాన్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫియాన్ తరచూ భారత్‌కు వచ్చి ఎర్రచందనం దుంగల ద్వారా బుద్ధుడి విగ్రహాలు, చైనా దేవుని విగ్రహాలు, సిగరెట్ లైటర్లు, పొగాకు పీల్చే లైటర్లు, దువ్వెనలు, లక్కీమన్ విగ్రహాలను తయారు చేసి చైనాకు ఎగుమతి చేస్తున్నట్లు నిర్ధారించారు.
పోలీసుల అదుపులో మరికొంత మంది
ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో రెండు రోజుల క్రితం మదనపల్లెలో బంగారుపాళ్యంకు చెందిన డాబా శీను అనే ప్రధాన స్మగ్లర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇతడిని విచారించగా పలువురు అంతర్జాతీయ స్మగ్లర్ల పేర్లను చెప్పాడు. వీరిలో చైనా, దుబాయ్, బర్మా దేశాలకు చెందినవారు ఉండగా, ఫియాన్ ఈ కేసులో 21వ నిందితుడు. డాబా శీను ఇందులో ప్రధాన నిందితుడు. ఇతనితో పాటు హరిబాబు (బంగారుపాళెం), చెన్నైకు చెందిన సింగారవేలు, భాస్కరన్, చిట్టిరాజన్, మధు, ఇస్మాయిల్, కుమార్, వెంకటేశన్, శేఖర్ మౌళి(బర్మా), అరీదుద్దీన్ (చెన్నై), సెల్వరాజ్ (చెన్నై), సాహుల్‌భాయ్ (దుబాయ్), షణ్ముగం (చెన్నై), హషరఫ్ (ఢిల్లీ), ముస్తాఫా (ముంబాయ్), ప్రవీణ్ (పూనే), హాసీఫ్ (పూనే), రాజా (ఢిల్లీ) ఉన్నారు. వీరిలో ముగ్గురు స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరిపై ఇప్పటికే మదనపల్లె టూటౌన్ పోలీసు స్టేషన్‌లో (క్రైం.నెం-103/2015) కేసు నమోదయింది.
మరో ‘ఎర్ర’ తిమింగలం
Published Sun, May 31 2015 3:40 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement
Advertisement