ఐదుగురు స్మగ్లర్ల అరెస్టు
రూ.3 కోట్ల విలువైన దుంగలు, వాహనాలు స్వాధీనం
తప్పించుకున్న మరో ముఠా ఎస్పీ శ్రీనివాస్ వెల్లడి
చిత్తూరు (అర్బన్): ఎర్ర చందనం స్మగ్లర్లను పట్టుకోవడానికి గత వారం రోజులుగా చిత్తూరు పోలీసులు కర్ణాటకలో నిర్వహించిన ‘ఆపరేషన్‌రెడ్’ ముగిసింది. ఈ ఆపరేషన్‌లో ఐదుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. చిత్తూరులోని పోలీసు మైదానంలో ఎస్పీ ఘట్టంనేని శ్రీనివాస్ బుధవారం ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ ఆపరేషన్‌లో స్మగర్ల నుంచి రూ.3 కోట్ల విలువైన 7 టన్నుల ఎర్రచందనం దుంగలు, నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.
బయట పడింది ఇలా..
పది రోజుల క్రితం కల్లూరులో పోలీసు లు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ ఇన్నోవా వాహనం విధుల్లో ఉన్న కానిస్టేబుల్ గౌస్‌బాషాను ఢీకొని వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ కాలు కూడా విరిగింది. వాహనాన్ని వెంబడించిన పోలీసులు బెంగళూరుకు చెందిన ఇర్ఫాన్, సయ్యద్ ముబారక్ అనే ఇద్దరిని అరెస్టు చేశారు. వీరిచ్చిన సమాచారంతో బెంగళూరు సమీపంలోని కటికనహళ్లి, గిడ్డప్పనహళ్లి ప్రాంతాల్లో చిత్తూరు ఓఎస్డీ రత్న ఆధ్వర్యంలో కర్ణాటక పోలీసుల సాయంతో దాడులు చేశారు. ఈ దాడుల్లో పేరుమోసిన అంతరాష్ట్ర స్మగ్లర్ ఫసీ ఉద్దీన్‌కు చెందిన డంప్ స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇతను పరారయ్యాడు. కాగా కర్ణాటకకు చెందిన పలువురు పెద్ద మనుషులతో కలిసి ఫసీ గతంలో చిత్తూరు పోలీసులను ఆశ్రయించి తన ప్రాంతంలో ఎర్రచందనంపై కళాజాత, అవగాహన సదస్సులు నిర్వహించాలని కోరడం విశేషం! పైకి పెద్దమనుషులుగా లోపల స్మగ్లర్లుగా చెలామణి అవుతున్న వైనాన్ని సైతం పోలీసులు కనిపెట్టారు. ఇక అదే ప్రాంతంలో జమీర్‌ఖాన్ గ్యాంగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
నిందితులు
పట్టుబడ్డ వారిలో జమీర్‌ఖాన్ (26) కటిహనహళ్లికి చెందిన వ్యక్తి. చూడటానికి బాలీవుడ్ సినిమాల్లో విలన్‌లా కనిపించే ఇతను అంతర్ రాష్ట్ర స్మగ్లర్. పదో తరగతి వరకు చదివి, మెడికల్ షాపులో పని చేస్తుండేవాడు. అయితే 2014 నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ తమిళనాడుకు చెందిన శశి అనే వ్యక్తి ద్వారా కూలీలను రప్పించేవాడు. ఇతనిపై 12 కేసులు ఉన్నాయి. అలాగే ఇదే ప్రాంతానికి చెందిన అదిల్ షరీఫ్ (27), షేక్ ముబారక్ (26), తౌసీఉల్లా ఖాన్ (30), మహ్మద్ యూసఫ్ (27లను సైతం పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు ఒక్కొక్కరిపై 5 నుంచి 12 కేసులు జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో నమోదయ్యాయి. ఈ ఆపరేషన్‌లో ఫసీ గ్యాంగ్ కోసం, కూలీలు, మేస్త్రీలను సరఫరా చేసే తమిళనాడుకు చెందిన శని అనే వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
అభినందన
ఆపరేషన్‌లో పాల్గొన్న పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. అందరికీ ప్రశంసా పత్రాలను అందచేశారు. సమావేశంలో ఓఎస్డీ రత్న, డీఎస్పీలు గిరిధర్, రామ్‌కుమార్, లక్ష్మీనాయుడు, శ్రీకాంత్, దేవదాసు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
కర్ణాటకలో ముగిసిన ఆపరేషన్ రెడ్
Published Thu, Mar 17 2016 1:49 AM | Last Updated on Sun, Sep 3 2017 7:54 PM
Advertisement