‘ఎర్ర’ ప్రకంపనలు
చెన్నై ముఠా నుంచి కీలక సమాచారం
పోలీసుల కస్టడీలో వివరాలిచ్చిన స్మగ్లర్లు
ఫోన్‌కాల్స్ జాబితా పరిశీలిస్తున్న పోలీసులు
నగదు లావాదేవీలపై డీఆర్‌ఐతో దర్యాప్తు
జిల్లాలో పలువురు అరెస్టుకు రంగం సిద్ధం
చిత్తూరు(అర్బన్): ఆపరేషన్ రెడ్ లో భాగంగా చెన్నై-పశ్చిమ బెంగాల్‌లో పట్టుబడ్డ ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి చిత్తూరు పోలీసు యం త్రాంగం పలు కీలక సమాచారాలు సేకరించింది. గత వారంలో జిల్లా పోలీసులునిర్వహించిన చెన్నై-పశ్చిమ బెంగాల్ ఆపరేషన్‌లో కింగ్‌పిన్ షణ్ముగంతోపాటు సౌందరరాజన్, శరవణన్‌లతో పాటు మొత్తం ఏడుగురు స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరిని న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండుకు తరలించారు. అయితే ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్న శరవణన్, సౌందరరాజన్‌లను గత రెండు రోజులుగా పోలీసులు న్యాయస్థానం నుంచి అనుమతి తీసుకుని, నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ విచారణలో స్మగ్లర్లు పలు కీలక విషయాలు చెప్పినట్లు తెలిసింది.
ఎర్రచందనం స్మగ్లింగ్‌లో చెన్నై, బెంగాల్ ఇతర ఏ ప్రాంతంలోని స్మగ్లర్లు అయినా జిల్లాలోని కొందరు వ్యక్తులతో సంబంధాలు పెట్టుకుంటునే ఆయా ప్రాంతాలకు ఎర్రచందనం దుంగలు ఎగుమతి చేయడం సాధ్యమవుతుంది. ఈ దిశగా విచారణ చేపట్టన పోలీసులు తాము అరెస్టు చేసిన నిందితుల ఫోన్‌కాల్స్ జాబితాను పరిశీలించారు. ఇందులో జిల్లాకు చెందిన పలువురు ఎర్ర స్మగ్లర్లకు సంబంధం ఉన్నట్లు నిర్ధారించారు. మరోవైపు ఈ ఆపరేషన్‌లో పట్టుబడ్డ షణ్ముగం, రవిలను సైతం కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం నుంచి సానుకూలంగా ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది. వీరిద్దర్నీ విచారిస్తే ఇందులో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి, ఎర్రచందనం రవాణాకు వాహనాలు సమకూర్చింది ఎవరు, నగదు పంపిణీ ఎలా జరిగిందనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందని పోలీసులు అంటున్నారు. మరోవైపు గడిచిన నాలుగేళ్ల కాలంలో ఈ ఏడుగురు నిందితులు జిల్లా నుంచి తరలించిన 700 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం దుంగలకు సంబంధించి నగదు లావాదేవీలు ఎలా జరిగాయని కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఇందు కోసం డెరైక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్‌ఐ)తో సంప్రదించి వారు ఇచ్చే సమాచారంతో సంయుక్త దర్యాప్తు చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే చెన్నైలోని డీఆర్‌ఐ అధికారులతో చిత్తూరు పోలీసులు సంప్రదింపులు కూడా జరిపారు.
పలువురి అరెస్టులకు సిద్ధం
నిందితులు ఇచ్చిన సమాచారంతో జిల్లాకు చెందిన పలువురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేయడానికి పోలీసు శాఖ సమాయత్తమవుతోంది. ఇప్పటికే ఎర్రచందనం స్మగ్లింగ్‌లో అరెస్ట అయి బయట ఉన్న కొందరు స్మగ్లర్లకు ఈ వ్యవహారంలో సంబంధాలు ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దీనిపై పలు ఆధారాలు చేతిలో ఉంచుకుని నిందితులను పకడ్బందీగా అరెస్టు చేయడానికి పోలీసులు వ్యూహ రచన చేస్తున్నారు. మరి ఇందులో రాజకీయ ఒత్తిళ్లు ఏమైనా పనిచేస్తాయా... పోలీసుల వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయనే విషయాలు వేచి చూడాల్సి ఉంది.