కడప అర్బన్: అటవీశాఖ ఫ్లయింగ్ స్క్వాడ్ డీఎఫ్‌ఓ, కడప ఇన్‌చార్జి డీఎఫ్‌ఓ నాగరాజు ఆధ్వర్యంలో ఫ్లయింగ్ స్క్వాడ్ ఎఫ్‌ఆర్‌ఓ ఎస్‌ఎం హయాత్, రాయచోటి ఎఫ్‌ఆర్‌ఓ శ్రీరాములు తమ సిబ్బందితో కడప-రాజంపేట రహదారిలోని భాకరాపేట సమీపంలోగల హెచ్‌పీసీఎల్ వద్ద లారీతోసహా ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎర్రచందనాన్ని తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో భాకరాపేటకు చెందిన తుర్రా వెంకట సుబ్బయ్య, తుర్రా ప్రతాప్, తుర్రా శ్రీనివాసులు, తుర్రా ప్రభాకర్‌లు తరలిస్తుండగా, విశ్వసనీయ సమాచారం మేరకు పట్టుకున్నామని డీఎఫ్‌ఓ వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ దాడిలో మూడు టన్నుల బరువున్న 94 ఎర్రచందనం దుంగలను, 10 టైర్ల లారీ (ఏపీ16 టీయూ 2722)ను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులు పరారయ్యారన్నారు. ఎర్రచందనం దుంగల విలువ కోటి రూపాయలు, లారీ రూ.8 లక్షలకు పైగా ఉంటుందని తెలిపారు. ఈ దాడిలో పాల్గొన్న ఎఫ్‌ఆర్‌ఓలు హయాత్, శ్రీరాములు, ఎఫ్‌ఎస్‌ఓలు ఓబులేసు, చెండ్రాయుడు, ఎంబీఓలు శ్రీనివాసులు, సురేష్, కృష్ణ, ప్రొటెక్షన్ వాచర్‌లు, స్ట్రైకింగ్ ఫోర్స్‌ను అభినందించారు.
8 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
బద్వేలు అర్బన్: అక్రమంగా తరలిస్తున్న 8 ఎర్రచందనం దుంగలతో పాటు ఓ ఇండికా వాహనాన్ని స్వాధీనం చేసుకుని, ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు బద్వేలు సీఐ వెంకటప్ప తెలిపారు. సోమవారం స్థానిక అర్బన్ పోలీసు స్టేషన్ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పట్టణంలో సోమవారం తెల్లవారుజామున వాహనాలు తనిఖీ చేస్తుండగా ఏపీ21 ఏఆర్ 3978 నంబరుగల ఇండికా కారు అనుమానాస్పదంగా ఉండడంతో వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అందులో 8 ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు గుర్తించామన్నారు.
కారులో ఉన్న అనంతపురం జిల్లా గోరంట్ల పట్టణానికి చెందిన పఠాన్ బాబా ఫకృద్దీన్ అలియాస్ బాబు, సింహాద్రిపురం మండలం కొత్తపల్లె గ్రామానికి చెందిన రాంబాబులను అదుపులోకి తీసుకుని విచారించగా నెల్లూరు జిల్లా వింజమూరు నుంచి బెంగళూరుకు చెందిన పేరుమోసిన స్మగ్లర్ అక్రమ్ అనుచరుడు తంబుకు దుంగలు చేరవేస్తున్నట్లు తెలిపారన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎస్‌ఐ నాగమురళి, ఎస్‌బి ఎస్‌ఐ రామాంజనేయులు, ఐడీపార్టీ కానిస్టేబుళ్లు నాగార్జున, శేఖర్‌బాబు, రాజేంద్ర, తదితరులు పాల్గొన్నారు.
రూ.కోటి విలువ గల ఎర్రచందనం స్వాధీనం
Published Tue, Dec 9 2014 4:00 AM | Last Updated on Tue, Oct 30 2018 7:25 PM
Advertisement
Advertisement