ఆగని ‘రెడ్’ స్మగ్లింగ్
► తమిళ కూలీలతో భారీగా ఎర్రచందనం చెట్ల నరికివేత
► సిద్దేశ్వరం అడవుల్లో కొనసాగుతున్న కూంబింగ్
ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్ట లేకపోతోంది. అటవీ శాఖ అధికారులు, పోలీసుల కళ్లుకప్పి స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నారు. ఈ అక్రమ రవాణాలో తమిళ కూలీలు కీలకపాత్ర పోషిస్తున్నారు.
ఉదయగిరి: ఉదయగిరి నియోజకవర్గంలోని సిద్దేశ్వరం అడవుల్లో తమిళనాడుకు చెందిన 30 మంది కూలీలు అడవిలోకి ప్రవేశించి ఎర్రచందనం చెట్లు నరికివేస్తున్నట్లు మూడురోజుల క్రితం పోలీసులకు సమాచారం అందింది. దీంతో ప్రత్యేకదళాలు, అటవీ సిబ్బంది కలిసి ఆదివారం గాలింపు చర్యలు చేపట్టగా నలుగురు తమిళ కూలీలు చిక్కారు. మిగతా 26 మంది తప్పించుకున్నట్లు తెలిసింది. వీరిని పట్టుకునేందుకు బలగాలు అన్ని వైపులనుంచి గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ఇప్పటికే కూలీలు నరికివేసిన ఎర్రచందనం దుంగలను కనుక్కునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. సుమారు రూ.50 లక్షలకు పైగా విలువచేసే దుంగలను నరికి దాచినట్లుగా అనుమానిస్తున్నారు.
ఈ దుంగలను ఎప్పటికప్పుడు బయటకు తరలించి ఉండవచ్చని ఓ పోలీసు అధికారి అనుమానం వ్యక్తం చేశారు. మొత్తమ్మీద సిద్దేశ్వరం అడవుల్లోని సుదూర ప్రాంతంలో ఉన్న లోయల్లోనే నాణ్యమైన చందనాన్ని కొల్లగొట్టేందుకు స్మగ్లర్లు నిరంతరం తమ ప్రక్రియను కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ సమస్య అటు అటవీ, ఇటు పోలీసు బలగాలకు సవాల్‌గా మారింది. ప్రపంచంలోకెల్లా నాణ్యమైన ఎర్రచందనం నెల్లూరు, చిత్తూరు జిల్లాల సరిహద్దుల్లోని వెలుగొండ అడవుల్లో ఉంది. దీనిని అక్రమంగా నరికి స్మగ్లింగ్ చేస్తూ అనేకమంది రూ.కోట్లకు పడగలెత్తారు. ఈ వ్యవహారంలో బడా నాయకులతో పాటు కొందరు రాజకీయ నేతల ప్రమేయం
ఉన్న విషయం అందరికీ విదితమే.
కడప జిల్లానుంచి ప్రవేశం.. సిద్దేశ్వరం అడవుల్లోని లోయల్లో ఉన్న ఎర్రచందనం దుంగలను నరికేందుకు తమిళనాడు నుంచి తీసుకొచ్చిన కూలీలను స్మగ్లర్లు కడప జిల్లా బద్వేలు వైపునుంచి లోపలకు తీసుకెళుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 23న అదే వైపునుంచి 60 మంది తమిళ కూలీలు సిద్దేశ్వరం అడవుల్లోకి ప్రవేశించారు. విషయం తెలుసుకున్న అటవీ, పోలీసు బలగాలు రంగప్రవేశం చేసి కూలీలు చెట్లు నరికే ప్రాంతానికి ప్రవేశించాయి. అప్పట్లో నలుగురు కూలీలు పట్టుబడ్డారు. 50 మందికి పైగా తప్పించుకున్నారు. పోలీసులు వెంటాడినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అప్పటికే కూలీలు కొట్టిన ఎర్రచందనం దుంగలను స్మగ్లర్లు సురక్షిత ప్రాంతాలకు తరలించుకున్నారు. గత ఏడాది డిసెంబర్‌లో ఉదయగిరి మండలం కుర్రపల్లి వద్ద అక్రమంగా తరలిస్తున్న 60 దుంగలను, నలుగురు చెన్నై స్మగ్లర్లును పోలీసులు పట్టుకున్నారు. రూ.60 లక్షలు విలువచేసే దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదే నెలలోకూడా మరో 50 ఎర్రచందనం దుంగలను ప్రత్యేక పోలీసులు గాలింపు చర్యల్లో భాగంగా కనుక్కొన్నారు. స్మగ్లర్లు తప్పించుకున్నారు. కొంతకాలం పాటు స్తబ్దుగా ఉన్న ఎర్ర స్మగ్లర్లు అవకాశం దొరికినప్పుడల్లా స్మగ్లింగ్‌కు పాల్పడుతూనే ఉన్నారు. గతంలో స్మగ్లర్లు స్థానికులతో మాత్రమే ఎర్రచందనం చెట్లు నరికించి స్మగ్లింగ్ చేసేవారు. ఏడాది నుంచి స్థానికులు దీనికి దూరంగా ఉండటంతో తమిళనాడు నుంచి ఎక్కువ మొత్తం ఇచ్చి కూలీలను పిలిపించుకుంటున్నారు.
అటవీ సిబ్బంది ప్రమేయంపై అనుమానాలు
ఈ ప్రాంతంలో పనిచేస్తున్న కొంతమంది సిబ్బంది సహకారం స్మగ్లర్లకు ఉండవచ్చని భావిస్తున్నారు. కూంబింగ్ కోసం అడవిలోకి ప్రత్యేక బలగాలు ప్రవేశించే అవకాశం ఉన్న సమయంలో ముందస్తుగానే స్మగ్లర్లకు సమాచారం అందుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎక్కువమంది కూలీలు తప్పించుకుంటున్నారు. ఒకరిద్దరు మాత్రమే పోలీసులకు చిక్కుతున్నారు. కొన్నేళ్లనుంచి ఇదే ప్రాంతంలో పాతుకుపోయిన అటవీ, పోలీసు సిబ్బంది సహకారం స్మగ్లర్లకు లభిస్తున్నట్లుగా సమాచారం. ఏది ఏమైనప్పటికీ ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధానికి ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చినా ఆశించిన ప్రయోజనాలు మాత్రం కనిపించడం లేదు.