వలస నేత.. మారేనా రాత!
► కేసులున్న వ్యక్తికి మంత్రి పదవా?
► ఎలా ఇస్తారని ఒక వర్గం వాదన
► పార్టీకి చెడ్డపేరు వస్తుందనే అభిప్రాయం
► అధినేత దృష్టికి తీసుకెళ్లే యోచన ఒక్కటవుతున్న జిల్లా టీడీపీ నేతలు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీలోకి తాజాగా చేరిన నేతకు మంత్రి పదవి దక్కేందుకు రోజుకో కొత్త అడ్డంకి ఎదురవుతోంది. ఇన్ని రోజులుగా మంత్రి పదవి హామీ ఆయనకు ఇవ్వలేదంటున్న ఆ పార్టీ నేతలు.. తాజాగా ఆయనపై ఉన్న కేసులు అడ్డువచ్చే అవకాశం ఉందనే ప్రచారం మొదలుపెట్టారు. గతంలో ఆయనపై రౌడీషీట్ ఉందని ఆరోపణలు చేసి, ఎమ్మెల్యే పదవికి కూడా అర్హుడు కాదని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. ఇప్పుడు పిలిచి మంత్రి పదవి ఇస్తే పార్టీ పరువు బజారునపడుతుందనే కొత్త వాదనను తెరమీదకు తెస్తున్నారు.
అంతేకాకుండా మంత్రి పదవి ఇస్తే అధికార పార్టీలో చేరితే చాలు అన్ని ఆరోపణలు మాఫీ అవుతాయనే సందేశాన్ని ప్రజల్లోకి పంపినట్టు అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది అంతిమంగా పార్టీకి జిల్లాలో చెడ్డపేరు తెచ్చిపెడుతందనే చర్చకు తావిస్తోంది. ఇదే విషయాన్ని అధినేత దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు.
విమర్శించి.. అందలమెక్కించవచ్చా?
వాస్తవానికి సదరు నేతను విమర్శిస్తూ అధికార పార్టీ నేతలు గతంలో అనేక ఆరోపణలు చేశారు. రౌడీషీటర్ అని.. ఏకంగా ఎర్రచందనం స్మగ్లర్ అని కూడా వ్యాఖ్యానించారు. ఇన్ని కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి ఎమ్మెల్యే పదవికి కూడా అనర్హుడని ఘాటు విమర్శలు చేశారు. ఇప్పుడు అదే నేతలకు ఏకంగా మంత్రి పదవి ఇస్తే ప్రజల్లోకి ఏ ముఖం పెట్టుకుని వెళ్లగలమనే అభిప్రాయం ఆ పార్టీలో వ్యక్తమవుతోంది. ప్రతిపక్షంలో ఉంటే చెడ్డవాడు.. అధికారపార్టీలో చేరితే మంచివాడు అని మనమే సర్టిఫికెట్ ఇచ్చినట్టు అవుతుందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కేవలం ఎమ్మెల్యేగానే ఉంచాలని కోరుతున్నారు.
ఒక్కటవుతున్న నేతలు.. ఒకవైపు కేసుల వ్యవహారంతో పార్టీకి చెడ్డపేరు వస్తుందని చెబుతున్న నేతలు.. మరోవైపు ఎన్నికల ముందు నుంచీ పార్టీలో ఉన్న నేతలు ఏకమవుతున్నారు. తమను కాదని కొత్తగా పార్టీలో చేరిన వారికి మంత్రి పదవి ఇవ్వద్దని ఏకంగా అధినేతను స్వయంగా కలిసి విన్నవించాలని భావిస్తున్నట్టు సమాచారం. అంతేకాకుండా జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే.. అదే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారని, వారిలో ఏ ఒక్కరికి ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని వాదించనున్నట్టు తెలిసింది. మొత్తం మీద మంత్రి పదవి వ్యవహారం కాస్తా జిల్లా రాజకీయాలను రోజుకో మలుపు తిప్పుతోంది.