
స్టేషన్‌ను ముట్టడించిన టీడీపీ కార్యకర్తలు
ఒంగోలు: అధికార పార్టీ ఎమ్మెల్యే సహాయకుడు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం కాగితాలను చూపించాలని ట్రాఫిక్ ఎస్సై అడిగినందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు ఎమ్మెల్యే సైతం స్టేషన్‌కు చేరుకుని పోలీసులపై చిందులు తొక్కారు. వివరాల్లోకి వెళ్తే.. ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వద్ద సహాయకుడిగా పనిచేస్తున్న గోపీచంద్ ఆదివారం ఒంగోలులో ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అద్దంకి బస్టాండ్ వద్ద విధుల్లో ఉన్న ట్రాఫిక్ ఎస్సై మహేష్ ఆపి బండి కాగితాలు చూపించాలని కోరారు. అయితే అతడు కాగితాలు చూపకుండా వాహనాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. అంతేకాకుండా భారీ ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలతో కలసి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
సిబ్బందిని లోపలకు పోనీయకుండా, బయటకు రాకుండా అడ్డుకుని వారి విధులకు ఆటంకం కలిగించారు. కొద్దిసేపటికి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సైతం అక్కడకు చేరుకుని ట్రాఫిక్ ఎస్సై అసభ్యంగా మాట్లాడారని అతన్ని సస్పెండ్ చేయాలంటూ అధికారులను డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే రాకతో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. అప్పటివరకు అక్కడే బైఠాయించిన కార్యకర్తలు పోలీస్‌స్టేషన్ ఆవరణలోకి చొచ్చుకునివెళ్లడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఒంగోలు డీఎస్పీ శ్రీనివాసరావు, ట్రాఫిక్ డీఎస్పీ కృష్ణారెడ్డిలు ఎమ్మెల్యేతో చర్చించారు. ఎస్సై మహేష్ మాత్రం అతను ఎవరో తనకు తెలియదని, తాను అనుచితంగా వ్యవహరించలేదని స్పష్టం చేశారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని ట్రాఫిక్ డీఎస్పీ కృష్ణారెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment