Traffic Police Station
-
Hyderabad: ఇక తెల్లవార్లూ డ్రంక్ అండ్ డ్రైవ్!
హైదరాబాద్: ఇక తెల్లవార్లూ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు సమన్వయంగా రెండు షిఫ్ట్‌లలో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు వేర్వేరు చోట్ల వాహనదారులకు శ్వాస పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రణాళికలు రూపొందించారు. వెస్ట్‌జోన్ పరిధిలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, మధురానగర్, పంజగుట్ట, బోరబండ, ఎస్ఆర్నగర్, మాసబ్‌ట్యాంక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మంగళవారం రాత్రి 10 గంటల నుంచి బుధవారం ఉదయం 4 గంటల వరకు ఎనిమిది చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌పరిధిలో డైమండ్ హౌజ్, ఫిలింనగర్ విజేత సూపర్‌మార్కెట్ వద్ద నిర్వహించిన డ్రంక్ డ్రైవ్‌లో మద్యం తాగి వాహనాలు నడుపుతూ 24 మంది మందుబాబులు పట్టుబడ్డారు. ఎస్ఆర్నగర్ ట్రాఫిక్ పోలీసులు ఎస్ఆర్నగర్ ఐసీఐసీఐ వద్ద రాత్రి 10 నుంచి ఒంటి గంట వరకు, జూబ్లీహిల్స్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వద్ద అర్ధరాత్రి ఒంటిగంట నుంచి ఉదయం 4 గంటల వరకు నిర్వహించిన తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతూ 26 మంది పట్టుబడ్డారు. బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు స్టడీ సర్కిల్, గ్రీన్ బావర్చి వద్ద నిర్వహించిన తనిఖీల్లో 13 మంది పట్టుబడ్డారు. పంజగుట్ట ట్రాఫిక్ పోలీసులు రాత్రి 10 నుంచి ఒంటిగంట వరకు గ్రీన్‌ల్యాండ్స్ వద్ద, బంజారాహిల్స్ పార్క్ హయత్ వద్ద రాత్రి ఒంటిగంట నుంచి ఉదయం 4 గంటల వరకు నిర్వహించిన తనిఖీల్లో 19 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. -
వాకింగ్ చేస్తూ.. గుండెపోటుతో ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి
హైదరాబాద్: మలక్‌పేట ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న మదలంగి సురేష్ (50) వాకింగ్ చేస్తుండగా గుండెపోటుతో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు..ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాకు చెందిన సురేష్ 2000 సంవత్సరం బ్యాచ్ కానిస్టేబుల్. నగరంలోని సంతో‹Ùనగర్ ఈస్ట్‌మారుతినగర్‌లో ఉంటున్నారు. అతనికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. బుధవారం ఉదయం 7 గంటలకు వాకింగ్ చేస్తున్న సురేష్ ఒక్కసారిగా కింద పడిపోయాడు. తోటి వాకర్స్ వెంటనే కంచన్‌బాగ్ డీఆర్డీఓ అపోలో ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్థారించారు. కోవిడ్ నుంచి ఆయన రెండుసార్లు కోలుకున్నారు. విషయం తెలుసుకున్న సౌత్ఈస్ట్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, మలక్‌పేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నాగం చంద్రశేఖర్ ఆసుపత్రిలో మృతదేహాన్ని సందర్శించి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. -
గుండెపోటుతో ట్రాఫిక్ ఎస్ఐ మృతి
కర్నూలు: పట్టణంలోని ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ప్రేమకాంతప్ప ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుతో మరణించారు. గత రాత్రి ఇంట్లో గుండెపోటుకు గురయ్యారని.. ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. ప్రేమకాంతప్ప స్వగ్రామం ఆలూరు మండలంలోని మరకట్టు గ్రామం. సోమవారం ఉదయాన్నే మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. ఆయన మృతి పట్ల డీఎస్పీ శివనారాయణస్వామి, సీఐలు పార్థసారథి, శ్రీనివాస్‌నాయక్, విక్రమసింహా, నరసింహరాజు, ఎస్ఐలు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -
చాంతాడంతా చలానాలు పెండింగ్..మూడు రోజుల్లో రూ. 25 కోట్లు వసూళ్లు
సాక్షి, బనశంకరి: ఈనెల 11 లోపు ట్రాఫిక్ బకాయిలు చెల్లిస్తే 50 శాతం రాయితీ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ఊహించని విధంగా చెల్లింపులు జరుగుతున్నాయి. ఈనెల 3న రాయితీ అమల్లోకి రావడంతో మొదటి రోజే రూ. 5.61 కోట్లు, రెండో రోజు రూ. 6.80 కోట్లు, మూడో రోజు ఆదివారం రూ. 6.31 కోట్లకు పైగా వసూలైంది. సోమవారం కూడా భారీగా జరిమానాలు చెల్లించారు. సాయంత్రానికి మొత్తంగా రూ. 25 కోట్లు వసూలైంది. నగరంలోని ట్రాఫిక్ పోలీస్స్టేషన్లలోనే కాకుండా ఇన్ఫ్యాంట్రీ రోడ్డులోని ట్రాఫిక్ నిర్వహణ కేంద్రంలో కౌంటర్ తెరిచి జరిమానా చెల్లించడానికి అవకాశం కల్పించారు. హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయసేవల ప్రాధికార అధ్యక్షుడు న్యాయమూర్తి బీ.వీరప్ప అధ్యక్షతన గత నెల 27న నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర రవాణాశాఖ అధికారులతో చర్చించి జరిమానా బకాయిలపై రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు. దీనికి రాష్ట్ర రవాణా రోడ్డు భద్రతా కమిషనర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. (చదవండి: వాట్సాప్‌తో ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు) -
బుల్లెట్ బాబులు..పని పట్టిన ట్రాఫిక్ పోలీసులు
-
బేగంపేటలో వింగర్ బీభత్సం
హైదరాబాద్: బేగంపేటలో ఆదివారం ఉదయం టాటా వింగర్ వాహనం బీభత్సం సృష్టించింది. అతి వేగంగా వెళ్లి వాహనాలు, పాదచారుల పైకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఓ హోంగార్డు అక్కడికక్కడే చనిపోగా పలు వురికి గాయాలయ్యాయి. కొన్ని వాహనాలు ధ్వంసమయ్యాయి. తర్వాత ఓ స్తంభాన్ని ఢీకొట్టి వింగర్ ఆగిపోయింది. వింగర్ డ్రైవర్‌కు మూర్ఛ రావడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. మల్కాజిగిరి పరిధిలోని ప్రశాంత్ నగర్ రైల్వే క్వార్టర్స్ ప్రాంతానికి చెందిన సముద్రాల రవికృష్ణ (30) టాటా వింగర్ వాహనం డ్రైవర్. తన వాహనంలో ప్రతిరోజూ ఉప్పల్ నుంచి సికింద్రాబాద్, బేగంపేట మీదుగా హైటెక్ సిటీకి హెచ్డీఎఫ్సీ ఉద్యోగులను తీసుకెళ్తుంటాడు. రోజూలాగానే ఆదివారం ఉదయం 10.30 సమయంలో ఉద్యోగులను తీసుకుని వెళ్తున్నాడు. బేగం పేట ప్రకాశ్‌నగర్ బస్టాప్ వద్దకు రాగానే వాహన వేగం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ముందున్న వాహనాలను ఢీకొట్టుకుంటూ దూసుకెళ్లింది. దీంతో అక్కడి వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చివరకు సమీపంలోని కరెంటు స్తంభాన్ని ఢీకొట్టి వింగర్ నిలిచింది. హోంగార్డు అక్కడికక్కడే మృతి... ఈ ప్రమాదంలో ప్రకాశ్‌నగర్ బస్టాప్ సమీపంలో విధులు నిర్వర్తిస్తున్న బేగంపేట ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ హోంగార్డు ప్రభాకర్ అక్కడికక్కడే మృతిచెందారు. వింగర్ 8 వాహనాలను ఢీకొట్టగా అవి దెబ్బతినడంతో పాటు నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. వింగర్ నడుపుతున్న రవికృష్ణకు ఆ సమయంలో మూర్ఛ వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంలో చనిపోయిన ప్రభాకర్ స్వస్థలం మెదక్ జిల్లా ఝరాసంగం కక్కెరవాడ. మూడేళ్ల నుంచి బేగంపేట పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇంకా పెళ్లి కాలేదు. ఆదివారం కావడంతో రద్దీ పెద్దగా లేదని, పని దినాల్లో ఈ ప్రమాదం జరిగితే నష్టం ఊహించని విధంగా ఉండేది. రవికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. -
పేగులు చొక్కాలో దోపుకుని పరుగులు!
హైదరాబాద్: పోలీసు స్టేషన్‌కు సమీపంలోనే దారుణ హత్య.. బయటపడిన పేగులను చొక్కాలో దోపుకుని.. బాధితుడు రోడ్డుపై పరుగులు తీయడం.. అలా పరిగెత్తి.. పరిగెత్తి పోలీసు స్టేషన్‌కే వచ్చి కుప్పకూలడం.. ఇలాంటివన్నీ మనం సినిమాల్లో చూసుంటాం.. అయితే, బుధవారం హైదరాబాద్‌లోని పంజగుట్టలో జనం అంతా చూస్తుండగా జరిగిన ఈ దృశ్యం కలకలం రేపింది.. పంజగుట్ట ప్రధాన రహదారిపై ఉన్న బడీ మజ్దిద్‌లో నివాసం ఉండే మహ్మద్ అన్వర్ (32), నాగార్జున హిల్స్‌లోని పంజాబ్ పహాడ్ వద్ద నివాసం ఉండే మీర్ రియాసత్‌అలీ సజ్ (35)లు ఆటో డ్రైవర్లు. పంజగుట్ట కూడలివద్ద ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పక్కనే ఉన్న ఆటో స్టాండ్‌లో తమ ఆటోలు నిలుపుతుంటారు. ఇద్దరూ మంచి స్నేహితులని, అయితే, గత కొంతకాలంగా పడటం లేదని, ఇప్పటికే 4సార్లు ఆటో స్టాండ్ వద్ద గొడవపడ్డారని స్థానికులు చెబుతున్నారు. వీరిద్దరి మధ్య గొడవలు తారా స్థాయికి చేరడంతో మహ్మద్ అన్వర్‌ను ఎలాగైనా హత్య చేయాలని మీర్ రియాసత్ అలీ పథకం పన్నాడు.. ముందుగానే తన వెంట ఓ కత్తిని తీసుకువచ్చాడు. బుధవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఆటో స్టాండ్‌లో ఉండగానే వారి మధ్య వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన రియాసత్ వెంటతెచ్చుకున్న కత్తితో అన్వర్‌ను పొడిచాడు. పొడవడమే కాకుండా కత్తి కడుపులోకి దిగిన తర్వాత బలంగా చీల్చడంతో అన్వర్ కడుపులోని పేగులు బయటకు వచ్చాయి. దాంతో బయటపడ్డ పేగులు చొక్కాలో దోపుకున్న అన్వర్ పక్కనే ఉన్న పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌కు పరిగెత్తి గ్రౌండ్‌ఫ్లోర్ లోని రిసెప్షన్ టేబుల్ వద్ద కుప్పకూలిపోయాడు. కత్తితో పోలీసు స్టేషన్‌కు.. నిందితుడు రియాసత్ అలీ అన్వర్‌ను పొడిచిన కత్తి తో పోలీస్‌స్టేషన్‌కు వచ్చాడు. విధుల్లో ఉన్న అడ్మిన్ ఎస్సై శ్రీకాంత్ చేతిలో కత్తి, రక్తం చూసి ఏం జరిగిందని ప్రశ్నించగా, తన భార్యకు, పిల్లలకు హెచ్ఐవీ రక్తం ఎక్కించిన అన్వర్‌ను పొడిచానని చెప్పడంతో అతన్ని లాకప్‌లో వేసి కిందకు దిగాడు. అక్కడ అప్పటికే బాధితుడు కొన ఊపిరితో ఉండటం చూసి గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. భయాందోళన చెందిన వాహనదారులు.. పంజగుట్ట ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పక్కనే ఘటన జరగడం, బాధితుడు తీవ్ర గాయాలు, రక్తంతో పరిగెత్తడం, నిందితుడు కూడా కత్తితో పరుగులు తీయడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర భయాందోళన చెందారు. ఏం జరుగుతోందో తెలియక ఆందోళనకు గురయ్యారు. -
పోలీస్ స్టేషన్‌ను ముట్టడించిన టీడీపీ నేతలు
ఒంగోలు: అధికార పార్టీ ఎమ్మెల్యే సహాయకుడు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం కాగితాలను చూపించాలని ట్రాఫిక్ ఎస్సై అడిగినందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు ఎమ్మెల్యే సైతం స్టేషన్‌కు చేరుకుని పోలీసులపై చిందులు తొక్కారు. వివరాల్లోకి వెళ్తే.. ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వద్ద సహాయకుడిగా పనిచేస్తున్న గోపీచంద్ ఆదివారం ఒంగోలులో ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అద్దంకి బస్టాండ్ వద్ద విధుల్లో ఉన్న ట్రాఫిక్ ఎస్సై మహేష్ ఆపి బండి కాగితాలు చూపించాలని కోరారు. అయితే అతడు కాగితాలు చూపకుండా వాహనాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. అంతేకాకుండా భారీ ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలతో కలసి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిబ్బందిని లోపలకు పోనీయకుండా, బయటకు రాకుండా అడ్డుకుని వారి విధులకు ఆటంకం కలిగించారు. కొద్దిసేపటికి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సైతం అక్కడకు చేరుకుని ట్రాఫిక్ ఎస్సై అసభ్యంగా మాట్లాడారని అతన్ని సస్పెండ్ చేయాలంటూ అధికారులను డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే రాకతో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. అప్పటివరకు అక్కడే బైఠాయించిన కార్యకర్తలు పోలీస్‌స్టేషన్ ఆవరణలోకి చొచ్చుకునివెళ్లడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఒంగోలు డీఎస్పీ శ్రీనివాసరావు, ట్రాఫిక్ డీఎస్పీ కృష్ణారెడ్డిలు ఎమ్మెల్యేతో చర్చించారు. ఎస్సై మహేష్ మాత్రం అతను ఎవరో తనకు తెలియదని, తాను అనుచితంగా వ్యవహరించలేదని స్పష్టం చేశారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని ట్రాఫిక్ డీఎస్పీ కృష్ణారెడ్డి తెలిపారు. -
హెడ్‌కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
సూర్యాపేట క్రైం: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఓ హెడ్‌కానిస్టేబుల్ అందరూ చూస్తుండగానే పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాలు ప్రకారం.. పట్టణానికి చెందిన దామోదర్‌రెడ్డి స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతని పెద్ద కుమారుడు విక్రమ్‌రెడ్డి భార్య సంధ్య కొంతకాలంగా తనను అత్తింటి వారు వేధిస్తున్నారని సూర్యాపేట రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో దామోదర్‌రెడ్డి, అతని భార్య, కుమారుడిపై పోలీసులు కేసు నమోదు చేసి ఈ నెల 14న స్టేషన్‌కు పిలిచారు. ఈ సందర్భంగా ఎస్ఐ వారిపై చేయి చేసుకున్నట్లు బాధితుడి బంధువులు తెలిపారు. ఇదిలా ఉండగానే దామోదర్‌రెడ్డి శుక్రవా రం మధ్యాహ్నం పురుగు మందు తాగడంతో తోటి సిబ్బంది వెంటనే అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించారు. అంతకుముందు ఈ విషయం తెలుసుకున్న ఎస్పీ జాదవ్ ఆస్పత్రిలో దామోదర్‌రెడ్డిని పరామర్శించారు. కాగా, దామోదర్‌రెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సమయంలో జేబులోని సూసైడ్‌నోట్‌ను మాయం చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. -
ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
సాక్షి, సూర్యపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఓ హెడ్‌కానిస్టేబుల్ శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానిక ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో దామెదర్ రెడ్డి అనే వ్యక్తి హెడ్ కానిస్టేబులుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఉదయం పోలీస్ స్టేషన్లోనే అతను పురుగులమందు తాగి ఆత్మహత్యయత్నం చేశాడు. కుమారుడి గృహ హింస కేసు విషయంలో రూరల్ ఎస్సై లవకుమార్ వారం రోజుల క్రితం దామోదర్ రెడ్డి పై చేయి చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే మనస్థాపానికి గురై దామెదర్ ఆత్మహత్య యత్నించినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపడుతున్నారు. -
సిబ్బంది జాస్తి.. సౌకర్యాలు నాస్తి
- అనంత పోలీస్స్టేషన్లలో మౌలిక సదుపాయాలు కరువు - సిబ్బందికే కాదు.. ఎస్ఐలదీ అదే పరిస్థితి - రోడ్డు ప్రమాదానికి గురై చావుబతుకుల మధ్య ఓ ఎస్ఐ ఈ చిత్రంలో కనిపిస్తున్న భవనం అనంతపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్. ఇందులో ఒక డీఎస్పీ, ఆరుగురు ఎస్ఐలు, పదుల సంఖ్యలో ఏఎస్ఐలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు పని చేస్తున్నారు. డీఎస్పీకి, ఓ ఎస్ఐకు మాత్రమే చిన్నపాటి గదులు ఉన్నాయి. మిగిలిన వారు కనీసం కుర్చీ వేసుకునేందుకు కూడా వీల్లేదు. అనేక మంది ఎస్ఐలు అవసరమైనప్పుడు పోలీస్‌స్టేషన్‌కు రావడం, నిలబడే విధులు నిర్వహించి వెళ్లడం పరిపాటిగా మారింది. వాహనాలదీ అదే సమస్య. డీఎస్పీకి ఒక వాహనం, మిగిలిన ఎస్‌ఐలందరికీ మరో వాహనం ఉంది. ఒకరు వాహనం తీసుకుని వెళ్తే మిగిలిన వారు బైక్‌లపై వెళ్లి విధులు నిర్వర్తించాల్సిందే. మిగతా పోలీస్ స్టేషన్లలోనూ అదే పరిస్థితి. ఎస్ఐ స్థాయి అధికారులకే ఇలాంటి పరిస్థితి ఉంటే.. ఇక కానిస్టేబుల్, హోంగార్డుల గురించి చెప్పనక్కర లేదు. అనంతపురం సెంట్రల్ : అనంతుపరం పోలీస్స్టేషన్లలో మౌలిక సదుపాయాలు కరువయ్యాయి. వివిధ సమస్యలపై వచ్చే ప్రజలే కాదు.. అధికారులు, సిబ్బందికీ కనీస సౌకర్యాలు లేవు. ఎస్ఐలకు కూడా కనీస వసతరులు కల్పించకపోవడం విడ్డూరంగా ఉంది. అంతో ఇంతో వన్ టౌన్, త్రీటౌన్ పోలీస్స్టేషన్లు మినహాయిస్తే, మిగిలిన వాటిలో ఎస్ఐలకు చాంబర్లు కూడా లేవంటే అతిశయోక్తి కాదు. నాల్గో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఐదు మంది ఎస్ఐలు ఉన్నారు. ఒకప్పటి సాంఘిక సంక్షేమ వసతి గృహంలో, ప్రస్తుతం పోలీసు స్టేషన్ నిర్వహిస్తున్నారు. ఏమాత్రం సౌకర్యాలు లేకపోయినా నెట్టుకొస్తున్నారు. నూతన భవనం పనులు ప్రారంభమైనా ఎప్పటిలోగా పూర్తి చేస్తారో అంతుబట్టడం లేదు. రూరల్ పోలీస్‌స్టేషన్‌లో మరి దారుణం. పూరతన భవనంలో, ఇరుకు గదిలో ఇద్దరు ఎస్ఐలు పని చేస్తున్నారు. టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఓ షెడ్‌ను ఎస్ఐ శుభ్రం చేసుకొని వాడుకుంటున్నారు. ప్రస్తుతం ఎండలకు అందులో కూర్చునేందుకు కూడా ఇబ్బందిగా మారిందని వాపోతున్నారు. చాంబర్ల కొరతతో పాటు మరుగుదొడ్ల సమస్య కూడా ఎక్కువుగా ఉంది. ఒక్కో స్టేషన్‌కు ఒక్కో మరుగుదొడ్డి మాత్రమే ఉంది. అధికారులు, సిబ్బంది వాటినే వినియోగించుకుంటున్నారు. సమస్యలపై వచ్చే ప్రజలకు మాత్రం ఎక్కడా అనుమతుల్లేవు. దీంతో పరిసరాలను చూసుకోవాల్సి వస్తోంది. -
ఏడాదిన్నరలో రూ.169.86 కోట్లు
⇒ వాహనదారుల నుంచి వసూలు చేసిన జరిమానా సొమ్ము ఇది ⇒ 2015లో రూ.100.90 కోట్లు.. 2016 మే 31 నాటికి రూ.68.95 కోట్లు ⇒ ఈ ఏడాది మొత్తంగా రూ.150 కోట్లకు చేరే అవకాశం ⇒ రోడ్డు ప్రమాదాల నివారణకు డీటీఆర్‌ఎస్ పేరుతో ప్రత్యేక విభాగం ⇒ 50 హైవే ట్రాఫిక్ పోలీస్స్టేషన్ల ఏర్పాటు ⇒ హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వివరణ ⇒ ఇదే తరహాలో వివరాలివ్వాలని ఏపీకి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: మోటారు వాహనాల చట్టం నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు గత ఏడాదిన్నరలో రాష్ట్ర పోలీసులు వాహనదారుల నుంచి ఏకంగా రూ. 169.86 కోట్లు జరిమానాగా వసూలు చేశారు. ఇందులో 2015 సంవత్సరం మొత్తంలో రూ.100.9 కోట్లుకాగా.. ఈ ఏడాది మే 31వ తేదీ నాటికి రూ. 68.9 కోట్లు వసూలు చేశారు. ఈ లెక్కన ఈ ఏడాది జరిమానాల సొమ్ము రూ.150 కోట్లకు చేరే అవకాశముంది. సుమోటోగా విచారణ చేపట్టిన హైకోర్టు ఈ ఏడాది మార్చి 14న జరిగిన ఓ బస్సు ప్రమాదం ఘటనకు సంబంధించి పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. రోడ్డు ప్రమాదాల నివారణకు ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలంటూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఇంతకుముందే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం తరఫున రైల్వేలు, రోడ్డు భద్రత అదనపు డెరైక్టర్ జనరల్ టి.కృష్ణప్రసాద్ రెండు రోజుల కింద ఓ అఫిడవిట్‌ను సమర్పించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు, రోడ్డు భద్రతకు తీసుకుంటున్న చర్యలను అందులో వివరించారు. రాష్ట్రంలోని మొత్తం రహదారుల్లో జాతీయ, రాష్ట్ర రహదారుల పొడవు 22 శాతమని.. అవి 43 శాతం ప్రమాదాలకు, 48 శాతం మరణాలకు కారణమవుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎ.సంజీవ్‌కుమార్ ధర్మాసనానికి వివరించారు. ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయనున్నాం రోడ్డు ప్రమాదాల తీవ్రతను దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం భద్రత, ట్రాఫిక్ ప్రణాళికల నిమిత్తం ప్రత్యేకంగా అదనపు డీజీ స్థాయి అధికారిని నియమించిందని సంజీవ్ కుమార్ కోర్టుకు నివేదించారు. ‘డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ అండ్ రోడ్‌సేఫ్టీ (డీటీఆర్‌ఎస్)’ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలిపారు. జాతీయ రహదారులపై 50 హైవే ట్రాఫిక్ పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. ప్రమాదాల నివారణకు, ట్రాఫిక్ ఉల్లంఘనలపై తీసుకోవాల్సిన చర్యల విషయంలో పోలీస్ కమిషనర్లు, ఎస్పీలకు తగిన సూచనలు, మార్గదర్శకాలు జారీ చేశామని తెలిపారు. హైవేలపై ఆటోలను అనుమతించడం లేదని, దాబాల్లో మద్యం అమ్మకాలను నిషేధించడమే కాక ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. వాహనం నడిపే వ్యక్తి, వెనుక కూర్చొన్న వ్యక్తి ఇద్దరూ హెల్మెట్ ధరించాలన్న నిబంధన కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించామన్నారు. జాతీయ రహదారులపై మద్యం షాపులను తొలగించడంతో పాటు పర్మిట్లు రద్దు చేయాలని ఎక్సైజ్ అధికారులకు లేఖలు రాశామన్నారు. మద్యం తాగి వాహనం నడిపేవారి లెసైన్స్ రద్దు కోసం రవాణాశాఖ అధికారులకు సిఫారసు చేస్తున్నామన్నారు. గత ఏడాదిన్నర కాలంలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై నమోదు చేసిన కేసులు, జరిమానాగా వసూలు చేసిన మొత్తం వివరాలను ధర్మాసనం ముందుం చారు. ఈ మొత్తం వ్యవహారంలో హైకోర్టు తదుపరి ఏ ఆదేశాలు ఇచ్చినా అమలు చేస్తామన్నారు. ఈ వాదనలను పరిశీలించిన ధర్మాసనం... రోడ్డు ప్రమాదాల నివారణ, రోడ్డు భద్రత కోసం ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని ఏపీ సర్కారును ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం తరహాలో పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలంటూ.. విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది. -
ట్రాఫిక్ పీఎస్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ : నాంపల్లి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఎదుట ఓ వ్యక్తి శుక్రవారం ఆత్మహత్యాయత్నం చేశాడు. పెట్రోలు తాగి, బ్లేడుతో కోసుకుని చుట్టుపక్కలవారిని భయభ్రాంతులకు గురిచేశాడు. ఆ వ్యక్తికి మతిస్థిమితం సరిగా లేనట్లు తెలిసింది. చికిత్స నిమిత్తం పోలీసులు108 వాహనంలో సదరు వ్యక్తిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా ఆ వ్యక్తి తన పేరుగానీ ఊరుగానీ చెప్పకపోవడంతో వివరాలు తెలియరాలేదు. -
మెదక్ జిల్లాకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మంజూరు
సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లా రామచంద్రాపురం వద్ద ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈమేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్‌త్రివేది బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వాహనాల రద్దీని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మ సూచన మేరకు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నూతన పోలీసు స్టేషన్‌కు ఒక సీఐ, ఎనిమిది మంది సబ్ఇన్స్పెక్టర్లు, ఆరుగురు హెడ్ కానిస్టేబుళ్లు, 28 మంది కానిస్టేబుళ్ల సిబ్బందిని నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించారు. -
తాగి డ్రైవింగ్ చేస్తూ.. 6 సార్లు పట్టుబడ్డాడు
కాచిగూడ: మద్యం సేవించి బైక్ నడుపుతూ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఆరుసార్లు పట్టుబడిన సైదాబాద్ ప్రాంతానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి బలరామ్‌రాజు (42)కు 3నెలల జైలు శిక్షతో పాటు రూ.2వేల జరిమానాను కోర్టు విధించిందని కాచిగూడ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పిజి రెడ్డి తెలిపారు. 2012నుంచి ఇప్పటి వరకు మీర్‌చౌక్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, సుల్తాన్‌బజార్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, బహదూర్‌పుర ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, మలక్‌పేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, అబిడ్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డారని తెలిపారు. ఇప్పటికే రెండు సార్లు జైలు శిక్ష అనుభవించిన బాలరామ్ రాజు మూడు సార్లు జరిమాన కూడా కట్టారని తెలిపారు. ఇన్నిసార్లు జరిమానాలు, జైలు కెళ్లివచ్చినా అతనిలో ఏమాత్రం మార్పు రాలేదని తెలిపారు. ఇలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పీజీ రెడ్డి తెలిపారు. -
ట్రాఫిక్ చిక్కులకు చెక్
80 వేల ఇళ్లు.. సుమారు 5.20 లక్షల జనాభా... 14 వేల ఆటోలు, అంటే ప్రతి 37 మందికి ఒక ఆటో... ప్రతి ఇంటికీ ఒక ద్విచక్రవాహనం... కార్లు అదనం. వీటికి తోడు ఆర్టీసీ బస్సులు, ప్రైైవేటు వాహనాలు... ఏ చిన్న సందు చూసినా రద్దీ. ప్రధానరోడ్లపై వాహనాలు అడ్డంగా నిలిపి ప్రయాణికులను ఎక్కించుకుంటుంటారు. ఈ ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని ఛేదించుకుని బయటపడాలంటే తలప్రాణం తోకకొస్తుంది. ఇదీ అనంతపురం నగర ట్రాఫిక్ దుస్థితి. అనంతపురం క్రైం : రోజురోజుకూ పెరుగుతున్న జనాభాకు అంతేస్థాయిలో వివిధ రకాల వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. ఫలితంగా ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారుతోంది. నగరంలో రోడ్ల విస్తరణ జరగకపోవడం, ఉన్న రోడ్లను తోపుడుబండ్లు, ఆటోలు ఆక్రమించేయడంతో సమస్య మరింత జఠిలంగా మారుతోంది. దీన్ని పరిశీలించిన జిల్లా పోలీస్ బాస్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగా ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌కు మెన్‌పవర్ పెంచేందుకు చర్యలు తీసుకున్నారు. డీఎస్పీతో పాటు ఏడుగురు ఎస్ఐలు, 9 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 35 మంది కానిస్టేబుళ్లు పని చేస్తున్నారు. కూడళ్లలో ఆటోమేటిక్ సిగ్నల్ లైట్లు ప్రస్తుతం నగరంలోని ప్రతి కూడలిలో కనీసం ఇద్దరు పోలీసులు ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారు. దీనికితోడు ప్రస్తుతం ఉన్న సిగ్నల్ లైట్లు ఒక రోజు పని చేస్తే వారం రోజులు పనిచేయని స్థితిలో ఉన్నాయి. దీంతో ఆటోమేటిక్ సిగ్నల్‌లైట్లు ఏర్పాటుకు పూనుకున్నారు. నడిమివంక, టవర్‌క్లాక్, సప్తగిరి సర్కిల్, శ్రీకంఠం సర్కిల్, సూర్యానగర్ సర్కిల్, తాడిపత్రి బస్టాండ్ వద్ద ఆటోమేటిక్ సిగ్నల్ లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఆటోమేటిక్ లైట్లలో టైమ్స్, సిగ్నల్స్‌తోపాటు సీసీ కెమెరాలు కూడా అమర్చారు. దీంతో సిబ్బంది ఉన్నా, లేకపోయినా సిగ్నల్స్ మేరకు వాహనదారులు వెళ్లాల్సి ఉంటుంది. ఎవరైనా అతిక్రమించినా సీసీ కెమెరాల్లో నమోదవుతాయి. పుటేజీలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. వాటి ఆధారంగా నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటారు. మొబైల్ పార్టీల గస్తీ ట్రాఫిక్ నియంత్రణ చర్యల్లో భాగంగా మొబైల్ పార్టీలు ఏర్పాటు చేశారు. మొత్తం 12 మొబైల్ పార్టీలు ఉన్నాయి. ఉదయం ఆరు , మధ్యాహ్నం ఆరు మొబైల్ పార్టీలు పని చేస్తాయి. మొత్తం మీద ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా మొబైల్ పార్టీలు గస్తీ తిరుగుతూ ట్రాఫిక్‌కు చర్యలు తీసుకుంటుంటారు. -
ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో సిబ్బంది కొరత
విజయనగరం క్రైం : జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో సిబ్బంది తక్కువగా ఉండడంతో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కష్టంగా మారుతోంది. వాహనాలు, జనాభా పెరుగుతుండడంతో ఎప్పటికప్పుడు పట్టణంలో ట్రాఫిక్ స్తంభించిపోతోంది. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాల్సిన పోలీసుల సంఖ్య మాత్రం ఎప్పటికీ పెంచడం లేదు. దీంతో ఉన్న సిబ్బందిపై పని ఒత్తిడి పెరుగుతోంది. 1980లో జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి నేటి వరకు పూర్తి స్థాయి సిబ్బంది ఎప్పుడూ లేరు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో జనాభా రెండున్నర లక్షలకుపైగా ఉన్నారు. కాలనీలు, జంక్షన్లు పెరిగాయి. దీంతో ట్రాఫిక్‌కు క్రమబద్ధీకరించడం పోలీసులకు కత్తిమీద సాములా తయారయ్యింది. ప్రస్తుత పరిస్థితి.. జిల్లా కేంద్రంలో ఉన్న ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌కు రెండున్నర ఏళ్ల కిందట స్థాయి పెంచారు. గతంలో ఎస్సై స్టేషన్ అధికారిగా ఉంటే తర్వాత సీఐని స్టేషన్ అధికారిగా నియమించారు. స్టేషన్ స్థాయి పెంచినప్పటికీ సిబ్బంది మాత్రం పాత ప్యాటరన్ ప్రకారమే ఉన్నారు. ఆ తర్వాత సీఐ స్థానంలో డీఎస్పీని స్టేషన్ హౌస్ అధికారిగా నియమించారు. ప్రస్తుతం డీఎస్పీ, ఇద్దరు ఎస్సైలు, ఆరుగురు ఏఎై స్సెలు, 8 మంది హెచ్‌సీలు, 43 మంది కానిస్టేబుళ్లు ఉండాల్సి ఉండగా కానిస్టేబుళ్లు మాత్రం 31 మంది మాత్రమే ఉన్నారు. పట్టణంలో 20 డబుల్ జంక్షన్లు, 15 సింగిల్ జంక్షన్లు ఉన్నాయి. వీటితోపాటు నూతనంగా కొన్ని జంక్షన్లు ఏర్పాటు చేశారు. కొంతమంది సిబ్బంది రెండు షిఫ్టుల్లో పనిచేయగా, మరికొంతమంది కోర్టు డ్యూటీలకు వెళ్తుండడంతో ఉన్న సిబ్బందికి ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కష్టంగా మారుతోంది. 150 మంది సిబ్బంది అవసరం .. గతంలో కంటే విజయనగరం పట్టణంలో నాలుగు రెట్లు వాహనాలు పెరిగాయి. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలంటే సుమారు 150 మంది వరకు కానిస్టేబుళ్ల అవసరం ఉంది. సిబ్బంది తక్కువగా ఉండడంతో ప్రస్తుతమున్నవారు ఒత్తిడికి గురవుతున్నారు. పట్టణంలో ఏ మూల చిన్న సంఘటన జరిగినా పట్టణం మొత్తం ట్రాఫిక్ స్తంభించిపోతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు సిబ్బందిని పెం చాలని పట్టణ వాసులు కోరుతున్నారు. సిబ్బంది వస్తారు ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌కు అదనంగా సిబ్బంది వస్తారు. ఇటీవల శిక్షణ పూర్తిచేసుకున్న సిబ్బందిలో కొంతమందిని ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌కు వేశారు. వారు ప్రస్తుతం వేరే శిక్షణ పొందుతున్నారు. వారు వస్తే కొంతవరకు సిబ్బంది సమస్య తీరినట్లే. ట్రాఫిక్ నియంత్రణకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం - ఎల్. రాజేశ్వరరావు, ట్రాఫిక్ డీఎస్పీ