ఏడాదిన్నరలో రూ.169.86 కోట్లు
⇒ వాహనదారుల నుంచి వసూలు చేసిన జరిమానా సొమ్ము ఇది
⇒ 2015లో రూ.100.90 కోట్లు.. 2016 మే 31 నాటికి రూ.68.95 కోట్లు
⇒ ఈ ఏడాది మొత్తంగా రూ.150 కోట్లకు చేరే అవకాశం
⇒ రోడ్డు ప్రమాదాల నివారణకు డీటీఆర్‌ఎస్ పేరుతో ప్రత్యేక విభాగం
⇒ 50 హైవే ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ల ఏర్పాటు
⇒ హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వివరణ
⇒ ఇదే తరహాలో వివరాలివ్వాలని ఏపీకి హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: మోటారు వాహనాల చట్టం నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు గత ఏడాదిన్నరలో రాష్ట్ర పోలీసులు వాహనదారుల నుంచి ఏకంగా రూ. 169.86 కోట్లు జరిమానాగా వసూలు చేశారు. ఇందులో 2015 సంవత్సరం మొత్తంలో రూ.100.9 కోట్లుకాగా.. ఈ ఏడాది మే 31వ తేదీ నాటికి రూ. 68.9 కోట్లు వసూలు చేశారు. ఈ లెక్కన ఈ ఏడాది జరిమానాల సొమ్ము రూ.150 కోట్లకు చేరే అవకాశముంది.
సుమోటోగా విచారణ చేపట్టిన హైకోర్టు
ఈ ఏడాది మార్చి 14న జరిగిన ఓ బస్సు ప్రమాదం ఘటనకు సంబంధించి పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. రోడ్డు ప్రమాదాల నివారణకు ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలంటూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఇంతకుముందే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం తరఫున రైల్వేలు, రోడ్డు భద్రత అదనపు డెరైక్టర్ జనరల్ టి.కృష్ణప్రసాద్ రెండు రోజుల కింద ఓ అఫిడవిట్‌ను సమర్పించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు, రోడ్డు భద్రతకు తీసుకుంటున్న చర్యలను అందులో వివరించారు. రాష్ట్రంలోని మొత్తం రహదారుల్లో జాతీయ, రాష్ట్ర రహదారుల పొడవు 22 శాతమని.. అవి 43 శాతం ప్రమాదాలకు, 48 శాతం మరణాలకు కారణమవుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎ.సంజీవ్‌కుమార్ ధర్మాసనానికి వివరించారు.
ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయనున్నాం
రోడ్డు ప్రమాదాల తీవ్రతను దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం భద్రత, ట్రాఫిక్ ప్రణాళికల నిమిత్తం ప్రత్యేకంగా అదనపు డీజీ స్థాయి అధికారిని నియమించిందని సంజీవ్ కుమార్ కోర్టుకు నివేదించారు. ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రాఫిక్ అండ్ రోడ్‌సేఫ్టీ (డీటీఆర్‌ఎస్)’ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలిపారు. జాతీయ రహదారులపై 50 హైవే ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్లను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. ప్రమాదాల నివారణకు, ట్రాఫిక్ ఉల్లంఘనలపై తీసుకోవాల్సిన చర్యల విషయంలో పోలీస్ కమిషనర్లు, ఎస్పీలకు తగిన సూచనలు, మార్గదర్శకాలు జారీ చేశామని తెలిపారు.
హైవేలపై ఆటోలను అనుమతించడం లేదని, దాబాల్లో మద్యం అమ్మకాలను నిషేధించడమే కాక ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. వాహనం నడిపే వ్యక్తి, వెనుక కూర్చొన్న వ్యక్తి ఇద్దరూ హెల్మెట్ ధరించాలన్న నిబంధన కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించామన్నారు. జాతీయ రహదారులపై మద్యం షాపులను తొలగించడంతో పాటు పర్మిట్లు రద్దు చేయాలని ఎక్సైజ్ అధికారులకు లేఖలు రాశామన్నారు. మద్యం తాగి వాహనం నడిపేవారి లెసైన్స్ రద్దు కోసం రవాణాశాఖ అధికారులకు సిఫారసు చేస్తున్నామన్నారు.
గత ఏడాదిన్నర కాలంలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై నమోదు చేసిన కేసులు, జరిమానాగా వసూలు చేసిన మొత్తం వివరాలను ధర్మాసనం ముందుం చారు. ఈ మొత్తం వ్యవహారంలో హైకోర్టు తదుపరి ఏ ఆదేశాలు ఇచ్చినా అమలు చేస్తామన్నారు. ఈ వాదనలను పరిశీలించిన ధర్మాసనం... రోడ్డు ప్రమాదాల నివారణ, రోడ్డు భద్రత కోసం ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని ఏపీ సర్కారును ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం తరహాలో పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలంటూ.. విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది.