ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో సిబ్బంది కొరత | Traffic police station staff shortages | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో సిబ్బంది కొరత

Published Mon, Jan 19 2015 3:56 AM | Last Updated on Sat, Sep 2 2017 7:52 PM

Traffic police station staff shortages

విజయనగరం క్రైం : జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో సిబ్బంది తక్కువగా ఉండడంతో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కష్టంగా మారుతోంది. వాహనాలు, జనాభా పెరుగుతుండడంతో ఎప్పటికప్పుడు పట్టణంలో ట్రాఫిక్ స్తంభించిపోతోంది. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాల్సిన పోలీసుల సంఖ్య మాత్రం ఎప్పటికీ పెంచడం లేదు. దీంతో ఉన్న సిబ్బందిపై పని ఒత్తిడి పెరుగుతోంది. 1980లో జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి నేటి వరకు పూర్తి స్థాయి సిబ్బంది ఎప్పుడూ లేరు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో జనాభా రెండున్నర లక్షలకుపైగా ఉన్నారు. కాలనీలు, జంక్షన్లు పెరిగాయి. దీంతో ట్రాఫిక్‌కు క్రమబద్ధీకరించడం పోలీసులకు కత్తిమీద సాములా తయారయ్యింది.
 
 ప్రస్తుత పరిస్థితి..
 జిల్లా కేంద్రంలో ఉన్న ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌కు రెండున్నర ఏళ్ల కిందట  స్థాయి పెంచారు. గతంలో ఎస్సై  స్టేషన్ అధికారిగా ఉంటే తర్వాత సీఐని స్టేషన్ అధికారిగా నియమించారు. స్టేషన్ స్థాయి పెంచినప్పటికీ సిబ్బంది మాత్రం పాత ప్యాటరన్ ప్రకారమే ఉన్నారు. ఆ తర్వాత సీఐ స్థానంలో డీఎస్పీని స్టేషన్ హౌస్ అధికారిగా నియమించారు. ప్రస్తుతం డీఎస్పీ, ఇద్దరు ఎస్సైలు, ఆరుగురు ఏఎై స్సెలు, 8 మంది హెచ్‌సీలు, 43 మంది కానిస్టేబుళ్లు ఉండాల్సి ఉండగా కానిస్టేబుళ్లు మాత్రం 31 మంది మాత్రమే ఉన్నారు. పట్టణంలో 20 డబుల్ జంక్షన్లు, 15 సింగిల్ జంక్షన్లు ఉన్నాయి. వీటితోపాటు నూతనంగా కొన్ని జంక్షన్లు ఏర్పాటు చేశారు. కొంతమంది సిబ్బంది రెండు షిఫ్టుల్లో పనిచేయగా, మరికొంతమంది కోర్టు డ్యూటీలకు వెళ్తుండడంతో ఉన్న సిబ్బందికి ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కష్టంగా మారుతోంది.  
 
 150 మంది సిబ్బంది అవసరం ..
 గతంలో కంటే విజయనగరం పట్టణంలో నాలుగు రెట్లు వాహనాలు పెరిగాయి.  ట్రాఫిక్‌ను  క్రమబద్ధీకరించాలంటే సుమారు 150 మంది వరకు కానిస్టేబుళ్ల అవసరం ఉంది. సిబ్బంది తక్కువగా ఉండడంతో ప్రస్తుతమున్నవారు ఒత్తిడికి గురవుతున్నారు. పట్టణంలో ఏ మూల చిన్న సంఘటన జరిగినా పట్టణం మొత్తం ట్రాఫిక్ స్తంభించిపోతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు సిబ్బందిని పెం చాలని పట్టణ వాసులు కోరుతున్నారు.
 
 సిబ్బంది వస్తారు
 ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌కు అదనంగా సిబ్బంది వస్తారు. ఇటీవల శిక్షణ పూర్తిచేసుకున్న  సిబ్బందిలో కొంతమందిని ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌కు వేశారు. వారు ప్రస్తుతం వేరే శిక్షణ పొందుతున్నారు. వారు వస్తే కొంతవరకు సిబ్బంది సమస్య తీరినట్లే. ట్రాఫిక్ నియంత్రణకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం
 - ఎల్. రాజేశ్వరరావు,
  ట్రాఫిక్ డీఎస్పీ
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement