హైదరాబాద్: ఇక తెల్లవార్లూ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు సమన్వయంగా రెండు షిఫ్ట్‌లలో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు వేర్వేరు చోట్ల వాహనదారులకు శ్వాస పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రణాళికలు రూపొందించారు. వెస్ట్‌జోన్ పరిధిలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, మధురానగర్, పంజగుట్ట, బోరబండ, ఎస్‌ఆర్‌నగర్, మాసబ్‌ట్యాంక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మంగళవారం రాత్రి 10 గంటల నుంచి బుధవారం ఉదయం 4 గంటల వరకు ఎనిమిది చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు.
జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌పరిధిలో డైమండ్ హౌజ్, ఫిలింనగర్ విజేత సూపర్‌మార్కెట్ వద్ద నిర్వహించిన డ్రంక్ డ్రైవ్‌లో మద్యం తాగి వాహనాలు నడుపుతూ 24 మంది మందుబాబులు పట్టుబడ్డారు. ఎస్‌ఆర్‌నగర్ ట్రాఫిక్ పోలీసులు ఎస్‌ఆర్‌నగర్ ఐసీఐసీఐ వద్ద రాత్రి 10 నుంచి ఒంటి గంట వరకు, జూబ్లీహిల్స్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వద్ద అర్ధరాత్రి ఒంటిగంట నుంచి ఉదయం 4 గంటల వరకు నిర్వహించిన తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతూ 26 మంది పట్టుబడ్డారు.
బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు స్టడీ సర్కిల్, గ్రీన్ బావర్చి వద్ద నిర్వహించిన తనిఖీల్లో 13 మంది పట్టుబడ్డారు. పంజగుట్ట ట్రాఫిక్ పోలీసులు రాత్రి 10 నుంచి ఒంటిగంట వరకు గ్రీన్‌ల్యాండ్స్ వద్ద, బంజారాహిల్స్ పార్క్ హయత్ వద్ద రాత్రి ఒంటిగంట నుంచి ఉదయం 4 గంటల వరకు నిర్వహించిన తనిఖీల్లో 19 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment