ప్రస్తుతానికి విజయనగరం పురమే
కార్పొరేషన్ హోదాను అడ్డుకున్న టీడీపీ నేతలు
అధికార పార్టీ నేతలకు పదవులు పోతాయన్న భయం
నగరపాలక సంస్థ ఉత్తర్వులు తాత్కాలికంగా నిలుపుదల
న్యాయపరమైన అభిప్రాయం వచ్చాక తదుపరి చర్యలు
భలే చాన్సులే..లక్కీ చాన్సులే..అధికారంలో ఉన్న మజా అనుభవించితే తెలియనులే.. పవర్‌లో ఉంటేనే హోదా.. డబ్బు..పలుకుబడి లెక్కలేనంత ఉంటాయి. ఒక్కసారిగా అధికారం పోతే దారిన పోయే దానయ్య కూడా ముఖం తిప్పుకుని పక్కనుంచి వెళ్లిపోతాడని అధికార పార్టీ నేతలు గ్రహించినట్లున్నారు. మున్సిపల్ పాలకవర్గం ఇచ్చిన తీర్మానం ప్రకారం గత ఏడాది డిసెంబర్ 10వ తేదీన విజయనగరం మున్సిపాల్టీని కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాలకవర్గం కూడా తమ హోదా పెరుగుతుందని భావించింది. అయితే పురపాలక సంఘం కార్పొరేషన్‌గా మారాక కొత్తగా పాలకవర్గాన్ని ఎన్నుకోవాల్సి ఉంటుందన్న విషయాన్ని గ్రహించకుండా.. పాలకవర్గం ఏకపక్ష తీర్మానం చేసి కార్పొరేషన్ హోదా కోసం ప్రభుత్వానికి పంపించేసింది. ఎప్పుడైతే కార్పొరేషన్ ఉత్తర్వులొచ్చి, సాంకేతిక కారణాలు తెలిశాయో పాలకవర్గం కంగుతింది.
సాక్షి ప్రతినిధి, విజయనగరం: కార్పొరేషన్‌గా మారితే విజయనగరం దశ తిరగనుందని, పెద్ద ఎత్తున అభివృద్ధికి నోచుకుంటుందని పట్టణ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. కార్పొరేషన్ హోదా వస్తే ముఖ్యంగా కేంద్రప్రభుత్వం నుంచి వివిధ గ్రాంట్లు మంజూరవుతాయి. ఆర్థిక సంఘం నిధులు పెద్ద ఎత్తున వస్తాయి. నగర పాలక సంస్థ కమిషనర్ హోదాలో కౌన్సిల్ ఆమోదం లేకుండా రూ. 10లక్షల వరకు అభివృద్ధి పనుల కోసం నేరుగా ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంటుంది. స్టాండింగ్ కమిటీల ద్వారా రూ. 50లక్షల వరకు అభివృద్ధి పనులకు ఖర్చు చేయడానికి వెసులుబాటు ఉంటుంది. నగరపాలక సంస్థలో పోస్టులు కూడా పెరుగుతాయి. అధికార వికేంద్రీకరణ జరుగుతుంది. ప్రతి విభాగానికి సూపరింటెండెంట్ స్థాయి పోస్టులొస్తాయి. త్వరితగతిన నిర్ణయా లు తీసుకుని, ప్రజలకు సేవలు అందించేందుకు అవకాశం వస్తుంది.
ఎన్నికల భయంతో యూటర్న్
కార్పొరేషన్ హోదా ఇచ్చాక అందుకు తగ్గ పాలకవర్గాన్ని ఎన్నుకోవాలనే సరికి ప్రస్తుత పాలకులకు భయం పట్టుకుంది. పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, అసంతృప్తి నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తే గెలవలేమన్న అభద్రతాభావానికి లోనయ్యారు. పదవులు అప్‌గ్రేడ్ అయితేనే కార్పొరేషన్ గా కొనసాగించాలని, లేదంటే మున్సిపాల్టీగానే ఉంచేయాలని పైరవీలు ప్రారంభించారు. మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ, వైస్‌చైర్మన్ కనకల మురళి, తదితరులు కొందరు ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని మరీ ప్రభుత్వంపై ఒత్తిడికి దిగారు. ఆ మంత్రిత్వ శాఖలో పైరవీలు కూడా చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. అలాగే సీఎంను సైతం కలిసి తమ పరిస్థితిని ఏకరువు పెట్టారు.
కార్పొరేషన్ ఉత్తర్వుల్ని నిలుపుదల
పాలకవర్గం ఒత్తిళ్ల నేపథ్యంతో పాటు ఎన్నికలు నిర్వహిస్తే పరువు పోతుందన్న భయంతో ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గింది. సుదీర్ఘ సంప్రదింపుల తర్వాత కార్పొరేషన్ ఉత్తర్వులను నిలుపుదల చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.న్యాయపరమైన అభిప్రాయం వచ్చే వరకు హోదాను అబేయన్స్‌లో పెడుతున్నట్టుగా ప్రభుత్వం సమర్థించుకుంటోంది. మొత్తానికి పట్టణ ప్రగతికి దోహదపడే కార్పొరేషన్ హోదాకు అధికార పార్టీ నేతలే తూట్లు పొడిచారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అబేయన్స్‌లో కార్పొరేషన్ ఉత్తర్వులు
సాంకేతిక కారణాల దృష్ట్యా విజయనగరం పురపాలక సంఘానికి ఇచ్చిన కార్పొరేషన్ హోదాను అబేయన్స్‌లో పెట్టాం. న్యాయప రమైన అభిప్రాయం వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటాం. అంతవరకు పురపాలక సంఘంగానే కొనసాగనుంది. - కె.కన్నబాబు, మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ శాఖ డెరైక్టర్
అధికారమే పరమావధి
Published Sat, Feb 13 2016 11:54 PM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM
Advertisement
Advertisement