అంతర్యుద్ధం
► అధికార పార్టీలో ఆ నలుగురు ఎమ్మెల్యేలదే హవా
► అన్ని నియోజకవర్గాల్లో సమాంతర వ్యవస్థ
► క్లబ్బులు, అక్రమ మైనింగ్, భూ ఆక్రమణలు
► పోలీస్ శాఖపై ఓ సీనియర్ ఎమ్మెల్యే పెత్తనం
► చిన‘బాబు’ అండతో దందాలు, దౌర్జన్యాలు
► గుర్రుమంటున్న మిగిలిన ఎమ్మెల్యేలు, మంత్రులు
అంతటా ఆ నలుగురే... ఎక్కడ విన్నా వారి పేరే... ఏ పంచాయితీ అయినా వారే...జిల్లాలో మంత్రులు, ముఖ్యనేతల కంటే వారి హవానే ఎక్కువ... దందాలు...దౌర్జన్యాలు..పేకాటక్లబ్బులు... కోడిపందేలు..అక్రమ మైనింగ్...ఇసుక తవ్వకాలు.. ఉన్నతాధికారుల బదిలీలు... ఏవైనా సరే...వారి కనుసన్నలలోనే సాగాలి... జిల్లాలోని పల్నాడు ప్రాంతానికి చెందిన ఓ ఎమ్మెల్యే, డెల్టాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, రాజధాని ప్రాంతానికి చెందిన మరో ఎమ్మెల్యే ఆగడాలపై అధికార పార్టీ నేతల్లో సీరియస్‌గా చర్చ సాగుతోంది. చిన‘బాబు’ అండతోనే ఆగడాలకు అంతులేకుండా పోతోందని పలువురు టీడీపీ నేతలు అంటున్నారు. - సాక్షి, గుంటూరు
సాక్షి, గుంటూరు : జిల్లాలో మొదటి నుంచీ చిన‘బాబు’ వర్గంగా పేరొందిన ఆ నలుగురు ఎమ్మెల్యేల హవా తట్టుకోలేక మంత్రులు, ముఖ్యనేతలు, మిగతా ఎమ్మెల్యేలు, ఎంపీలు తీవ్రంగా మదనపడుతున్నారు. తమకు తెలియకుండానే అనేక పనులు నేరుగా వారే చేసుకుంటున్నారని వాపోతున్నారు. అధికారుల అండదండలతోనే ఆ ఎమ్మెల్యేలు తమ పనులు చక్కబెట్టుకుంటున్నారని అంటున్నారు. ఇలాయితే ఇక తామెం దుకని ప్రశ్నిస్తున్నారు. వారికి ఏ విధం గా సహకరిస్తున్నారంటూ జిల్లా స్థాయి అధికారులపై కొందరు మంత్రులు, ఎంపీలు, నేతలు విరుచుకుపడిన సం దర్భాలు అనేకం ఉన్నాయి. జిల్లాలో అనేక ముఖ్య నామినేటెడ్ పదవులు సైతం భర్తీ చేయకపోవడానికి నేతల మధ్య అంతర్గత విభేదాలే ప్రధాన కా రణంగా చెబుతున్నారు. వాటిని సైతం చిన‘బాబు’ ద్వారా భర్తీ చేయించేం దుకు ఆ వర్గం ఎమ్మెల్యేలు ప్రయత్నాలు సాగిస్తున్నారని సమాచారం.
నియోజకవర్గాలపై ఆధిపత్యం....
ఆ నలుగురు అన్ని నియోజకవర్గాలపై ఆధిపత్యం చెలాయిస్తూ సమాంతర వ్యవస్థ నడుపుతున్నారు. పేకాట క్లబ్బులు, కోడి పందేలు, అక్రమ మైనింగ్, ఇసుక దందాలు, భూ ఆక్రమణలు ఇలా అన్ని వ్యవహారాల్లోనూ తలదూరుస్తున్నారు. జిల్లా అధికార యంత్రాంగంసైతం వీరు చెప్పినట్లుగా చేసేస్తారు.. జిల్లా స్థాయి అధికారులను బదిలీ చేయించాలన్నా, వారికి నచ్చినవారికి పోస్టింగ్‌లు ఇప్పించాలన్నా చిటికెలో పని. మంత్రులను సైతం లెక్కచేయకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని సొంత పార్టీనేతలే గుసగుసలాడుతున్నారు.
పోలీసుశాఖపై పెత్తనం.....
ఆ నలుగురిలో ఇద్దరు ఎమ్మెల్యేలు మంత్రి పదవి ఆశించి భంగపడిన వారే. చివరకు తమకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ చిన‘బాబు’ను కోరడంతో ఆయన తన ఆశీస్సులు అందజేశారని అంటున్నారు. దీంతో జిల్లా పోలీసు శాఖలో ఓ సీనియర్ ఎమ్మెల్యే పెత్తనం బాగా కొనసాగుతోంది. ఇందుకు కారణం పోలీసు ఉన్నతాధికారులకు చిన‘బాబు’తో చెప్పించుకోవడమేనని తెలుస్తోంది. జిల్లాలోని ఏ నియోజకవర్గంలో సీఐ పోస్టింగ్ పడాలన్నా ఆయన్ను కలిస్తే పనవుతుందనే విషయం బహిరంగమైంది. దీంతో అధికార పార్టీకి చెందిన మిగతా ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యనేతల వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు.
రాజధాని పరిధిలో ఉన్న ఓ ఎమ్మెల్యే జిల్లాలో ఉన్న అసైన్డ్ భూములు, లిటిగేషన్ భూముల జాబితాను సేకరించి భారీ స్థాయిలో వాటిని కాజేసిన వైనంపైనా అధికార పక్ష సభ్యులు పెదవి విరుస్తున్నారు. డెల్టా ప్రాంతానికి చెందిన ఓ ఎమ్మెల్యే కృష్ణానది పరివాహక ప్రాంతంలో అక్రమంగా ఇసుక తవ్వుతూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారు.