ఇప్పటికే ప్రైవేట్ వాళ్లకు రీచ్‌లు అప్పగించిన సర్కారు
పైకి మాత్రం ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్న సీఎం చంద్రబాబు
షార్ట్ టెండర్లంటూ 70కిపైగా రీచ్‌లను సొంత వాళ్లకు కట్టబెట్టిన వైనం
ఆగమేఘాలపై వర్షాకాలంలోనే కాంట్రాక్టులు ఇచ్చేసిన ప్రభుత్వం
గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలకు విరుద్ధంగా చాలా రీచ్‌ల్లో తవ్వకాలు ప్రారంభం
దాన్ని కప్పిపుచ్చేందుకే ప్రతిపాదనలంటూ సరికొత్త నాటకం
సాక్షి, అమరావతి: ఇసుక ఉచితం అంటూనే డబ్బు వసూలు చేస్తూ జనాన్ని మోసం చేస్తున్న టీడీపీ ప్రభుత్వం తాజాగా ప్రైవేటు ఏజెన్సీలకు ఇసుక తవ్వకాలు అప్పగించే విషయంలోనూ నాటకాలకు తెరలేపింది. ప్రైవేటు వ్యక్తులకు ఇసుక తవ్వకాలను అప్పగించే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు సోమవారం జరిగిన గనుల శాఖ సమీక్షలో సూచించారు. కానీ ఇప్పటికే 80కిపైగా ఇసుక రీచ్‌లను ప్రైవేటు ఏజెన్సీల ముసుగులో తమ పార్టీ మద్దతుదారులకు కట్టబెట్టేశారు.
రాష్ట్రంలోని 108 ఇసుక రీచ్‌లను దసరా పండుగ సమయంలో ప్రైవేటు వారికి అప్పగించేందుకు గుట్టుచప్పుడు కాకుండా జిల్లాలవారీగా ఇసుక కమిటీ ద్వారా షార్ట్ టెండర్లు పిలిచారు. టెండర్లు దాఖలు చేయడానికి కేవలం రెండు రోజులే సమయం ఇచ్చి, తమ పార్టీకి చెందిన వారు, తమకు అనుకూలమైన వారికే ఇసుక కాంట్రాక్టులు అప్పగించేలా జిల్లా కలెక్టర్ల ద్వారా టెండర్ల ప్రక్రియ నిర్వహించారు.
ఆఖరి నిమిషంలో తెలుసుకుని టెండర్లు దాఖలు చేయడానికి వచ్చిన వారిని టీడీపీ ఎమ్మెల్యేల అనుచరులు బెదిరించి వెనక్కు పంపారు. దాదాపు 80 రీచ్‌లను ఎమ్మెల్యేలకు చెప్పిన వారికి అప్పగించేయగా, మిగిలిన రీచ్‌లకు సైతం అనుకూలమైన వారిని ఖరారు చేశారు. అప్పగించిన రీచ్‌ల్లో ఈ నెల 16వ తేదీ నుంచే ఇసుక తవ్వకాలు ప్రారంభమయ్యాయి. మొత్తం 108 రీచ్‌ల్లో ఈ నెలాఖరు నుంచి ఇసుక తవ్వకాలు ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
ఉల్లంఘనలు కప్పిపుచ్చేందుకే..
ప్రైవేటు వారికి అప్పగించే టెండర్ల ప్రక్రియను సజావుగా నిర్వహించేలా ప్రతిపాదనలు తయారు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు చెప్పడం ఉల్లంఘనలను కప్పిపుచ్చేందుకేనని స్పష్టమవుతోంది. మరో వైపు ఇసుక వ్యవహారంలో ఎమ్మెల్యేలు ఎవరూ జోక్యం చేసుకోవద్దని కూడా సూక్తులు చెబుతున్నారు. ఇప్పటికే కాంట్రాక్టులు అయిన వారికి కట్టబెట్టేసి, వాటిల్లో తవ్వకాలు కూడా మొదలు పెట్టి.. బయటకు మాత్రం అందుకు విరుద్ధంగా మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.
ఇప్పుడు ఇదే విషయంపై రాష్ట్రంలో చర్చ నడుస్తోంది. ఇసుక రీచ్‌లను ప్రైవేటు వారికి అప్పగించే విషయం ఇంకా చర్చల దశలో ఉందని సీఎం చెబుతుండటం చూస్తుంటే, గ్రీన్ ట్రిబ్యునల్‌ను తప్పుదోవ పట్టించేందుకేనని తెలుస్తోంది. వర్షాకాలం సీజన్‌లో ఇసుక రీచ్‌లలో తవ్వకాలు చేపట్టకూడదు. సాధారణంగా నవంబర్ నెలాఖరు వరకు రీచ్‌లు ప్రారంభించకూడదు. కానీ అక్టోబర్ 7వ తేదీనే పలు జిల్లాల్లో టెండర్లు పిలిచి కాంట్రాక్టులను ఖరారు చేశారు.
16వ తేదీ నుంచి తవ్వకాలు కూడా ప్రారంభించారు. కానీ ఇదంతా గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలకు విరుద్ధం కావడంతో, పైకి మాత్రం ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించే విషయాన్ని ఇంకా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. ఒకపక్క రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు సాగించి అడ్డగోలుగా అమ్ముకుంటూ.. పైకి మాత్రం అదేమీ లేదనేలా సీఎం స్థాయి వ్యక్తి నమ్మబలుకుతుండడం విస్తుగొలుపుతోంది. రీచ్‌లు ఇంకా ప్రారంభం కాలేదని చిత్రీకరించే క్రమంలోనే సీఎం ఇలా మాట్లాడుతున్నారని తేటతెల్లమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment