కీలక సూత్రధారి శరత్‌చంద్ర
♦ పోలీసులకు లొంగిపోయిన బెట్టింగ్ సూత్రధారి
♦ నెలన్నరపాటు సింగపూర్‌లో మకాం
♦ అధికార పార్టీ అండతో తప్పించుకునేందుకు విఫలయత్నం
♦ ఇంకా అజ్ఞాతంలోనే శరత్‌చంద్ర కుమారుడు సుభాష్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో కీలక సూత్రధారిగా ఉన్న టీడీపీ నేత, మాజీ కౌన్సిలర్ దువ్వూరి శరత్‌చంద్ర అలియాస్ చరను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. బెట్టింగ్ కేసు వెలుగులోకి వచ్చిన వెంటనే విదేశాలకు పరారైన చర, టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకుడు బాలకృష్ణనాయుడు సోమవారం పోలీసులకు లొంగిపోయారు. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న చర కుమారుడు సుభాష్ మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు. అతడు కూడా దొరికితే బెట్టింగ్ కేసు దాదాపు ముగింపు దశకు వస్తుంది.
సీఎం పేషీ స్థాయిలో పైరవీలు
రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా జిల్లా పోలీసులు క్రికెట్ బెట్టింగ్ రాకెట్‌పై దృష్టిపెట్టి కీలక వ్యక్తులతోపాటు పంటర్లనూ కలుగుల్లోంచి బయటకు లాగారు. మొక్కుబడి అరెస్ట్‌లకు పరిమితం కాకుండా మూలాలను గుర్తించి 300 మంది బుకీలు, పంటర్లను అరెస్ట్ చేశారు. వీరిలో ప్రధాన బుకీలుగా ఉన్న 40 మందికిపైగా నిందితులపై నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచీ టీడీపీ మాజీ కౌన్సిలర్, జిల్లా మంత్రికి సన్నిహితుడు అయిన దువ్వూరు శరత్‌చంద్ర పలాయన మంత్రం జపిం చాడు. అధికార పార్టీ నేత కావడం, మంత్రి అండదండలు ఉండటంతో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు సీఎం క్యాంపు కార్యాలయ స్థాయి నుంచి ఎమ్మెల్యేల వరకు అందరి ద్వారా పోలీసులపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చాడు. అయినా ప్రయోజనం లేకపోవడంతో దేశం విడిచి పారి పోయాడు. తన కుమారుడు సుభాష్‌తో కలిసి సింగపూర్‌లో చక్కర్లు కొట్టాడు. అతడి ప్రయత్నాలేవి ఫలించకపోవడంతో సోమవారం ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.
తండ్రీ కొడుకులే కీలకం
జిల్లాలో బెట్టింగ్ రాకెట్‌పై పోలీసులు సీరియస్‌గా దృష్టి సారించడానికి చర, అతని కుమారుడు సుభాష్ సాగించిన వ్యవహారాలే కారణమని తెలుస్తోంది. ఈ ఏడాది జూన్ చివరి వారంలో నగరానికి చెందిన దారం మల్లికార్జునరావు తన కుటుంబ సభ్యులతో కలిసి రామేశ్వరం వెళ్లి బలవన్మరణానికి పాల్పడ్డారు. మల్లికార్జునరావు, అతని భార్య మాధురి, కుమారుడు ప్రణవ్ జూలై 1న రామేశ్వరంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. మల్లికార్జునరావు టీడీపీ నేత దువ్వూరు శరత్‌చంద్ర, అతని కుమారుడు సుభాష్ వద్ద పలు మ్యాచ్‌లపై బెట్టింగ్‌లు కట్టాడు. ఆస్తిపాస్తులన్నీ ధారబోసినా ఇంకా లక్షలాది రూపాయలు బకాయి పడ్డాడు. దీంతో శరత్‌చంద్ర, అతని కుమారుడు కలిసి మల్లికార్జునరావును మానసికంగా వేధించడంతోపాటు అతడి ఇంటికెళ్లి బకాయిల కోసం తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు.
ఈ నేపథ్యంలోనే అతని కుటుంబమంతా అసువులు తీసుకుంది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. దీనిపై పోలీసులు ప్రాథమికంగా విచారణ నిర్వహించారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ బెట్టింగ్ మూలాల్లోకి వెళ్లారు. వందల మందిని అరెస్ట్ చేశారు. దీంతో టీడీపీ నేత శరత్‌చంద్ర, అతని కుమారుడు సుభాష్, బాలకృష్ణనాయుడు జూలై రెండో వారం నుంచి పరారీలో ఉన్నారు. కేసు నుంచి తప్పించుకునేందుకు అధికార పార్టీ నేతల ద్వారా వివిధ రూపాల్లో పోలీసులపై ఒత్తిడి తెచ్చినప్పటికీ చివరకు లొంగిపోక తప్పలేదు.
హైకోర్టులో బెయిల్ పిటీషన్!
నెల్లూరు (క్రైమ్): బెట్టింగ్ కేసులో రిమాండ్ అనుభవిస్తున్న కీలక సూత్రధారి దేవళ్ల కృష్ణసింగ్, మరికొందరు నిందితులు హైకోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేసినట్లు సమాచారం. ఇప్పటికే జిల్లా కోర్టులో పలు దఫాలుగా బెయిల్ పిటీషన్ వేయగా.. కోర్టు నిరాకరించింది. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. వీటిని మంగళవారం విచారించే అవకాశం ఉందని సమాచారం.