‘లక్ష్మణ’ గీత దాటిన సంగీత! | model sangeeta chatterjee sent to jail | Sakshi
Sakshi News home page

‘లక్ష్మణ’ గీత దాటిన సంగీత!

Published Fri, Mar 31 2017 2:44 AM | Last Updated on Tue, Sep 5 2017 7:30 AM

‘లక్ష్మణ’ గీత దాటిన సంగీత!

‘లక్ష్మణ’ గీత దాటిన సంగీత!

పోలీసుల ముప్పు ఉందని సంగీతకు భర్త లక్ష్మణ్‌ హెచ్చరిక
పగలు పేయింగ్‌ గెస్ట్‌.. రాత్రులు పబ్‌
పబ్బుల్లో మన పోలీసులకు తప్పని చిందులు
మూడుసార్లు విఫలం.. ఆపై విజయం


చిత్తూరు (అర్బన్‌): ఎర్రచందనం కేసులో పీడీ యాక్టుపై జైల్లో ఉన్న సంగీత చటర్జీ భర్త మార్కొండ లక్ష్మణ్‌ గత నెల బెయిలుపై విడుదలయ్యాడు. అప్పటికే అజ్ఞాతంలో ఉన్న సంగీతను లక్ష్మణ్‌ హెచ్చరించాడు. ఎక్కడపడితే అక్కడ తిరగొద్దని, ఓకేచోట ఎక్కువ రోజులు గడపొద్దని, చుట్టు పక్కల ఎవరైనా రెక్కీ నిర్వహిస్తున్నారో చూసుకోమని సంగీతకు ఫోన్‌లో సూచిం చాడు. మదనపల్లె సబ్‌ జైలులో ఉన్న లక్ష్మణ్‌ తన స్నేహితుడి ద్వారా నెలకు సంగీతకు రూ.లక్ష నగదు అందజేస్తూ, ఆమె పోలీసుల దొరకకుండా ఎప్పటి కప్పుడు సలహాలు ఇస్తుండే వాడు. భర్త మాటల్లో కొన్నింటిని పాటించిన సంగీత ప్రధాన హెచ్చరికలను పెడచెవిన పెట్టింది.. పోలీసులకు చిక్కింది.

మూడుసార్లు విఫలం
సంగీతను పట్టుకోవడానికి చిత్తూ రు పోలీసులు దాదాపు ఏడాదిన్నకాలం గా ప్రయత్నిస్తున్నారు. గత ఏడాది ఏప్రిల్‌ నెలలో సంగీతను అరెస్టు చేయడానికి కోల్‌కతాకు వెళ్లిన పోలీసులకు ఆమె ఆచూకీ కనుక్కోవడానికే సరిపోయింది. మే 3వ తేదీన మరోమారు కోల్‌కతాకు వెళ్లిన పోలీసులు సంగీతను అదుపులోకి తీసుకున్నారు. కోల్‌కతాలోని న్యాయస్థానంలో హాజరుపరచి చిత్తూరుకు తీసుకురావాలనుకున్నా ఆమె నటనతో పోలీసు ల వ్యూహం బెడిసికొట్టింది. ఇక మూడోసారి 2016 అక్టోబర్‌లో మరోమారు సంగీతను పట్టుకోవడానికి పోలీసులు కోల్‌కతా వెళ్లారు. నాలుగురోజుల పాటు పలు ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ కనుక్కోలేకపోయారు.

ఈసారి సఫలం
గతం నేర్పిన అనుభవాల రీత్యా ఈసారి సంగీత కోసం పోలీసులు వెతుకుతూ కోల్‌కతాకు వెళ్లినట్లు ఎక్కడా సమాచారం బయటకు పొక్కకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి సంగీత పేయింగ్‌ గెస్ట్‌ (పీజీ)గా పలుచోట్ల నెలకు రూ.12 వేల అద్దె చెల్లించి సాధారణ మహిళగా ఉంటోం దని సమాచారం అందడంతో మార్చి 23న డీఎస్పీ, సీఐ, మహిళా ఎస్‌ఐతో పాటు ముగ్గురు సిబ్బంది కోల్‌కతాకు వెళ్లారు. అక్కడి కస్బా, రూబ్, సీఎన్‌ రాయ్‌ ప్రాంతాల్లో సంగీత తిరుగుతున్నట్లు సమాచారం అందినా 25 వరకు ఆచూకీ దొరకలేదు. నిరుత్సాహంతో ఉన్న పోలీసులకు ఓ సమాచారం అందింది.  సోమవారం రూబ్‌ సెల్లార్‌లోని పబ్‌లో సంగీత ఉందని తెలిసింది. డీఎస్పీ గిరిధర్, సీఐ ఆదినారాయణ, ఎస్‌ఐ వాసంతి, మరో మహిళా కానిస్టే బుల్‌ జంటలుగా నటిస్తూ పబ్‌లోకి వెళ్లారు. అక్కడ సంగీతను చూశారు. నిర్ధారించుకోవడానికి కాలు కదుపుతూ చిందులేస్తూ దగ్గరకు వెళ్లి చూశారు. అవును.. అక్కడ సంగీత ఉందని నిర్ధారించుకున్నారు. అప్పటికే సమయం రాత్రి 2.30 గంటలు. అక్కడి నుంచి సంగీత నేరుగా సీఎన్‌ రాయ్‌ రోడ్డులోని పీజీ హాస్టల్‌ చేరుకుంది. పోలీసులు çసమీపంలో ఓ గది అద్దెకు తీసుకుని నిఘా ఉంచారు.

మంగళవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో సంగీత మందులు తీసుకోవడానికి గది నుంచి బయటకొచ్చింది. ఒక్కసారిగా పోలీసులు ఆమెను చుట్టుముట్టారు. మర్యాదగా తమతో రావాలన్నారు. వాంతులు వస్తున్నట్లు.. కళ్లు తిరుగుతున్నట్లు సంగీత నటించినా పోలీసులు లెక్క చేయలేదు. నిమిషాల వ్యవధిలో ఆమెను కస్బా పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి తమ వద్ద ఉన్న అరెస్టు వారెంట్లను చూపించారు. ఆ వెంటనే కోల్‌కతా విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి విమానంలో బెంగళూరు రావడం.. అటు నుంచి చిత్తూరుకు తీసుకురావడం చకచకా జరిగిపోయింది.

పోలీసు కస్టడీకి సంగీత
చిత్తూరు జిల్లా జైలులో ఉన్న సంగీత చటర్జీని కస్టడీకి ఇస్తూ పాకాల న్యాయస్థానం గురువారం ఆదేశాలు జారీచేసింది. సంగీతను తమ కస్టడికిస్తే ఆమెను విచారించి పలువురు నిందితుల పేర్లను తెలుసుకోవచ్చునని చిత్తూరు పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. పది రోజుల పాటు సంగీతను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. అయితే నాలుగు రోజులపాటు కస్టడీకి అనుమతిస్తూ న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. దీంతో పోలీసులు సంగీతను శుక్రవారం కస్టడీకి తీసుకునే అవకాశముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement