Sangeetha Chatterjee
-
రెక్కలు తెగిన రంగుల చిలక..!
-
రెక్కలు తెగిన రంగుల చిలక..!
- స్వేచ్ఛాప్రపంచం నుంచి జైలుకు - బందీ జీవితంపై విరక్తి - బెయిల్ రాక మనోవేదన - రెడ్‘క్వీన్’ సంగీత ఛటర్జి ఆత్మహత్యకు ప్రయత్నం - ఉలిక్కిపడిన కారాగార వర్గాలు ఇరవై ఏళ్లకే మోడల్‌గా ర్యాంప్‌పై క్యాట్ వాక్. ఒంపు సొంపుల వయ్యారం.. ఆపై విమానంలో విహారం. ఎయిర్‌హోస్టెస్‌గా నవ్వులొలికే ఉద్యోగం. ఒక్కసారిగా జీవితంలో కుదుపు. అదే ఆమె ఊహించని మలుపు. జైలు జీవితం.. చివరకు ఆత్మహత్యాయత్నం. రెండేళ్లుగా నిత్యం వార్తల్లో ఉన్న సంగీత చటర్జీ గురువారం జైల్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిపాలయ్యారు. సాక్షి, చిత్తూరు: ఎర్రక్వీన్ సంగీత చటర్జీ జైలు జీవితం అనుభవించలేక గురువారం చిత్తూరు జైల్లో బలవన్మరణానికి పాల్పడ్డారు. కోల్‌కతాకు చెందిన సంగీత చటర్జీ 20 ఏళ్లకే మోడల్‌గా రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఇదే తరుణంలో ఎయిర్ హోస్టెస్ ఉద్యోగం దొరికింది. ఇక జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదనుకుంటుండగా చెన్నైకు చెందిన మార్కొండ లక్ష్మణ్‌తో పరిచయం ఆమె జీవితాన్ని అనుకోని మలుపుతిప్పింది. శేషాచలం అడవుల్లోని ఎర్రచందనం దుంగలను మలేషియా, దుబాయ్, చైనా ప్రాంతాలకు స్మగ్లింగ్ చేసే లక్ష్మణ్‌పై జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో 15 వరకు కేసులున్నాయి. అప్పటికే పెళ్లయిన లక్ష్మణ్ 2013లో సంగీతను రెండో పెళ్లి చేసుకున్నాడు. మరుసటి ఏడాదే ఇతను చిత్తూరు పోలీసులకు చిక్కడంతో పీడీ యాక్టు కింద అరెస్టు చేశారు. భర్త జైల్లో ఉన్న సమయంలో ఎర్రచందనం సామ్రాజ్యాన్ని సంగీత తన చేతుల్లోకి తీసుకుంది. స్మగ్లింగ్‌కు హవాలా రూపంలో డబ్బులు సమకూర్చడం, సరుకును అనుకున్న సమయానికి విదేశాలకు తరలించడంతో కొత్త గుర్తింపు తెచ్చుకుంది. రెండేళ్లు పోలీసుల కన్నుగప్పి సంగీతను పట్టుకోవడానికి రెండేళ్లుగా జిల్లా పోలీసులు పడరాని పాట్లు పడ్డారు. గతేడాది ఎట్టకేలకు సంగీతను కోల్‌కతాలో అరెస్టు చేసినా.. చిత్తూరుకు తీసుకురాలేకపోయారు. ఆమె లాకర్లలో ఉన్న 2.5 కిలోల బంగారు ఆభరణాలు, రూ.10 లక్షల నగదు, రూ.60 లక్షల విలువచేసే ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత ఆమెను ఈ ఏడాది మార్చి 29న కోల్‌కతాలో అరెస్టు చేసి చిత్తూరుకు తరలించారు. జిల్లాలోని కల్లూరు, యాదమరి, నిండ్ర పోలీస్ స్టేషన్లలో ఆమెపై కేసులుండగా కల్లూరు, యాదమరి కేసుల్లో సంగీతకు బెయిల్ మంజూరైయింది. నిండ్ర కేసులో బెయిల్ రాక ఐదు నెలలుగా చిత్తూరు జిల్లా జైల్లో రిమాండు ఖైదీగా ఉన్నారు. జైలు జీవితం కష్టమే నిత్యం ఏసీలు, పబ్బులు, విమానాల్లో తిరుగుతూ విలాసవంతమైన జీవితం గడిపిన సంగీత ఛటర్జీ ఓ ఖైదీలా జైల్లో గడపలేకపోయారు. చిత్తూరులోని జిల్లా జైల్లో 150 మందికి పైగా ఖైదీలుంటే ఇందులో ఏడుగురే మహిళలున్నారు. వీరికి హిందీ రాదు. తన మనోభావాలను, బాధలను పంచుకోవడం సంగీతకు సాధ్యం కాలేదు. దీనికి తోడు కేసుల్లో బెయిల్ రాక తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది. మరుగుదొడ్లను శుభ్రపరిచే యాసిడ్‌ను తాగి ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. దీనికి తోడు జైల్లో వేధింపులున్నాయని ఓ సారి.. లేదని మరోసారి సంగీత మీడియాకు తెలిపారు. సంగీత పొట్ట మొత్తం శుభ్రం చేశామని ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని చిత్తూరు ప్రభుత్వాస్పత్రి వైద్యులు చెబుతున్నారు. గొంతు, శరీరం లోపల ఉన్న సున్నితమైన భాగాలేవైనా దెబ్బతిన్నాయేమో.. చూడాలంటే లేటెస్ట్ ల్యాప్రోస్కోపిక్ పరీక్ష అవసరమని తిరుపతి రుయాకు రిఫర్ చేసినట్లు వైద్యులు తెలిపారు. జైల్లో ఖైదీలు వారానికి ఓ సారి మరుగుదొడ్లు శుభ్రపరచాలని.. సంగీతకు టాయ్‌లెట్ క్లీనర్ ఇవ్వగా అది తాగడంతో అస్వస్థతకు గురైందని జైలు పర్యవేక్షకులు రాహుల్ తెలిపారు. -
సంగీత చటర్జీ ఆత్మహత్యాయత్నం
-
సంగీత చటర్జీ ఆత్మహత్యాయత్నం
చిత్తూరు: ఎర్రచందనం కేసులో పీడీ యాక్టుపై జైల్లో ఉన్న సంగీత చటర్జీ సబ్ జైల్లో ఆత్మహత్యాయత్నం చేసింది. గురువారం టాయిలెట్ క్లినర్ తీసుకుని బలవన్మరణానికి యత్నించింది. దీంతో అప్రమత్తమైన జైలు సిబ్బంది ఆమెను చికిత్స నిమిత్తరం చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. బెయిల్ రాకపోకడంతో నిరాశ చెంది ఆమె ఆత్మహత్యకు యత్నించినట్టు తెలుస్తోంది. కోల్‌కతాకు చెందిన సంగీత ఛటర్జీ గత కొన్ని రోజులుగా చిత్తూరు సబ్‌జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో కొన్ని నెలల క్రితం చిత్తూరు పోలీసులు కోల్‌కతాలో ఆమెను అరెస్టు చేశారు. ఎర్రచందనం అంతర్జాతీయ స్మగ్లర్ మార్కొండ లక్ష్మణ్ రెండో భార్యే సంగీత. మోడల్‌గా, ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేసిన సంగీతపై 2015లో చిత్తూరు జిల్లాలో రెండు ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న సంగీతను ప్రత్యేక పోలీసు బృందం పక్కా ప్రణాళికతో మార్చి నెలలో కోల్‌కతాలో అరెస్టు చేసి చిత్తూరుకు తీసుకొచ్చారు. సంగీత చటర్జీపై చిత్తూరు పోలీసులు ఆత్మహత్యాయత్నం కేసు నమోదు చేశారు. మానసిక ఒత్తిడి, బెయిల్ రాకపోవడంతో ఇలా చేసినట్లు సంగీత పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో ఈమెపై టూటౌన్ పోలీసులు ఆత్మహత్యాయత్నం కేసు నమోదు చేశారు. -
‘లక్ష్మణ’ గీత దాటిన సంగీత!
పోలీసుల ముప్పు ఉందని సంగీతకు భర్త లక్ష్మణ్ హెచ్చరిక పగలు పేయింగ్ గెస్ట్.. రాత్రులు పబ్ పబ్బుల్లో మన పోలీసులకు తప్పని చిందులు మూడుసార్లు విఫలం.. ఆపై విజయం చిత్తూరు (అర్బన్): ఎర్రచందనం కేసులో పీడీ యాక్టుపై జైల్లో ఉన్న సంగీత చటర్జీ భర్త మార్కొండ లక్ష్మణ్ గత నెల బెయిలుపై విడుదలయ్యాడు. అప్పటికే అజ్ఞాతంలో ఉన్న సంగీతను లక్ష్మణ్ హెచ్చరించాడు. ఎక్కడపడితే అక్కడ తిరగొద్దని, ఓకేచోట ఎక్కువ రోజులు గడపొద్దని, చుట్టు పక్కల ఎవరైనా రెక్కీ నిర్వహిస్తున్నారో చూసుకోమని సంగీతకు ఫోన్లో సూచిం చాడు. మదనపల్లె సబ్ జైలులో ఉన్న లక్ష్మణ్ తన స్నేహితుడి ద్వారా నెలకు సంగీతకు రూ.లక్ష నగదు అందజేస్తూ, ఆమె పోలీసుల దొరకకుండా ఎప్పటి కప్పుడు సలహాలు ఇస్తుండే వాడు. భర్త మాటల్లో కొన్నింటిని పాటించిన సంగీత ప్రధాన హెచ్చరికలను పెడచెవిన పెట్టింది.. పోలీసులకు చిక్కింది. మూడుసార్లు విఫలం సంగీతను పట్టుకోవడానికి చిత్తూ రు పోలీసులు దాదాపు ఏడాదిన్నకాలం గా ప్రయత్నిస్తున్నారు. గత ఏడాది ఏప్రిల్ నెలలో సంగీతను అరెస్టు చేయడానికి కోల్‌కతాకు వెళ్లిన పోలీసులకు ఆమె ఆచూకీ కనుక్కోవడానికే సరిపోయింది. మే 3వ తేదీన మరోమారు కోల్‌కతాకు వెళ్లిన పోలీసులు సంగీతను అదుపులోకి తీసుకున్నారు. కోల్‌కతాలోని న్యాయస్థానంలో హాజరుపరచి చిత్తూరుకు తీసుకురావాలనుకున్నా ఆమె నటనతో పోలీసు ల వ్యూహం బెడిసికొట్టింది. ఇక మూడోసారి 2016 అక్టోబర్‌లో మరోమారు సంగీతను పట్టుకోవడానికి పోలీసులు కోల్‌కతా వెళ్లారు. నాలుగురోజుల పాటు పలు ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ కనుక్కోలేకపోయారు. ఈసారి సఫలం గతం నేర్పిన అనుభవాల రీత్యా ఈసారి సంగీత కోసం పోలీసులు వెతుకుతూ కోల్‌కతాకు వెళ్లినట్లు ఎక్కడా సమాచారం బయటకు పొక్కకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి సంగీత పేయింగ్ గెస్ట్ (పీజీ)గా పలుచోట్ల నెలకు రూ.12 వేల అద్దె చెల్లించి సాధారణ మహిళగా ఉంటోం దని సమాచారం అందడంతో మార్చి 23న డీఎస్పీ, సీఐ, మహిళా ఎస్ఐతో పాటు ముగ్గురు సిబ్బంది కోల్‌కతాకు వెళ్లారు. అక్కడి కస్బా, రూబ్, సీఎన్ రాయ్ ప్రాంతాల్లో సంగీత తిరుగుతున్నట్లు సమాచారం అందినా 25 వరకు ఆచూకీ దొరకలేదు. నిరుత్సాహంతో ఉన్న పోలీసులకు ఓ సమాచారం అందింది. సోమవారం రూబ్ సెల్లార్‌లోని పబ్‌లో సంగీత ఉందని తెలిసింది. డీఎస్పీ గిరిధర్, సీఐ ఆదినారాయణ, ఎస్ఐ వాసంతి, మరో మహిళా కానిస్టే బుల్ జంటలుగా నటిస్తూ పబ్‌లోకి వెళ్లారు. అక్కడ సంగీతను చూశారు. నిర్ధారించుకోవడానికి కాలు కదుపుతూ చిందులేస్తూ దగ్గరకు వెళ్లి చూశారు. అవును.. అక్కడ సంగీత ఉందని నిర్ధారించుకున్నారు. అప్పటికే సమయం రాత్రి 2.30 గంటలు. అక్కడి నుంచి సంగీత నేరుగా సీఎన్ రాయ్ రోడ్డులోని పీజీ హాస్టల్ చేరుకుంది. పోలీసులు çసమీపంలో ఓ గది అద్దెకు తీసుకుని నిఘా ఉంచారు. మంగళవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో సంగీత మందులు తీసుకోవడానికి గది నుంచి బయటకొచ్చింది. ఒక్కసారిగా పోలీసులు ఆమెను చుట్టుముట్టారు. మర్యాదగా తమతో రావాలన్నారు. వాంతులు వస్తున్నట్లు.. కళ్లు తిరుగుతున్నట్లు సంగీత నటించినా పోలీసులు లెక్క చేయలేదు. నిమిషాల వ్యవధిలో ఆమెను కస్బా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి తమ వద్ద ఉన్న అరెస్టు వారెంట్లను చూపించారు. ఆ వెంటనే కోల్‌కతా విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి విమానంలో బెంగళూరు రావడం.. అటు నుంచి చిత్తూరుకు తీసుకురావడం చకచకా జరిగిపోయింది. పోలీసు కస్టడీకి సంగీత చిత్తూరు జిల్లా జైలులో ఉన్న సంగీత చటర్జీని కస్టడీకి ఇస్తూ పాకాల న్యాయస్థానం గురువారం ఆదేశాలు జారీచేసింది. సంగీతను తమ కస్టడికిస్తే ఆమెను విచారించి పలువురు నిందితుల పేర్లను తెలుసుకోవచ్చునని చిత్తూరు పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. పది రోజుల పాటు సంగీతను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. అయితే నాలుగు రోజులపాటు కస్టడీకి అనుమతిస్తూ న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. దీంతో పోలీసులు సంగీతను శుక్రవారం కస్టడీకి తీసుకునే అవకాశముంది. -
అంతర్జాతీయ లేడీ స్మగ్లర్ సంగీత అరెస్టు
కోల్‌కతాలో అదుపులోకి తీసుకొని చిత్తూరుకు తరలింపు చిత్తూరు (అర్బన్): ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో తప్పించుకు తిరుగుతున్న అంతర్జాతీయ స్మగ్లర్ సంగీత చటర్జీ(26)ని చిత్తూరు పోలీసులు ఎట్టకేలకు మంగళవారం కోల్‌కతాలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను చిత్తూరుకు తీసుకొచ్చారు. బుధవారం పాకాల న్యాయమూర్తి దేవేంద్రరెడ్డి ఎదుట హాజరుపరచగా.. 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆమెను చిత్తూరు జిల్లా జైలుకు తరలించారు. 2015లో కల్లూరులో నమోదైన ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు సంగీత చటర్జీపై కేసు నమోదైంది. కల్లూరుతో పాటు యాదమరి, నిండ్ర పోలీస్స్టేషన్లలోనూ ఆమెపై ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులున్నాయి. కోల్‌కతాకు చెందిన సంగీత చటర్జీ మోడలింగ్ రంగంలో ప్రవేశించి.. అనంతరకాలంలో ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేసింది. ఈ సమయంలోనే చెన్నైకి చెందిన మార్కొండ లక్ష్మణ్‌తో ఆమె ప్రేమలో పడింది. 2013లో వీరిద్దరి వివాహం జరిగింది. 2014లో ఎర్రచందనం కేసుల్లో లక్ష్మణ్‌ను చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. లక్ష్మణ్ జైల్లో ఉన్న సమయంలో తన స్నేహితుల ద్వారా కోట్ల రూపాయలను సంగీత బ్యాంకు ఖాతాలో జమ చేయించేవాడు. ఇందులో రూ.2 కోట్ల నగదును సంగీత హవాలా రూపంలో జాతీయ, అంతర్జాతీయ స్మగ్లర్లకు చేరవేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. -
సంగీతా చటర్జీకి 31వరకు గడువు
ఎర్రచందనం అంతర్జాతీయ మహిళా స్మగ్లర్ సంగీత చటర్జీ ఈనెల 31వ తేదీలోపు చిత్తూరు న్యాయస్థానంలో హాజరుకావాలని కోల్‌కతా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల క్రితం చిత్తూరు పోలీసులు ఈమెను అరెస్టు చేసి కోల్‌కతా కోర్టులో హాజరుపరిచింది. దీంతో.. తదుపరి విచారణకు చిత్తూరు కోర్టు నుంచి మినహాయించాలని సంగీత కోల్‌కతా కోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకుంటున్న విషయం తెలిసిందే. కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేస్తూ సంగీత చిత్తూరు కోర్టుకు హాజరయ్యేలా చూడాలని మన పోలీసులు ఇటీవల కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం కేసు విచారణకు హాజరుకాకుండా కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసింది. ఈనెలాఖరులోపు చిత్తూరు న్యాయస్థానంలో హాజరుకావాల్సిందేనని ఉత్తర్వులు జారీ చేసింది.