సంగీత చటర్జీ ఆత్మహత్యాయత్నం
చిత్తూరు: ఎర్రచందనం కేసులో పీడీ యాక్టుపై జైల్లో ఉన్న సంగీత చటర్జీ సబ్ జైల్లో ఆత్మహత్యాయత్నం చేసింది. గురువారం టాయిలెట్ క్లినర్ తీసుకుని బలవన్మరణానికి యత్నించింది. దీంతో అప్రమత్తమైన జైలు సిబ్బంది ఆమెను చికిత్స నిమిత్తరం చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. బెయిల్ రాకపోకడంతో నిరాశ చెంది ఆమె ఆత్మహత్యకు యత్నించినట్టు తెలుస్తోంది. కోల్‌కతాకు చెందిన సంగీత ఛటర్జీ గత కొన్ని రోజులుగా చిత్తూరు సబ్‌జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో కొన్ని నెలల క్రితం చిత్తూరు పోలీసులు కోల్‌కతాలో ఆమెను అరెస్టు చేశారు. ఎర్రచందనం అంతర్జాతీయ స్మగ్లర్ మార్కొండ లక్ష్మణ్ రెండో భార్యే సంగీత. మోడల్‌గా, ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేసిన సంగీతపై 2015లో చిత్తూరు జిల్లాలో రెండు ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న సంగీతను ప్రత్యేక పోలీసు బృందం పక్కా ప్రణాళికతో మార్చి నెలలో కోల్‌కతాలో అరెస్టు చేసి చిత్తూరుకు తీసుకొచ్చారు.
సంగీత చటర్జీపై చిత్తూరు పోలీసులు ఆత్మహత్యాయత్నం కేసు నమోదు చేశారు. మానసిక ఒత్తిడి, బెయిల్ రాకపోవడంతో ఇలా చేసినట్లు సంగీత పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో ఈమెపై టూటౌన్ పోలీసులు ఆత్మహత్యాయత్నం కేసు నమోదు చేశారు.