
‘ఎర్ర’దొంగలపై ముప్పేట దాడి
ఎర్రదొంగలపై ముప్పేట దాడితో స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు పోలీసు యంత్రాంగం ప్రణాళిక రచించింది.
ఎర్రచందనం స్మగ్లింగ్ అడ్డుకట్టకు ప్రణాళిక
తిరుపతి కేంద్రంగా ఆర్‌ఎస్‌ఏఎస్‌టీఎఫ్ ఏర్పాటు
నేడు కేంద్ర, సరిహద్దు రాష్ట్రాల అధికారులతో సమావేశం
తిరుపతి: ఎర్రదొంగలపై ముప్పేట దాడితో స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు పోలీసు యంత్రాంగం ప్రణాళిక రచించింది. ఇప్పటికే పోలీసు-అటవీశాఖలు సంయుక్తంగా తిరుపతి కేంద్రంగా రెడ్ శాండర్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్‌ఫోర్స్ (ఆర్‌ఎస్‌ఏఎస్‌టీఎఫ్)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన విషయం విది తమే. కర్ణాటక, తమిళనాడు పోలీసులు, డీఆర్‌ఐ (డెరైక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్), పీఐటీ (పోర్ట్ ట్రస్ట్ అథారిటీ), కస్టమ్స్ విభాగాలు సమన్వయంతో పనిచేస్తేనే ఎర్రదొంగల ఆట కట్టించవచ్చునని నిఘా వర్గాలు తేల్చి చెప్పాయి. ఆ మేరకు తమిళనాడు, కర్ణాటక డీజీపీలు, డీఆర్‌ఐ, ఈడీ, పీఐటీ, కస్టమ్స్ విభాగాల అధికారులతో తిరుపతిలో ఓ ప్రైవేటు హోటల్‌లో గురువారం డీజీపీ జేవీ రాముడు సమన్వయ సమావేశం నిర్వహించనున్నారు. పోలీసులు, అటవీశాఖ అధికారుల మధ్య సమన్వయ లోపం వల్లే ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేయలేకపోతున్నామని గుర్తించిన ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఏఎస్‌టీఎఫ్‌ను ఏర్పాటుచేసింది. 463 మంది సిబ్బంది ఏర్పాటయ్యే ఈ ప్రత్యేక దళం తిరుపతి కేంద్రంగా పనిచేస్తుందని ప్రకటించింది. ఒక్క ఆర్‌ఎస్‌ఏఎస్‌టీఎఫ్‌తో స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేయడం అసాధ్యమని నిఘా వర్గాలు ప్రభుత్వానికి తేల్చి చెప్పాయి.
సమన్వయంతోనే వేట..
చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో విస్తరించిన శేషాచలం, పాలకొండ, వెలిగొండ అడవుల నుంచి ఎర్రచందనం దుంగలను కర్ణాటక, తమిళనాడు మీదుగా నౌకాశ్రయాలకు చేర్చుతున్నారు. ప్రధానంగా చెన్నై, చిక్‌మంగళూరు, కృష్ణపట్నం నౌకాశ్రయాల ద్వారా ఎర్రచందనాన్ని ఎగుమతి చేస్తున్నట్లు గుర్తించారు. మయన్మార్, థాయ్‌లాండ్, మలేషియా, బ్యాంకాక్, చైనా తదితర దేశాల్లోని అంతర్జాతీయ స్మగ్లర్లు నౌకాశ్రయం నుంచి నేరుగా అంతర్జాతీయ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. దేశం నుంచి ఎగుమతి చేసిన స్మగ్లర్లకు అంతర్జాతీయ స్మగ్లర్లు నేరుగా బ్యాంకు ఖాతాల్లో పైకాన్ని జమ చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ప్రధానంగా ద్రవ్యమార్పిడికి అడ్డుకట్ట వేస్తే ఎర్రచందనం స్మగ్లింగ్‌కు చెక్ పెట్టవచ్చునని భావించిన పోలీసు ఉన్నతాధికారులు ఈడీతో పలు సందర్భాల్లో చర్చలు జరిపారు. ఓడరేవుల్లో ఎర్రచందనం ఎగుమతికి అడ్డుకట్ట వేయాలంటే పీఐటీ, కస్టమ్స్ అధికారుల సహకారం తప్పనిసరని ప్రభుత్వం గుర్తించింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ఈడీ, పీఐటీ, కస్టమ్స్, డీఆర్‌ఐ అధికారులతోనూ.. కర్ణాటక, తమిళనాడు డీజీపీలతోనూ సమన్వయ సమావేశాన్ని నిర్వహించాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆదేశించారు.
రెండు దశలుగా సమావేశం..
కేంద్రం హోంమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర డీజీపీ జేవీ రాముడు తిరుపతిలో తొలి సమన్వయ సమావేశాన్ని గురువారం నిర్వహించనున్నారు. సమావేశానికి తమిళనాడు, కర్ణాటక డీజీపీలతోపాటూ కస్టమ్స్, పీఐటీ, డీఆర్‌ఐ, ఈడీ అధికారులు, 60 మందికిపైగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు హాజరుకానున్నారు. ఈ సమావేశం రెండు విడతలుగా నిర్వహించనున్నారు. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఎర్రచందనం స్మగ్లింగ్‌పై సమన్వయ సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ తీవ్రవాద కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడానికి తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ డీజీపీలతో సెంట్రల్ ఐబీ అధికారులు సమావేశమవుతారు. తిరుమల శ్రీవారి ఆలయానికి ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉన్నట్లు ఐబీ గుర్తించిన నేపథ్యంలో మూడు రాష్ట్రాల డీజీపీలతో సమావేశం నిర్వహిస్తుండటం గమనార్హం.