
‘ఎర్రచందనం’పై సంఘటిత పోరాటం
తిరుపతిలో జనవరి మొదటి వారంలో సదస్సు
కర్ణాటక,తమిళనాడు ఉన్నతాధికారులు హాజరు
అన్ని శాఖలూ ఒకే వేదికపైకి అక్రమ రవాణా అరికట్టడమే లక్ష్యం
‘సాక్షి’తో చిత్తూరు ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్
చిత్తూరు : ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకోవడమే లక్ష్యంగా అంతర్రాష్ట్ర స్థాయిలో అన్ని శాఖల అధికారులను ఒకే వేదికపైకి తెచ్చి సంఘటిత పోరాటానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చిత్తూరు ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని శాఖల ఉన్నతాధికారులతో పాటు అటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన పోలీసు, ఫారెస్టు ఉన్నతాధికారులతో పెద్ద ఎత్తున సదస్సు నిర్వహించనున్నట్లు ఎస్పీ చెప్పారు. రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు ఇప్పటికే ఈ సదస్సుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. సోమవారం సాయంత్రం ఎస్పీ శ్రీనివాస్ ‘సాక్షి’తో మాట్లాడారు. చారిత్రక, విలువైన ఎర్రచందనాన్ని కాపాడడమే లక్ష్యంగా సంఘటిత పోరాటం చేస్తున్నట్లు చెప్పారు. చందనం అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలంటే మూడు రాష్ట్రాలు కలిసి పనిచేయాల్సి ఉందన్నారు. అందుకే కర్ణాటక,తమిళనాడు రాష్ట్రాల పోలీసు, ఫారెస్టు ఉన్నతాధికారులతో కలిసి చర్చించాల్సిన ఆవశ్యకతను గుర్తించామన్నారు. ఇదే విషయం డీజీపీ దృష్టికి తీసుకెళ్లామని ఎస్పీ తెలిపారు.
తక్షణమే తిరుపతిలో సదస్సు నిర్వహించాలని డీజీపీ సోమవారం ఆదేశాలు జారీ చేసినట్లు ఎస్పీ తెలిపారు. తిరుపతి సదస్సులో మూడు రాష్ట్రాల డీజీపీలతో పాటు మూడు రాష్ట్రాలకు చెందిన పోలీసు, అటవీశాఖ ఉన్నతాధికారులతో పాటు న్యాయశాఖకు సంబంధించిన ముఖ్యులు సైతం పాల్గొంటారన్నారు. మన రాష్ట్ర సరిహద్దు అటవీప్రాంతాల పరిధిలోని ఆయా జిల్లాల ఎస్పీలు సైతం సదస్సులో పాల్గొంటారని ఆయన తెలిపారు. జనవరి మొదటివారంలోనే సదస్సు ఉంటుందన్నారు. సదస్సు అనంతరం చందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు యూక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తామన్నారు. తొలుత ఎర్రచందనం విలువ - అక్రమ రవాణా అరికట్టడడంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఎంచుకున్నామన్నారు. ఇప్పటికే వర్క్‌షాపులు,కళాజాతాలతో ప్రజల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. చిత్తూరు ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు ఆయన చెప్పారు. సేఫ్ అండ్ సెక్యూరిటీకి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. నగరంలోని జ్యువెలరీ, షాపింగ్ మాల్స్ తదితర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. నగరంలో పట్రోలింగ్ కూడా తొందరలోనే ప్రారంభిస్తామన్నారు. పట్రోలింగ్ కోసం బ్లూ, వైట్ రక్షక్ వాహనాలను ఏర్పాటు చేస్తామన్నారు. సిగ్నల్స్‌కు సంబంధించి ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.
మొదట రోడ్లల్లో అడ్డంకిగా ఉన్న వాటిని గుర్తించి తొలగిస్తామన్నారు. గుర్తించిన ప్రాంతాల్లో జంక్షన్ ఇంప్రూవ్‌మెంట్ చేస్తామన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో ట్రాఫిక్ పై అవగాహన కల్పిస్తామన్నారు.వివిధ వర్గాలు, యూనియన్లను ఇందులో భాగస్వాములు చేయనున్నట్లు చెప్పారు. ఖర్చుతో కూడుకున్న సిగ్నల్స్ వ్యవస్థ ఏర్పాటు కోసం కార్పొరేషన్‌తోపాటు వ్యాపారవేత్తలు, ఎన్‌జీవోలు, ఎన్‌ఆర్‌ఐలను సంప్రదించే ఆలోచనలో ఉన్నట్లు ఎస్పీ చెప్పారు.