
పోలీసులకు ఫోన్ చేసి దొరికిపోయారు
ఒకరికి ఫోన్ చేయబోయి మరొకరి చేసిన ఫోన్ కాల్ తో అసలుకే ఎసరొచ్చింది. ఎర్రచందనం దుంగలను విక్రయించే యత్నంలో... స్మగ్లర్లు చేసిన ఫోన్ కాల్ పోలీసులకు వెళ్లింది. దీంతో కథ అడ్డం తిరిగింది. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా నిమ్మనపల్లె మండలం అగ్రహారం గ్రామంలో కొందరు స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలను దాచి ఉంచారు.
ఓ ఇంట్లో దాచి ఉంచిన దుంగలను స్మగ్లర్లు విక్రయించేందుకు యత్నించారు. ఈ క్రమంలోనే కొంత మంది కొనుగోలుదార్లకు ఫోన్ చేశారు. వీటిలో ఓ ఫోన్ కాల్ పొరపాటున పోలీసు అధికారులకు వెళ్లింది. అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న పోలీసులు.. పథకం ప్రకారం స్మగ్లర్లకు ఎలాంటి అనుమానం రాకుండా అగ్రహారంపై దాడి చేశారు. అక్రమంగా దాచిన ఒక టన్ను బరువున్న ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో ముగ్గురిని అరెస్టు చేశారు.