
10 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
► విలువ రూ.7.50 లక్షలు
► నలుగురు స్మగ్లర్లు అరెస్ట్
గూడూరు : ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి నుంచి రూ. 7.50 లక్షల విలువ చేసే 10 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో బుధవారం ఆయన వెంకటగిరి సీఐ శ్రీనివాసరావు, ఎస్సై ఆంజనేయరెడ్డిలతో కలిసి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పక్క రాష్ట్రాలకు చెందిన గ్యాంగ్ ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతోందని సమాచారం వచ్చిందన్నారు. ఎస్పీ ఆదేశాలతో గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు.
ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున వెంకటగిరి మండలం చెలికంపాడు పంచాయతీ వడ్డిపల్లి సమీపంలో ఓటుచేరు వద్ద వెంకటగిరి ఎస్సై, సీఐ, సిబ్బంది వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓ వాహనంలో వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరు మండలం గాంధీనగర్‌కు చెందిన ముదినేని విజయ్, అదే జిల్లా గంజరాజపురం గ్రామానికి చెందిన వెలుగు చిరంజీవి, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్త్రి మండలానికి చెందిన జింకల శివకుమార్‌తో పాటు వెంకటగిరి మండలం త్రిపురాంతపల్లికి చెందిన గుండగాని మల్లికార్జున 10 ఎర్రచందనం దుంగలు తరలిస్తున్నట్లు గుర్తించి దుంగలతో పాటు వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేయడంలో సీఐ శ్రీనివాసరావు, ఎస్సై ఆంజనేయరెడ్డి, ట్రైనీ ఎస్సైలు రాజేష్, శ్రీనివాసరావు, సిబ్బంది నాగేశ్వరరావు, దేవదానం, వేణు, ఉమతో పాటు అటవీ శాఖాధికారులు వెంకటేశ్వర్లు, రాజేంద్రప్రసాద్, వెంకట్రావును అభినందించారు. వారికి రివార్డుల కోసం సిఫార్సు చేయనున్నట్లు ఆయన తెలిపారు.