పోలీసులకు చుక్కలు చూపిస్తున్న
లేడీ డాన్ సంగీతా చటర్జీ
పట్టుకోడానికి ఆపసోపాలు
ఆమె అసోం వెళ్లిపోయినట్లు సమాచారం
చిత్తూరు: కాకులు దూరని కారడవి కటికనహళ్లికి వెళ్లారు. 32 మంది ఎర్ర చందనం దొంగల్ని పట్టుకున్నారు. ఇప్పటి వరకు 3 వేల మంది కూలీల్ని అరెస్టు చేశారు. దాదాపు 560 కేసులు నమోదు చేశారు. 58 మందిపై పీడీ యాక్ట్ పెట్టారు. 1,70 వేల కేజీల ఎర్రచందనాన్ని సీజ్‌చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టడానికి ఇన్ని చర్యలు చేపట్టిన పోలీసులకు లేడీ డాన్ సంగీతా చటర్జీ చుక్కలు చూపిస్తోంది. ఇదిగో వస్తా అంటూ ఎప్పటికప్పుడు పోలీసులను తప్పుదోవ పట్టిస్తోంది. దీంతో వారు ఎదురు చూపులతోనే కాలం వెళ్లబుచ్చుతున్నారు. పోలీసులే ఒక నిందితురాలి కోసం వేచి చూస్తుండటం గమనార్హం.
ఎర్ర చందనం లేడీ డాన్ సంగీతా చటర్జీపై కల్లూరు, నిండ్ర, యాదమరిలలో మూడు కేసులు నమోదయ్యాయి. దీంతో సంగీతను అరెస్ట్ చేయడానికి చిత్తూరు మహిళా డీఎస్పీ గిరిధర్, సీఐ ఆదినారాయణల బృందం ఇప్పటి వరకు రెండు సార్లు కలకత్తాకు వెళ్లారు. పీటీ వారెంట్ వేయడంలో పోలీసులు విఫలం అవడంతో ఆమె రాష్ట్రానికి రావడానికి అడ్డంకులు ఏర్పడ్డాయి. ఇంతలో కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేయడంతో ఆమెను అరెస్టు చేయడానికి పోలీసులు ఆపసోపాలు పడ్డారు. ఎలాగోలా చివరికి మేలో ఆమె బ్యాంక్ లాకర్‌ను తెరిచారు. అందులో ఉన్న 2కేజీల బంగారం, కేజీ వెండి, ఒక స్థలానికి చెందిన డాక్యుమెంట్లను సీజ్ చేశారు. గత శుక్రవారం బెయిలు గడువు ముగియడంతో సోమవారం చిత్తూరు కోర్టులో ఆమె హాజరవుతుందని పోలీసులు మీడియాకు లీకులు ఇచ్చారు. యథాప్రకారం శుక్రవారం కూడా కోర్టుకు హాజరు కాలేదు. కోర్టు ఎదుట తప్పని సరిగా హాజరు కావాల్సి ఉందని తెలియడంతో ఆమె కోల్‌కత్తా నుంచి అసోంకు పారిపోయినట్లు తెలిసింది.
కొపం ముంచుతున్న పోలీసుల అనైఖ్యత..
జిల్లా పోలీసులు చాలా వర్గాలుగా విడిపోయాయని తెలిసింది. దీంతో కేసుల పురోగతి ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్న చందాన తయారైంది. ఎర్రచందనం కేసుల్లో కొందరు బాగా సంపాదించారని పోలీసుల్లోని ఓ వర్గం ఆరోపించడంతో.. ఆ కేసుల్లో బాగా అనుభవం ఉన్న వారిని కాదని ఎలాంటి అనుభవం లేని బృందాన్ని కోల్‌కత్తాకు ఆ శాఖ పంపింది. ఈ బృందం పీటీ వారెంట్‌ను వేయడంలో కూడా విఫలం చెందడంతో ఇప్పటికీ సంగీతా చటర్జీని రాష్ట్రానికి తీసుకురావడంలో విఫలమయ్యారు. దీనికి తోడు కోల్‌కత్తాకు వెళ్లే బృందానికి సరిగా డబ్బుకూడా చెల్లించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.
సంగీత నేపథ్యం..
సంగీతది కోల్‌కత్తా. ఆమె వృత్తి రీత్యా ఎయిర్‌హోస్టెస్. అనంతరం మోడల్‌గా స్థిరపడింది. ఇదే సమయంలో మణిపూర్‌కు చెందిన ఎర్రచందనం స్మగ్లర్ లక్ష్మణన్‌కు ఆయన మొదటి భార్య ద్వారా సంగీత పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ద్వారా సంగీత లక్ష్మణన్‌ను రెండో వివాహం చేసుకుంది. ఆమెకు 3 ఫ్లాట్లు, కొన్ని ఇంటి స్థలాలు, ఉన్నట్లు గుర్తించారు.
చట్టరీత్యా ముందుకెళ్తాం
సోమవారం సంగీత చటర్జీను చిత్తూరు కోర్టులో హాజరుకావాలని కోల్‌కతా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఆమె రాలేదు. ఎందుకు రాలేదు..? పైకోర్టు ఏవైనా ఉత్తర్వులు ఇచ్చిందా..? ఉద్దేశపూర్వకంగా కోర్టు ఆదేశాలు దిక్కరించారా..? లాంటి విషయాలు తెలుసుకోవాల్సి ఉంది. ఈమెపై తదుపరి చట్టరీత్యా ముందుకెళతాం. - ఎం.గిరిధర్‌రావు, డీఎస్పీ, చిత్తూరు.
అదిగో.. ఇదిగో
Published Tue, Jul 12 2016 1:45 AM | Last Updated on Mon, Sep 4 2017 4:37 AM
Advertisement
Advertisement