ముగ్గురు ఎర్ర చందనం స్మగ్లర్ల అరెస్టు
నిందితుల్లో ఇద్దరు అన్నదమ్ములు
వారిచ్చిన సమాచారంతో కర్ణాటకలో దాడులు
రూ.కోటి విలువైన ఎర్ర దుంగల స్వాధీనం
చిత్తూరు (అర్బన్) : జిల్లాలోని బంగారుపాళ్యం, మదనపల్లె టూటౌన్ పోలీసు స్టేషన్‌ల పరిధిలోని ఆదివారం పోలీసులు వేర్వేరుగా జరిపిన దాడుల్లో ముగ్గురు ఎర్రచందనం స్మగ్లరు పట్టుబడ్డా రు. వారిలో మహ్మద్ అల్తాఫ్ హుస్సేన్ అలియాస్ అల్తాఫ్(36), అన్నదమ్ములు ఎస్.అరుల్(25), ఎస్.శరవణ(22) ఉన్నారు. వీరి నుంచి రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
నిందితులిచ్చినసమాచారంతో చిత్తూరు పోలీ సులు కర్ణాటక రాష్ట్రంలో భారీగా ఎర్ర డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం స్థానిక పోలీసు అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో ఓఎస్డీ రత్న ఈ మేరకు వివరాలు వెల్లడిం చారు. కర్ణాటక రాష్ట్రం దొడ్లబళ్లాపూర్, కడనూర్ గ్రామంలో అంజాద్ అలియాస్ మున్నాకు చెందిన మామిడి తోటలో సోదాలు నిర్వహించిన పోలీసులు 3 టన్నుల ఎర్రచందనం దుంగల్ని స్వాధీనం చేసుకున్నారన్నారు. అంజాద్ పారిపోయాడని, దుంగల విలువ రూ.కోటి ఉంటుందని తెలిపారు.
నిందితుల వివరాలిలా..
మదనపల్లె టూటౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో దాడులు చేసిన పోలీసులు చిత్తూరు నగరంలోని జాన్స్ గార్డెన్‌కు చెందిన మహ్మద్ అల్తాఫ్ హుస్సేన్ అలియాస్ అల్తాఫ్‌ను అరెస్టు చేశారని ఓఎస్డీ తెలిపారు. డిగ్రీ వరకు చదువుకున్న ఇతను 2010 నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ఉన్నాడన్నారు. పేరు మోసిన స్మగ్లర్ షరీఫ్‌కు ముఖ్య అనుచరుడని, ఆంధ్ర రాష్ట్రంతో పాటు తమిళనాడు, కర్ణాటకకు చెందిన పలువురు స్మగ్లర్లతో ఇతనికి పరిచయాలు ఉన్నాయని వెల్లడించారు. అల్తాఫ్‌పై ఇప్పటి వరకు జిల్లాలో ఆరు కేసులున్నాయి. ఇక బంగారుపాళ్యం స్టేషన్ పరిధిలో జరిపిన సోదాల్లో తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా ఉత్తస్‌గారై తాలూకా కీలమత్తూరుకు చెందిన అన్నదమ్ములు ఎస్.అరుల్, ఎస్.శరవణలను పోలీసులు పట్టుకున్నారు. వీరిద్దరూ జేసీబీ డ్రైవర్లుగా పని చేసేవారని, గత ఆరు నెలలుగా ఎర్రచందనం స్మగ్లింగ్‌లో పెలైట్‌గా వ్యవహరిస్తున్నారని ఓఎస్డీ వివరించారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన బంగారుపాళ్యం, మదనపల్లె పోలీసుల్ని ఓఎస్డీ ప్రత్యేకంగా అభినందించారు. విలేకరుల సమావేశంలో డీఎస్పీలు గిరిధర్, లక్ష్మీనాయుడు, తదితరులు పాల్గొన్నారు.