ఎర్రచందనం దుంగలను అక్రమంగా రవాణా చేసి గోదాముల్లో నిల్వ చేసిన కర్ణాటకకు చెందిన ఐదుగురు స్మగ్లర్లను చిత్తూరు పోలీసులు బుధవారం అరెస్టుచేశారు. నిందితుల నుంచి నాలుగు వాహనాలు, ఏడు టన్నుల బరువున్న 320 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలను బుధవారం చిత్తూరు ఎస్పీ శ్రీనివాస్ వెల్లడించారు.
కర్ణాటకలో ఎర్రచందనం స్మగ్లర్లు ఉన్నారనే సమాచారంతో పోలీసులు గత వారం రోజులుగా బెంగళూరు సమీపంలోని కటికనహళ్లి, గిడ్డనహళ్లి ప్రాంతాల్లో దాడులు చేశారు. ఈ దాడుల్లో కర్ణాటకకు చెందిన జమీర్‌ఖాన్ (26), అదిల్ షరీఫ్ (27), షేక్ ముబారక్(26), తౌసీఉల్ల ఖాన్ (30), మహ్మద్ యూసఫ్ (27)అనే ఐదుగురు స్మగ్లర్లను అరెస్టుచేశారు.
మరో స్మగ్లర్ ఫసీ నిర్వహిస్తున్న ఎర్రచందనం డంప్‌ను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతనితో పాటు అతని గ్యాంగ్ పరారీలో ఉంది. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న వాహనాలు, ఎర్రచందనం విలువ దాదాపు రూ.3 కోట్లు ఉంటుందని ఎస్పీ తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామనీ, త్వరలోనే వారిని కూడా అరెస్టు చేస్తామన్నారు.