ఎర్రదొంగలపై బిగుస్తున్న ఉచ్చు | redwood practice match ind vs trap | Sakshi
Sakshi News home page

ఎర్రదొంగలపై బిగుస్తున్న ఉచ్చు

Published Tue, Jun 3 2014 1:19 AM | Last Updated on Sat, Sep 2 2017 8:13 AM

ఎర్రదొంగలపై బిగుస్తున్న ఉచ్చు

ఎర్రదొంగలపై బిగుస్తున్న ఉచ్చు

  •       ఇప్పటికే ఇద్దరిపై పీడీ యాక్టు నమోదు
  •      మరో నలుగురిపైనా పీడీ యాక్టు నమోదుకు రంగం సిద్ధం
  •      కలెక్టర్ అనుమతి పొందిన పోలీసు అధికారులు
  •      రహస్య ప్రదేశంలో నలుగురు బడా స్మగ్లర్ల విచారణ
  •      ఇంకో ఇద్దరు స్మగ్లర్ల కోసం ప్రత్యేక బృందాల గాలింపు
  •  సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లా పోలీసులు ఎర్రచందనం స్మగ్లర్లపై ఉచ్చుబిగిస్తున్నారు. ఇప్పటి వరకు పలుమార్లు ఎర్రచందనం స్మగ్లింగ్ చేసి పోలీసులకు పట్టుబడకుండా తప్పించుకుని తిరుగుతూ, కేసుల్లో ఉన్న కీలక స్మగ్లర్లను అదుపులోకి తీసుకునేందుకు రహస్యంగా పావులు కదిపారు. గడచిన రెండు రోజుల్లోనే పాత స్మగ్లర్లను నలుగురిని అదుపులోకి తీసుకుని చిత్తూరు నగరంలోనే రహస్యంగా విచారిస్తున్నారు. వారిలో ఇప్పటికే ఇద్దరిపై ప్రివెంటివ్ డిటెంక్షన్ (పీడీ) యాక్టు నమోదు చేసినట్లు సమాచారం.

    మరో నలుగురిపై కూడా పీడీ యాక్టు కింద కేసు నమోదు చేసేందుకు పోలీసులు జిల్లా ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ ఆదేశాల మేరకు రంగం సిద్ధం చేశారు. ఈ యాక్టు కింద ఒకసారి జైలుకు వెళ్తే సంవత్సరం వరకు బయటకు వచ్చే అవకాశం ఉండదు. సామాన్యంగా బెయిల్ రాదు. రాష్ట్ర స్థాయి అధికారుల నుంచి ఎర్రచందనం కేసుల్లో పురోగతి గురించి ఒత్తిడి ఎక్కువ అవుతుండటంతో వారం రోజుల్లో  దర్యాప్తునకు సంబంధించి ఫలితాలు చూపించాలనే పట్టుదలతో చిత్తూరు, తిరుపతి అర్బన్ పోలీసు జిల్లాల అధికారులు పరుగులుదీస్తున్నారు.

    తిరుపతి అర్బన్ పోలీసు జిల్లా పరిధిలో కూడా పేరు మోసిన నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లపై పీడీ యాక్టు పెట్టేందుకు పోలీసులు కలెక్టర్ అనుమతి కోరినట్లు సమాచారం. అదుపులో ఉన్న ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి కీలక సమాచారం రాబట్టిన తరువాత రెండు మూడు రోజుల్లో వీరి అరెస్టును అధికారికంగా చూపించనున్నారు. అయితే స్మగ్లర్లపై పీడీ యాక్టు నమోదుకు సంబంధించి డీఆర్వో ఒంగోలు శేషయ్యను వివరణ కోరగా, అధికారికంగా తాము ఆ పేర్లు చెప్పేందుకు వీలులేదని, రహస్యంగా ఉంచాలని సమాధానమిచ్చారు.
     
    పోలీసుల అదుపులో నలుగురు స్మగ్లర్లు

    చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ఆరితేరిన కీలక వ్యక్తుల్లో  నలుగురు స్మగ్లర్లు ఉన్నట్లు సమాచారం. వీరిని అరెస్టు చూపకుండా రహస్యంగా దర్యాప్తు నిర్వహిస్తున్నారు. పీడీ యాక్టు పెట్టనున్న స్మగ్లర్లలో రెడ్డినారాయణతోపాటు టీడీపీతో సంబంధాలు ఉన్న మరో ఇద్దరు పేరు మోసిన స్మగ్లర్లు ఉన్నారు. పోలీసులు పీడీ యాక్టు పెట్టినవారిలో మహేష్‌నాయుడు, భాస్కర్‌నాయుడు ఉన్నారు. చిత్తూరు నగరానికే చెందిన మరో స్మగ్లర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

    ఇతనిని కూడా రెండు రోజులుగా రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. తెలుగుదేశంతో దగ్గరి సంబంధాలు ఉన్న ఇద్దరు స్మగ్లర్లపై పీడీ యాక్టు పెట్టరాదని జిల్లాకు చెందిన కొందరు టీడీపీ నాయకులు అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు, పీడీ యాక్టు నమోదు వివరాలు  రెండు రోజుల్లో అధికారికంగా వెల్లడిస్తామని ఎస్పీ రామకృష్ణ చెబుతున్నారు. అయితే రహస్య విచారణ జరుగుతుండగానే ఒకరిద్దరు పోలీసు అధికారులు  కొన్ని పత్రికలకు మాత్రం సమాచారం లీక్ చేస్తున్నారు.
     
    రంగంలో 15 పోలీసు బృందాలు

    చిత్తూరు జిల్లాతోపాటు, తమిళనాడు, కర్ణాటకల్లోని కీలక స్మగ్లర్లను పట్టుకునేందుకు పోలీసులు వేట ము మ్మరం చేశారు. ఇందుకుగాను 15 పోలీసు ప్రత్యేక బృందాలు పని చేస్తున్నాయి. ఈ బృందాలు ఇప్పటికే అదుపులో ఉన్న స్మగ్లర్లు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆయా ప్రాంతాలకు వెళ్లి ఎర్రచందనం స్మగ్లింగ్‌తో సం బంధం ఉన్నవారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రణాళిక రూపొందించారు. క్షేత్ర స్థాయిలో కూలీలను ఎవరు పంపిస్తున్నారు? వారికి ఎవరు డబ్బులు ఇస్తున్నారు? అనే విషయూలను కనుక్కుని వారిని కూడా పట్టుకొచ్చేందుకు ప్రత్యేక బృందాలు వెళ్లినట్లు తెలుస్తోంది.
     
    స్మగ్లర్ల జాబితాలు సిద్ధం
     
    ఎర్రచందనం స్మగ్లర్లకు సంబంధించి పోలీసులు జాబితాలను సిద్ధం చేశారు. మన రాష్ట్రంతోపాటు, తమిళనాడు, కర్ణాటకకు చెందిన అంతర్రాష్ట్ర స్మగ్లర్ల జాబితా రూపొందించారు. శేషాచల కొండలకు కూలీలను సరఫరా చేస్తున్నవారు, వారికి డబ్బులు ఇస్తున్నవారు ఎవరు, మధ్యవర్తులుగా ఉంటున్న వారెవరు ? అనే వివరాలతోనూ స్మగ్లర్ల జాబితాలను సిద్ధం చేశారు. కొందరి మొబైల్ ఫోను నెంబర్లు సేకరించి వారి నెంబర్లపై నిఘా ఉంచారు. వారి కదలికలను నిశితంగా గమనిస్తున్నారు.
     
    పీడీ యాక్టు అంటే...

    పీడీ(ప్రివెంటివ్ డిటెన్షన్)యాక్టు... ఇది ప్రస్తుతం ఎర్రచందనం స్మగ్లర్లకు చెమటలు పట్టిస్తున్న చట్టం. ఈ యాక్టు (చట్టం) కింద కేసు నమోదు చేయడానికి సర్వాధికారం జిల్లా కలెక్టర్‌కే ఉంటుంది. ఎవరైనా వరుసగా నేరాలు చేస్తున్నా, ప్రజలు, ప్రభుత్వాలకు చెందిన ఆస్తులు, వస్తువులను ధ్వంసం చేస్తున్నా, జాతీయ గుర్తింపు ఉన్న వన్య ప్రాణులు, వృక్ష సంపదను అక్రమంగా తరలిస్తున్నా ఈ యాక్టు నమోదు చేస్తారు.

    వరుసగా క్రిమినల్ కేసులకు పాల్పడే వారిపై కూడా ఈ చట్టం కింద కేసులు పెడతారు. నిందితుడిపై పీడీ యాక్టు నమోదు చేయాలంటే సంబంధిత ఎస్పీ, అటవీశాఖ, ఎక్సైజ్ అధికారులు జిల్లా కలెక్టర్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. జిల్లా కలెక్టర్ అనుమతించిన వెంటనే నిందితున్ని అరెస్టు చేసి పోలీసులు అతనిపై పీడీ యాక్టు నమోదు చేసి జిల్లా జైలుకు కాకుండా సెంట్రల్ జైలుకు తరలిస్తారు.

    ఒకసారి పీడీ యాక్టు నమోదు చేసిన ముద్దాయికి ఏడాది వరకు బెయిల్ ఇవ్వకూడదని ఈ చట్టం చెబుతోంది. అతడి నేరాలు, పోలీసులు నమోదు చేసిన సెక్షన్ల ఆధారంగా ఆ తరువాత శిక్షపడే అవకాశం ఉంటుంది. ఇక జైలు నుంచి విడుదలైన ముద్దారుు మళ్లీ నేరాలకు పాల్పడితే అతడిని సమాజం నుంచి బహిష్కరించి ఏడాది వరకు సొంత జిల్లాలో ఉంచకుండా చేస్తారు.
     -న్యూస్‌లైన్, చిత్తూరు (అర్బన్)
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement