న్యూఢిల్లీ: 1.2 బిలియన్ డాలర్ల రుణాన్ని (టీఎల్‌బీ) త్వరితగతిన చెల్లించాలంటూ ఒత్తిడి తెస్తోందన్న ఆరోపణలతో ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ రెడ్‌వుడ్‌పై దేశీ ఎడ్‌టెక్ సంస్థ బైజూస్.. అమెరికాలోని న్యూయార్క్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. టీఎల్‌బీ ఒప్పంద నిబంధనలకు విరుద్ధంగా రెడ్‌వుడ్ తమ రుణంలో గణనీయమైన భాగాన్ని కొనుగోలు చేసి, తమపై బెదిరింపు వ్యూహాలను ప్రయోగిస్తోందని ఆరోపించింది.
ఈ నేపథ్యంలో రుణదాతగా రెడ్‌వుడ్ అనర్హమైనదిగా తాము పరిగణిస్తున్నట్లు బైజూస్ ఒక ప్రకటనలో తెలిపింది. న్యాయ వివాదం తేలేంత వరకు టీఎల్‌బీకి సంబంధించిన ఎటువంటి చెల్లింపులు చేయరాదని నిర్ణయించుకున్నట్లు వివరించింది. వడ్డీ కింద సోమవారం నాడే 40 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉన్నప్పటికీ బైజూస్ చెల్లించలేదు. సాంకేతిక డిఫాల్టులు తదితర కారణాలతో రుణదాతలు అనవసర చర్యలకు దిగాయని.. తమ అమెరికా విభాగం బైజూస్ ఆల్ఫాను ఆధీనంలోకి తీసుకోవడంతో పాటు కొత్త మేనేజ్‌మెంట్‌ను నియమించాయని బైజూస్ తెలిపింది.
తాము టీఎల్‌బీ రుణదాతలతో చర్చలు జరిపేందుకు, వారు తమ చర్యలను వెనక్కి తీసుకుంటే యథాప్రకారం చెల్లింపులను జరిపేందుకు సిద్ధంగానే ఉన్నామని వివరించింది. మరోవైపు, తప్పుడు విధానాలకు పాల్పడిందన్న ఆరోపణలతో బైజూస్ అమెరికన్ విభాగాలపై(బైజూస్ ఆల్ఫా, టాంజిబుల్ ప్లే) రుణదాత గ్లాస్ ట్రస్ట్ కంపెనీ, ఇన్వెస్టరు తిమోతి ఆర్ పోల్ దావా వేశారు. బైజూస్ ఆల్ఫా నుంచి 500 మిలియన్ డాలర్లను కంపెనీ దారి మళ్లించిందని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment