శేషాచలం ఎన్‌కౌంటర్‌పై
{పత్యేక బృందం దర్యాప్తు
తమిళనాడులోనే సాక్షుల నుంచి వాంగ్మూలాల నమోదు
యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి)/పుత్తూరు: శేషాచలం ఎన్‌కౌంటర్‌పై సాక్షుల విచారణను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మంగళవారం అర్ధంతరంగా ముగించింది. ఏప్రిల్ 7న శేషాచలం అడవుల్లో 20 మంది ఎర్రచందనం కూలీలు ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన కేసు విచారణకు హైకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. ‘సిట్’ 20 రోజులుగా సాక్షుల విచారణకు శ్రీకారం చుట్టింది. ఎన్‌కౌంటర్ బూటకమని సాక్షులుగా ఉంటున్న తమిళనాడుకు చెందిన కూలీలు బాలచందర్, శేఖర్, ఇలన్‌గోవన్ ఇప్పటికే హైకోర్టులో ఫిర్యాదు చేశారు. వారిని వారి ప్రాంతాల్లోనే విచారించాలని జూన్ 29న సిట్‌ను హైకోర్టు ఆదేశించింది. ఆ మేరకు ఈనెల 15న సిట్ బృందం తమిళనాడులోని మధురై వెళ్లింది. అక్కడ పీపుల్స్ వాచ్ సంస్థ అధీనంలో ఉన్న సాక్షులకు నోటీసులు ఇచ్చి 20వ తేదీన తమిళనాడు, ఏపీ పోలీసుల పటిష్ట భద్రత మధ్య తిరుణ్ణామలైకి సాక్షులను పిలిపించి విచారించారు.
మంగళవారం తెల్లవారుజామున వారిని తిరుపతికి తీసుకు రావడానికి ప్రయత్నించారు. పుత్తూరు పట్టణానికి వచ్చిన తరువాత సాక్షుల్లో ఒకరైన బాలచందర్ తాను తిరుపతికి రానని స్పష్టంచేశారు. ఏపీ పోలీసులంటే తనకు భయమనీ, తన కుటుంబ సభ్యులను అంతం చేసిన విధంగానే తనను ఏమైనా చేస్తారనే అనుమానం ఉందన్నారు. దీంతో అధికారులు పుత్తూరు బస్టాండులో ఆయన వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. ఈనెల 27న విచారణకు అందుబాటులో ఉండాలని చెప్పి బందోబస్తు మధ్య తమిళనాడు పంపారు. అనంతరం మిగిలిన ఇద్దరు సాక్షులను తిరుపతికి తీసుకొచ్చి మహిళా వర్సీటీలోని అతిథిగృహంలో విచారించారు. అనంతరం సిట్ అధికారి రమణకుమార్ మీడియాతో మాట్లాడుతూ సాక్షులు సహకరించనందున విచారణ అర్ధాంతరంగా ముగిసిందని తెలిపారు. వచ్చే నెల మూడో తేదీన హైకోర్టుకు స్టేటస్ రిపోర్టు అందజేస్తామని చెప్పారు.
అర్ధంతరంగా ముగిసిన ‘సిట్’ విచారణ
Published Wed, Jul 22 2015 1:42 AM | Last Updated on Sun, Sep 3 2017 5:54 AM
Advertisement
Advertisement