తిరుమల/హైదరాబాద్: చిత్తూరు జిల్లాలోని శేషాచలంలో విలువైన ఎర్రచందనం సంపదను కొల్లగొట్టేందుకు స్మగ్లర్లు తెగబడుతున్నారు. అడ్డువచ్చిన ఫారెస్ట్ అధికారులపై దాడులకు దిగుతున్నారు. దీంతో స్మగ్లర్లకు, పోలీసులకు మధ్య భీకర పోరుకు నెలవుగా శేషాచలం అడవులు మారాయి. 2013లో స్మగ్లర్లు, కూలీలు శేషాచల అడవిలోని గంజిబండ వద్ద ఫారెస్ట్ సిబ్బందిపై దాడి చేసి ఇద్దరు అధికారులను దారుణంగా హతమార్చారు. ఇందుకు ప్రతిగా పోలీసులు తుపాకులకు పనిపెట్టారు. ఈ క్రమంలో శేషాచలంలో యుద్ధవాతావరణం నెలకొంది. ఇందుకు సంబంధించిన ఘటనల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
2013 డిసెంబర్ 15న తిరుమలకు 13 కిలోమీటర్ల దూరంలోని శేషాచల అడవిలోని గంజిబండ వద్ద సుమారు వందమంది ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీలు ఫారెస్ట్ సిబ్బందిపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో తిరుపతి వైల్డ్‌లైఫ్ ఫారెస్ట్ విభాగం తిరుమలశాఖ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఎన్‌ఆర్ శ్రీధర్(50), అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ డేవిడ్ కరుణాకర్(49)ను రాళ్లతో మోది, కట్టెలతో కొట్టి అతిక్రూరంగా హతమార్చారు. ఇదే ఘటనలో మరో ముగ్గురు అధికారులు, సిబ్బంది గాయాలపాలయ్యారు.
2014, మే 28న శేషాచలం అడవుల్లో తిరుమల ఆలయానికి పడమర దిశలో పది కిలోమీటర్ల దూరంలోని తలకోన చామలరేంజ్‌కు మధ్యలో.. బొద్దిలేడు ప్రాంతంలోని గుడ్డెద్దుల బండ వద్ద స్మగ్లర్లు, టాస్క్‌ఫోర్సు ఎస్‌టీఎఫ్ దళాలకు మధ్య భీకరపోరు జరిగింది. ఈ ఘటనలో తమిళనాడులోని తిరువన్నామలైకు చెందిన ముగ్గురు కూలీలు మృతిచెందారు.
అదేవిధంగా చామలరేంజ్ పరిధిలో భాకరాపేట సమీప ప్రాంతాల్లోనూ, మామండూరు రేంజ్ పరిధిలోని శెట్టిగుంట, ఓబులవారి పల్లిలో జరిగిన కూంబింగ్ ఎన్‌కౌంటర్ ఘటనల్లో మరో ఐదుగురు ఎర్రచందనం కూలీలు హతమయ్యారు.
తాజాగా మంగళవారం వేకువజామున చీకటీగలకోన, సచ్చినోడిబండ ప్రాంతాల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే కూలీలకు, పోలీసులకు భీకర పోరు జరిగింది. ఈ ఘటనల్లో 20 మంది కూలీలు మరణించారు. శేషాచలంలో ఇదే అతిపెద్ద ఎన్‌కౌంటర్‌గా నిలిచింది.
రాష్ట్రంలో పది నెలల కాలంలో ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీలకు, పోలీసులకు మధ్య 15 సార్లు ఎదురుకాల్పుల జరిగాయి. తాజాగా జరిగిన 15వ ఎన్‌కౌంటరే అత్యంత భారీది.
ఈ పదినెలల్లో ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి మొత్తం 831 కేసులు నమోదు చేసిన అధికారులు.. స్మగ్లర్లు, కూలీలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 5,237 మందిని అరెస్టు చేశారు.
గంజిబండ నుంచి చీకటీగలకోన దాకా..
Published Wed, Apr 8 2015 3:10 AM | Last Updated on Thu, Oct 4 2018 6:03 PM
Advertisement
Advertisement