ఎర్రచందనం కేసులు ఏమైనట్టో.. | Redwood timber to investigate cases of illegal migration | Sakshi
Sakshi News home page

ఎర్రచందనం కేసులు ఏమైనట్టో..

Published Mon, Oct 27 2014 10:00 PM | Last Updated on Thu, Oct 4 2018 6:03 PM

ఎర్రచందనం కేసులు ఏమైనట్టో.. - Sakshi

ఎర్రచందనం కేసులు ఏమైనట్టో..

నేలకొండపల్లి : మండలంలో లక్షల విలువైన ఎర్ర చందనం కలప అక్రమ తరలింపు కేసుల దర్యాప్తులో పురోగతి కనిపించడం లేదు. కలప దుంగలను నిల్వ ఉంచిన రైతులపై కేసులు నమోదు చేసిన అటవీ అధికారులు.. అసలు సూత్రధారులను పట్టుకునేందుకు ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదు. స్మగ్లర్లకు సంబంధించి నమోదైన కేసులు విచారణలో ఉన్నాయా, మూసివేశారా అన్నది కూడా తెలీడం లేదు.
 
నేలకొండపల్లి మండలంలోని చెన్నారం, కోరట్లగూడెం, అమ్మగూడెం, మండ్రాజుపల్లి, బైరవునిపల్లి, కోనాయిగూడెం, చెరువుమాధారం తదితర గ్రామాల్లోని రైతులకు ఎర్రచందనం మొక్కలను అటవీ అధికారులు ఏనాడో పంపిణీ చేశారు. వాటిని ఆ రైతులు తమ ఇంటి ఆవరణలో తదితరచోట్ల నాటారు. అవి నేడు వృక్షాలుగా మారాయి. వీటికి అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ ఉందన్న విషయం కొన్నాళ్ల కిందటి వరకు ఈ రైతులకు తెలీదు. వీటిని నరికితే కేసులు పెడతామని అటవీ అధికారులు హెచ్చరించడంతో రైతులకు ఏం చేయాలో అంతుబట్టలేదు. దీనిని అక్రమార్కుల (స్మగ్లర్ల) ముఠా అవకాశంగా మలుచుకుంది. ఈ ముఠా, నేలకొండపల్లి మండలంలో కొందరు ఏజెంట్ల ద్వారా ఎర్రచందనం చెట్లు పెంచిన రైతులకు నామమాత్రంగా ముట్టజెప్పి, ఆ చెట్లను గుట్టుచప్పుడు కాకుండా నరికి తరలించారు. ఈ దుంగలను చెన్నారం, బోదులబండ, షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో ఈ దుంగలను అటవీ అధికారులు పట్టుకుని కేసులు నమోదు చేశారు.
 
కానరాని పురోగతి
ఈ కేసులకు సంబంధించి అటవీ అధికారులు తూతూ మంత్రంగా విచారణ జరిపి ఊరుకున్నారు. ఎర్రచందనం స్మగ్లర్ల ముఠా సూత్రధారులను ఇప్పటివరకు పట్టుకోలేకపోయారు. గత ఏడాది చెన్నారంలో విలువైన ఎర్రచంద నం దుంగలను పట్టుకున్నారు. నాలుగు నెలల క్రితం మండలంలోని షుగర్  ఫ్యాక్టరీ సమీపంలోగల ఓ రైతు ఇంటి నుంచి 82 దుంగలను స్వాధీనపర్చుకున్నారు. ఆ తరువాత వారం రోజుల లోపులో మండలంలోని బోదులబండ గ్రామంలో గల మామిడి తోటలో భారీఎత్తున ఎర్రచందనం దుంగలు పట్టుకున్నారు. దీనిపై అటవీ అధికారులు కనీసం కేసు కూడా నమో దు చేయకుండా చేతులు దులుపుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. పోలీసు అధికారు లు కూడా ఈ ఎర్ర చందనం స్మగ్లింగ్‌పై దృష్టి సారించడం లేదు. స్మగ్లర్లపట్ల అటవీ అధికారు ల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 
రైతుల్లో అయోమయం
మండలంలోని చెన్నారం, కోరట్లగూడెం, అమ్మగూడెం తదితర గ్రామాలలో అనేకమంది వద్ద ఎర్ర చందనం చెట్లు ఉన్నాయి. వీటిని నరికేందుకు అటవీ అధికారులు అనుమతి ఇవ్వడం లేదు. ఒకవేళ నరికితే కేసులు తప్పవని హెచ్చరిస్తున్నారు. రైతులకిది సమస్యగా మారింది. ఏపుగా పెరిగిన ఈ చెట్లు గాలిదుమారానికి ఎక్కడ విరిగిపడతాయోనని వారు ఆందోళనతో ఉన్నారు. నరికేసి అమ్ముకుందామంటే.. కేసులు పెడతామంటూ అటవీ అధికారులు బెదిరిస్తున్నారు. దీంతో, రైతులు అయోమయంలో ఉన్నారు. వీటిని ఇలా ఎంతకాలం ఉంచాలని వారు ప్రశ్నిస్తున్నారు. దీనికి ప్రభుత్వమే పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు.
 
పట్టాదారులైనా అమ్మేందుకు వీల్లేదు
‘‘ఎర్ర చందనం చెట్లు పెంచిన పట్టాదారులైనా సరే.. వాటిని అమ్ముకునే అవకాశం లేదు. గత ఏడాది చెన్నారంలో లభించిన ఎర్ర చందనానికి సంబంధించిన కేసులో ఇంకా పూర్తి వివరాలు లభించలేదు. మండలంలో చాలాచోట్ల ఎర్ర చందనం చెట్లను గుర్తించాం. షుగర్ ఫ్యాక్టరీ వద్ద నాలుగు నెలల క్రితం దొరికిన ఎర్ర చందనం దుంగలకు సంబంధించి ఇద్దరిపై కేసు నమోదు చే శాం. వారిని పట్టుకుని రిమాండ్ చేయాల్సుంది. బోదులబండలో ఎర్ర చందనం నరికిన విషయం మా దృష్టికి రాలేదు.
  - రవికుమార్, కూసుమంచి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement